పిఠాపురంలో టీడీపీ ఇన్‌చార్జ్ వర్మపై జనసేనలో రోజురోజుకూ అనుమానం పెరుగుతోంది. పిఠాపురంలో తన గెలుపు బాధ్యతను వర్మపై పవన్‌కల్యాణ్ ఉంచిన సంగతి తెలిసిందే. అయితే క్షేత్రస్థాయిలో రాజకీయ వాతావరణం చూస్తే …టీడీపీ శ్రేణులు ఆశించిన స్థాయిలో పవన్‌కు మద్దతుగా చేయడం లేదని జనసేన నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అలాగని ఈ విషయాన్ని ఇప్పుడు బయటకు మాట్లాడే పరిస్థితి లేదు.
మరోవైపు ఎన్నికలకు ఇక రోజులే మిగిలి ఉన్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది పవన్ గెలవడం కష్టమనే టాక్ వినిపిస్తోంది. దీంతో జనసేన నాయకులు, కార్యకర్తల్లో కలవరం మొదలైంది. ఈ దఫా కూడా పవన్ గెలవకపోతే, ఇక శాశ్వంగా ఆయనకు రాజకీయ సమాధి కట్టినట్టే అనే చర్చకు తెరలేచింది. పవన్‌ను వైసీపీ అభ్యర్థి వంగా గీత ఓడిస్తుందనే మాట కంటే, వర్మ కొంప ముంచుతారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.
జనసేనకు వ్యతిరేకంగా చేయాలని వర్మ ఎక్కడా చెప్పడం లేదు. అయితే జనసేనకు రక్తం పూసుకుని వర్మ చేయడం లేదని టీడీపీ శ్రేణులు గుర్తించాయి. వర్మ మనసెరిగి టీడీపీ నాయకులు, కార్యకర్తలు నడుచుకుంటున్నారని జనసేన నాయకులు అంటున్నారు. అందుకే పవన్‌ను గెలిపించాలనే పట్టుదలతో వర్మ చేయడం లేదని జనసేన నాయకులు వాపోతున్నారు. పవన్ గెలిస్తే, శాశ్వతంగా జనసేన సీటు అవుతుందనే భయం టీడీపీ శ్రేణుల్లో వుంది.
అందుకే జనసేన కోసం మనమెందుకు చేయాలనే ధోరణి టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో కనిపిస్తోంది. అందుకే క్షేత్రస్థాయిలో ఏదో తేడా కొడుతోందనే ఆందోళన జనసేన నేతల్లో కనిపిస్తోంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో జనసేనకు పార్టీ నిర్మాణం లేదు. దీంతో పూర్తిగా వర్మపై ఆధారపడాల్సిన పరిస్థితి. వర్మ మాత్రం కూల్‌గా ఏదో చేస్తున్నానంటే, చేస్తున్నా అనే లెవెల్‌లో ఆయన నడుచుకుంటున్నారు. ఇలాగైతే ఏమవుతుందో అనే భయం జనసేన నేతలను వెంటాడుతోంది.
వర్మ మనస్ఫూర్తిగా పవన్ గెలుపు కోసం పని చేయకపోవడం వల్లే సానుకూల రాజకీయ వాతావరణం కనిపించడం లేదని జనసేన వాపోతోంది.