మొత్తం మంత్రివర్గం చేత రాజీనామాలు చేయించి.. అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ – జేడీఎస్ నేతలు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పరిచిన మంత్రివర్గాన్ని ఇటీవలే విస్తరించారు. ఆ విస్తరణ తర్వాతే ఎక్కువ రచ్చ రేగింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు మొత్తం మంత్రివర్గం చేత రాజీనామాలు చేయించి.. కొత్తగా కేబినెట్ ను ఏర్పాటు చేయనున్నారట. తద్వారా అసంతృప్తులను బుజ్జగించడానికి అవకాశం దక్కుతుందని వారు భావిస్తున్నట్టున్నారు. తదుపరి మంత్రివర్గ విస్తరణకు కూడా ముహూర్తాన్ని ప్రకటించారు. ఈ నెలలోనే కేబినెట్ ఏర్పాటు ఉంటుందట. అంత వరకూ మంత్రులు లేకుండానే ప్రభుత్వం కొనసాగుతుందని ప్రకటించారు.
అయితే ఇది సమస్యకు పరిష్కార మార్గం అవుతుందా? అనేది మాత్రం కొశ్చన్ మార్క్. రాజీనామాలు ఇచ్చిన ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడంలో వారికి ప్రాధాన్యతను ఇస్తామని హామీ ఇవ్వడానికి ఇలా చేసినట్టుగా ఉన్నారు. అయితే బీజేపీ ఈ అవకాశాన్ని వదులుతుందా? ఈ రాజకీయ పరిణామాలపై గవర్నర్ ఎలా స్పందిస్తారు? అనేది తదుపరి కథను మలుపు తిప్పే అవకాశం ఉంది.
కాంగ్రెస్ మాత్రం తన తుది ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది కూడా ఫలితం ఇవ్వకపోతే.. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవచ్చు. అయినా కర్ణాటకానికి తెరపడే అవకాశాలు ఏమీ ఉండవు. మళ్లీ ఎన్నికలు జరిగి స్పష్టమైన ఫలితాలు వచ్చే వరకూ ఇదే కథే నడిచే అవకాశం ఉంది.