అమెరికాలో ట్రంప్ ఉగాది- పంచాంగ శ్రవణం

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రవేశించగానే అలాంటి పంచాంగశ్రవణాలే ప్రపంచమంతా వినిపిస్తున్నారు చాలామంది.

ఉగాది వస్తే పంచాంగ శ్రవణంలో రానున్న రోజుల్లో రాష్ట్రం, దేశం, ప్రపంచం సుభిక్షింగా ఉంటుందా లేదా…విపత్తులు ఏమైనా రానున్నాయా అనేది సిద్ధాంతులు చెప్తుంటారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రవేశించగానే అలాంటి పంచాంగశ్రవణాలే ప్రపంచమంతా వినిపిస్తున్నారు చాలామంది. అందులో ఇదొకటి అనుకుందాం.

మొత్తానికి ట్రంప్ ప్రామాణస్వీకారం పూర్తయ్యింది. అమెరికాకి 47 వ అధ్యక్షుడిగా శ్వేతసౌధంలోకి ట్రంప్ పునరాగమనం జరిగింది. ట్రంప్ ప్రపంచానికి కొత్తవాడు కాదు. ఆల్రెడీ ఒక దఫా అమెరికా అధ్యకుడిగా పనిచేసిన వాడు. తొలిసారి ఆయన నెగ్గినప్పుడు ప్రపంచం మొత్తం మీద మిశ్రమ అభిప్రాయలు వినపడ్డాయి. ప్రధానంగా ఆ పదవికి అతను హుందాగా లేడని, లేకి మాటలతోటీ, అతి చేష్టలతోటి చిరాకుపెడుతున్నాడని అన్నారు జనం.

ఆ నాలుగేళ్ల పాలనలో ఇంచుముంచు ఇదే ధోరణి కొనసాగింది. కానీ ఈ సారి మాత్రం ట్రంప్ ని ఆ కోణంలో చూస్తున్నవారు తక్కువగా ఉన్నారు. ట్రంప్ అమెరికాకి ఎంత అవసరమో చెబుతూ ఘనమైన మెజారిటీతో రిపబ్లికన్ పార్టీని గెలిపించుకున్నారు ప్రజలు. అంతేకాదు, అమెరికా అధ్యక్షుడిగా ట్రంపే కరెక్ట్ అంటున్నాయి అధికశాతం ప్రపంచదేశాలు కూడా.

ఈ మార్పుకి కారణం బైడెన్ పాలనలో లోపాలు. ఆయన పాలనలో అమెరికా గ్రాఫ్ అన్ని విధాలుగా పతనం కావడం. ఆ రకంగా తన శక్తికన్నా ప్రత్యర్ధి బలహీనత ట్రంప్ కి కలిసొచ్చింది.

ఈసారి ట్రంప్ పాలనపై పాజిటివ్ దృక్పధం పెరగడానికి ఎన్నో కారణాలున్నాయి. అందులో ఎలాన్ మస్క్ ఫ్యాక్టర్ ఒకటి. ప్రపంచంలో నెంబర్ 1 కుబేరుడైన ఎలాన్ మస్క్ కూడా ట్రంప్ మాదిరిగానే హుందాతనం పాటించడం ఉండదు. కానీ అతనొక విజేత. “రిచ్ మ్యాన్స్ జోక్ ఈజ్ ఆల్వేస్ ఫన్నీ” అన్నట్టుగా ఎలాన్ మస్క్ ఏది చెప్పినా అది కరెక్టే అంటుంది లోకం. అటువంటి వాడు ట్రంప్ పంచన ఉన్నాడు. ప్రభుత్వంలో భాగస్వామయ్యాడు. అదొక ఆకర్షణ మాత్రమే కాదు, దేశాన్ని ఆర్ధికంగా మరింత పరుగులెత్తించే పనులు ప్రభుత్వం చేత చేయిస్తాడని అమెరికన్ల ఆశాభావం.

అమెరికన్ ఓటర్లకి ప్రధానంగా రెండే ప్రధానాంశాలు. ఒకటి- ట్యాక్సులు తగ్గాలి, రెండు-ధరలు తగ్గాలి. లేదా గణనీయంగా ఆదాయాలు పెరగాలి, ఉద్యోగాల్లో పౌరులకే ప్రాధాన్యం ఇవ్వాలి. దేశాన్ని ఆ దిశగా నడిపిస్తాడని ట్రంప్ ప్రచారాన్ని చూసినవాళ్ల భావన.

