శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో భర్తపై భార్య పోటీని వైసీపీ అధిష్టానం ఎట్టకేలకు తప్పించింది. దీంతో అచ్చెన్నాయుడిపై వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల తన అనుచరులతో నిర్వహించిన సమావేశంలో జెడ్పీటీసీ సభ్యురాలు, దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించి రాజకీయంగా బాంబు పేల్చినంత పని చేశారు. దీంతో ఒక్కసారిగా టెక్కలి వైసీపీలో కలకలం రేగింది.
ఈ నెల 22న నామినేషన్ వేస్తానని ప్రకటించిన దువ్వాడ వాణితో వైసీపీ పెద్దలు మంతనాలు జరిపారు. వైసీపీ పెద్దలు సముదాయించడంతో ఆమె మెత్తబడినట్టు సమాచారం. వాణి చెప్పిన ప్రకారం ఎలాంటి నామినేషన్ ఆమె వేయలేదు. టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు పోటీ చేస్తుండడంతో ఆయన ఓడించడానికి సీఎం జగన్ పట్టుదలతో ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో భార్యాభర్తల మధ్యే విభేదాలు చోటు చేసుకోవడంతో వైసీపీ తీవ్ర షాక్‌కు గురైంది.
ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు పెట్టింది. మరోవైపు వైసీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని వాణి ప్రకటనపై ఆమె భర్త, వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయవచ్చన్నారు. వద్దని చెప్పే హక్కు ఎవరికీ లేదన్నారు.
తనపై పోటీ చేస్తానని భార్యే చెప్పడంతో అంతా కలియుగ ప్రభావం అని ఆయన వైరాగ్యంతో కూడిన స్వరంతో మాట్లాడారు. కానీ వాణి నామినేషన్ వేయదని తాను అనుకుంటున్నట్టు ఆయన చెప్పారు. చివరికి దువ్వాడ అనుకున్నట్టే జరిగింది. దీంతో టెక్కలి వైసీపీలో జోరందుకుంది.