డీఎంకే మీద అనుచితమైన కథనం రాశారంటూ తమిళ పత్రిక ఆనంద వికటన్ గ్రూప్ పై పరువు నష్టం దావా వేయడానికి రెడీ అని ప్రకటించింది ఆ పార్టీ ఫస్ట్ ఫ్యామిలీ. ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే) ను ద్రవిడ మున్నేట్ర కంపెనీగా పేర్కొంటూ జూనియర్ వికటన్ పత్రిక ఒక కథనాన్ని ఇచ్చింది. కవర్ స్టోరీ కథనంలో డీఎంకేను ఒక ప్రైవేట్ సంస్థగా అభివర్ణించింది ఆ పత్రిక.
ఆ సంస్థకు ఎంకే స్టాలిన్ ఆయన తనయుడు ఉదయనిధి, భార్య దుర్గ, అల్లుడు శబరీశన్ లు వివిధ హోదాల్లో పని చేస్తున్నట్టుగా అభివర్ణించింది. ఒకరు సీఈవోగా మరొకరు మేనేజింగ్ డైరెక్టర్, ఇంకో ట్రెజరర్.. అన్నట్టుగా డీఎంకేను ఒక ఫ్యామిలీ ఆధ్వర్యంలో నడిచే కంపెనీగా నడుపుతున్నారని ఆ పత్రిక పేర్కొంది.
ఇటీవలే ఆ పార్టీ యూత్ వింగ్ కు ఉదయనిధి స్టాలిన్ ను అధ్యక్షుడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఈ తరహా విమర్శలు వస్తున్నాయి. దీనిపై డీఎంకే ఫస్ట్ ఫ్యామిలీ స్పందించింది.
ఆనంద్ వికటన్ గ్రూప్ తమకు తక్షణం క్షమాపణలు చెప్పాలని లేకపోతే భారీ పరువు నష్టం దావాకు రెడీగా ఉండాలని వారు హెచ్చరించారు. ఈ మేరకు స్టాలిన్ భార్య దుర్గ ప్రకటించారు. క్షమాపణలు చెప్పనట్టు అయితే పది కోట్ల రూపాయల పరువు నష్టం దావాకు రెడీగా ఉండాలని ఆమె ఆ మీడియా సంస్థను హెచ్చరించారు.