సరే అదలా ఉంటే హెచ్ 1 బి విసాల జారీలో సంస్కరణలు చేపడతాడని, విపరీతమైన ట్యాలెంట్ ఉంటే తప్ప రానీవడని భారతీయుల్లో ఒక టాక్. ఒకరకంగా దానిని స్వాగతిస్తున్నవారే ఎక్కువ. ఎందుకంటే లాటరీ సిస్టం తీసేసి పూర్తి ట్యాలెంట్ బేస్ మీదనే హెచ్-1బి విసా అంటే… అప్పుడు కూడా భారతీయులదే పైచేయి అవుతుందనేది వాస్తవం.

కనుక ట్యాలెంట్ ని నమ్ముకున్న బ్రైట్ స్టూడెంట్స్ కి ట్రంప్ ఆలోచనలు నచ్చుతున్నాయి. అలాగే ఆల్రెడీ అమెరికాలో స్థిరపడిన భారతీయులకి కూడా తమ దేశంలోకి స్క్రాప్ కాకుండా రియల్ ట్యాలెంట్ మాత్రమే వస్తుందన్న ఆశ ఉంది. ఎందుకంటే ట్యాలెంట్ లేని స్క్రాప్ విద్యార్ధులు ఏదో ఒక రకంగా స్టూడెంట్ వీసా పొంది, అమెరికాకి వచ్చి చేసేది స్కాములే.

ఈ మధ్యన ఇండియన్-స్కామర్స్ అంటూ ముద్ర పడేంత రేంజులో ఈ మూక ఇండియాకి బాడ్ నేం తెచ్చారు, తెస్తున్నారు. అలాంటి వాళ్లకి అడ్డుకట్ట వేయొచ్చనేది అమెరికాలో ఉన్న మనవాళ్ల ఆలోచన.

ఇక రాజకీయ కోణం చూస్తే ట్రంప్ కి, మోదీకి మైత్రి ఉంది కనుక భారతదేశాన్ని దెబ్బతీసే పనులు ఉద్దేశపూర్వకంగా చేయకపోవచ్చు. అయితే బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, ఆఫ్రికా) దేశాలుగా కలిసి డాలర్-వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని సొంత కరెన్సీలతో అంతర్జాతీయ విపణికి శాసించాలనే ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉండొచ్చు భారత్.

గత నాలుగేళ్ల పద్ధతిలో కాకుండా మోదీ ప్రభుత్వం అమెరికాతో మెలిగే విధానాలు మార్చుకోవాల్సి ఉంటుంది.

అమెరికాలో ఆల్రెడీ సాచ్యురేట్ అయిన టెస్లా కార్ల వ్యాపారాన్ని ఇండియాలోకి స్వాగతించాల్సిన అంతర్జాతీయ రాజకీయ అవసరం ఏర్పడొచ్చు. మస్క్ ఆ మధ్యన ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇప్పుడు మస్క్ ఆడే వ్యాపారాత్మక రాకకీయ చదరంగాన్ని మన దేశం ఎలా ఎదుర్కుంటుందో చూడాలి. ఈ విషయంలో అమెరికా-ఇండియా పరస్పరం ఎదిగే విధంగా ప్రణాళికలు ఉండొచ్చు.

ప్రపంచంలో అనిశ్చితి కలుగచేసిన రహ్యా-ఉక్రైన్ యుద్ధం, ఇజ్రాయెల్ – గాజా యుద్ధం వంటివి ట్రంప్ హయాములో తోకముడుస్తున్నాయి. కనుక ప్రపంచం శాంతియుతంగా ఉండి అంతా వ్యాపారం బాట పడతారాన్న ఆశాభావాలు కలుగుతున్నాయి ప్రపంచదేశాలకి.

ఏది ఏమైనా ట్రంప్ ది “అమెరికా ఫస్ట్” నినాదం. తన దేశం పురోగతి తర్వాతే ఏదైనా. ఎక్కడ అనిశ్చితి ఉన్నా అమెరికన్ స్టాక్ మార్కెట్ కి కూడా ఇంపాక్ట్ ఉంటుంది కనుక ఆ పరిస్థితులు రాకుండా నిలువరించే పనిలో ఉన్నాడు పెద్దన్న పాత్రలో.

రాబోయే నాలుగేళ్లల్లో అమెరికాలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటాయన్న లెక్కలు బయలుదేరుతున్నాయి. ఎందుకంటే ఇది ట్రంప్ కి ఆఖరి టర్మ్. ఏ నిర్ణయమైనా ధైర్యంగా తీసుకోవచ్చు.

అందులో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నది..అక్రమ వలసదారుల్ని ఎలా డిపోర్ట్ చేస్తాడా అని. రేపటి నుంచి కొన్ని నెలలపాటు ఈ తంతే జరుగుతూ ఉండొచ్చు ఒక డైలీ సీరియల్ మాదిరిగా.

పద్మజ అవిర్నేని

4 Replies to “అమెరికాలో ట్రంప్ ఉగాది- పంచాంగ శ్రవణం”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.