ఉపాధ్యాయుడి కంటే గొప్ప పదవి వేరేది లేదు. విద్యాబుద్దులు చెప్పడం కంటే పుణ్యమూ లేదు. ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాజా ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన రేగం మత్స్యలింగం ఉపాధ్యాయుడి అవతారం ఎత్తారు
ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా పాఠశాలకు వెళ్ళి కొంత సేపు విద్యార్ధులకు బోధన చేశారు. వారికి టీచర్లు పాఠాలు ఎలా చెబుతున్నారు, సౌకర్యాలు ఎలా ఉన్నాయి అన్నవి ఆరా తీసారు.
ఎమ్మెల్యే తమ స్కూల్ కి వచ్చి పాఠం చెప్పడంతో విద్యార్ధులు ఆనందభరితులు అయ్యారు. స్థానికంగా ఉన్న పాఠశాల సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పెదకొండపల్లి మండలలోని ఊరాడ గ్రామంలో ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు.
అయిదేళ్ళ పాటు వారికి అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తనకు ఓటేసిన జనాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ తరఫున తాజా ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో గెలిచినవి రెండే సీట్లు అయితే అందులో ఒకటి అరకు, మరొకటి పాడేరు. ఈ ఇద్దరూ జనంతో మమేకం అవుతూ ఎమ్మెల్యేలుగా తమ విధులను నిర్వహిస్తున్నారు. పార్టీకి ఇది కొంతలో కొంత ఊరటగా ఉంది.