జ‌గ‌న్ గోడు విన‌డానికి మోదీ సిద్ధ‌మా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూట‌మి దాష్టీకాల్ని వివ‌రిస్తూ ప్ర‌ధాని మోదీకి మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి లేఖ రాశారు. త‌న గోడు విన‌డానికి అపాయింట్‌మెంట్ ఇవ్వాల‌ని జ‌గ‌న్ అభ్య‌ర్థించారు. అయితే జ‌గ‌న్ ఆవేద‌న ఆల‌కించ‌డానికి ప్ర‌ధాని మోదీ…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూట‌మి దాష్టీకాల్ని వివ‌రిస్తూ ప్ర‌ధాని మోదీకి మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి లేఖ రాశారు. త‌న గోడు విన‌డానికి అపాయింట్‌మెంట్ ఇవ్వాల‌ని జ‌గ‌న్ అభ్య‌ర్థించారు. అయితే జ‌గ‌న్ ఆవేద‌న ఆల‌కించ‌డానికి ప్ర‌ధాని మోదీ అపాయింట్‌మెంట్ ఇస్తారా? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ప్ర‌ధానికి రాసిన లేఖ‌లో జ‌గ‌న్ కీల‌క అంశాలు ప్ర‌స్తావించారు. కూట‌మి ప్ర‌భుత్వం హింసాయుత‌, క‌క్ష‌పూరిత రాజ‌కీయాలు చేస్తోందని విమ‌ర్శించారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటు అయిన‌ప్ప‌టి నుంచి ఇంత వ‌ర‌కూ 31 మంది హ‌త్య‌కు గురైన‌ట్టు పేర్కొన్నారు. అలాగే 300 మందిపై హ‌త్యాయ‌త్నాలు జ‌రిగాయ‌న్నారు. టీడీపీ నేత‌ల వేధింపులు త‌ట్టుకోలేక 35 మంది ఆత్మ‌హ‌త్యా య‌త్నానికి పాల్ప‌డిన‌ట్టు లేఖ‌లో పేర్కొన్నారు. టీడీపీ నేత‌ల అరాచ‌కాల‌ను భ‌రించ‌లేక 2,700 కుటుంబాలు గ్రామాలు విడిచి వెళ్లిన‌ట్టు మోదీ దృష్టికి జ‌గ‌న్ తీసుకెళ్లారు.

అంతేకాదు, కూట‌మి ప్ర‌భుత్వ వేధింపుల‌కు ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులు గుర‌య్యార‌ని ఆయ‌న తెలిపారు. ఇందులో భాగంగా 27 మంది ఐఏఎస్‌లు, 24 మంది ఐపీఎస్ అధికారులు పోస్టింగ్‌ల‌కు నోచుకోని విష‌యాన్ని ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్ల‌డం గ‌మ‌నార్హం. ఇవే కాకుండా మ‌రికొన్ని అంశాల్ని కూడా లేఖ‌లో జ‌గ‌న్ ప్ర‌స్తావించారు.

జ‌గ‌న్ ఆరోపించిన ప్ర‌భుత్వంలో బీజేపీ కూడా భాగ‌స్వామి కావ‌డం గ‌మ‌నార్హం. ఏపీలో రెడ్‌బుక్ పాల‌న న‌డుస్తోంద‌ని, చ‌ర్చించ‌డానికి స‌మ‌యం ఇవ్వాల‌నే జ‌గ‌న్ విన‌తిపై మోదీ స్పంద‌న ఎలా వుంటుంద‌నే విష‌య‌మై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. జ‌గ‌న్ అధికారంలో వున్నంత వ‌ర‌కూ అడిగే ఆల‌స్యం, కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు వెంట‌నే అపాయింట్‌మెంట్ ఇచ్చేవారు. ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌జాతిర‌స్క‌ర‌ణ‌కు గురైన నాయ‌కుడు.

మ‌రీ ముఖ్యంగా బీజేపీ కూడా అధికారంలో భాగం పంచుకుంటోంది. త‌మ ప్ర‌భుత్వంపై ఫిర్యాదు చేయ‌డానికి అపాయింట్‌మెంట్ కావాలంటున్న జ‌గ‌న్ విన‌తిపై మోదీ సానుకూలంగా స్పందిస్తారా? అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. మ‌రోవైపు రాజ్య‌స‌భ‌లో వైసీపీకి చెప్పుకోత‌గ్గ స్థాయిలో రాజ్య‌స‌భ స‌భ్యులున్నారు. అక్క‌డ వైసీపీతో బీజేపీ స‌ర్కార్‌కు అవ‌స‌రం వుంటుంది. కాబ‌ట్టి జ‌గ‌న్‌తో మంచి సంబంధాలు కొన‌సాగించాల్సిన అవ‌స‌రం వుంటుంది. ఈ దృష్ట్యా జ‌గన్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వొచ్చ‌ని అంటున్నారు. ఏమ‌వుతుందో చూడాలి.