‘పరువు’ను జోడిస్తే పాపమే హత్యలు హత్యలే!

కులపిచ్చి ముసుగులో కన్న బిడ్డల ప్రేమలను కూడా అర్థం చేసుకోకుండా చంపేసే దుర్మార్గులకు సంఘబహిష్కారం ఒక్కటే సరైన శిక్షగా అమలు కావాలి.

‘పరువు హత్య’ అనే పేరుతో వీటిని పిలిస్తే.. సామాజికంగా జరుగుతున్న ద్రోహంలో మనం కూడా భాగస్వాములం అయినట్టు లెక్క! కులం అనే విషాన్ని బుర్ర నిండా నింపుకున్న వాళ్లు మాత్రమే.. వీటిని ‘పరువు హత్య’ అనే పేరుతో పిలవాలి! ఎలాంటి పరువు కోసం ఈ హత్యలు జరుగుతున్నాయి? వేరే కులం వాడిని ప్రేమించినందుకు, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నందుకే కదా ఇవి జరుగుతున్నాయి? కులం తప్ప ఇంకో ప్రాతిపదిక వీటికి లేదు.

ఇవన్నీ కిరాతక హత్యలే తప్ప.. వీటికి ‘పరువు’ అనే పదాన్ని జోడిరచి.. ఈ హత్యలకు పాల్పడిన వారిపట్ల కించిత్తు సానుభూతిని పుట్టించే ప్రయత్నం చేయకండి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఇలాంటి దుర్మార్గాలు బయటపడుతూనే ఉన్నాయి గానీ.. అనంతపురం, కుప్పంలలో ఒకేరోజున రెండు దుర్మార్గాలు వెలికి వచ్చిన నేపథ్యంలో.. వీటి పట్ల సమాజం దృష్టి మారాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడానికి గ్రేట్‌ ఆంధ్ర చేస్తున్న ప్రయత్నమే ఈ వారం కవర్‌ స్టోరీ.. ‘‘ ‘పరువు’ను జోడిస్తే పాపమే.. హత్యలు హత్యలే’!

‘పరువు’ అనే మాట చాలా విలువైనది. కానీ, సంకుచితమైన విషయాల్లో అనేక మార్లు ఆ పదం వాడబడుతున్నప్పుడు.. సామాజిక స్పృహ ఉన్న ఎవరికైనా సరే.. కించిత్తు బాధ కలుగుతుంది. ప్రత్యేకించి.. పిల్లలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నప్పుడు.. సహించలేని తల్లిదండ్రులు వారిద్దరినీ లేదా వారిలో ఒక్కరినీ కడతేర్చడానికి తెగిస్తే.. అలాంటి సందర్భాల్లో పరువు హత్య అని అభివర్ణించడం చాలా దారుణం అనిపిస్తుంది.

కులం కాకుండా ఒక కుటుంబానికి వేరే విషయంలో ఏదైనా ఒకస్థాయి, గుర్తింపు, సంఘంలో గౌరవం ఉండి.. దానిని నాశనం చేసేలాగా ఆ కుటుంబంలోని వారు వ్యవహరించినప్పుడు చంపేస్తే మాత్రమే అవి పరువు హత్యలు! ఫరెగ్జాంపుల్‌ ఒక గొప్ప సంగీతకారుడి కుటుంబం ఉందనుకుందాం. సంగీతాన్ని భ్రష్టు పట్టించే, అవమానించే దుష్టుడు ఒకడు ఆ కుటుంబంలో పుడితే.. అలాంటి వాడిని అంతం చేస్తే దానిని పరువు హత్య అనవచ్చు. ఒక కుటుంబానికి కులం తప్ప మరేమీ లేనప్పుడు.. కులం అనేది పరువుకు చిహ్నంగా భావించడం కూడా ఒకరకమైన దురహంకారం! అంటే కుల పరమైన అంతరాలను సహించలేక.. ఒకరినొకరు ఇష్టపడ్డ పిల్లలకు పెళ్లి చేయకపోగా.. వారిని అంతమొందించాలని ప్రయత్నించే వారు ఎంతటి దుర్మార్గులో.. వారి దుర్మార్గాన్ని మరుగున పెట్టేలా, వారి దుశ్చర్యను పరువు నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నంగా రంగుపులిమే వారందరూ.. అంతే దురహంకారులు!

గుడ్డిలో మెల్ల ఏంటంటే.. ఆధునిక సాంకేతిక విప్లవాలతో పాటు.. యువతరం తమ జీవిత భాగస్వామిని తమ ఇష్టం మేరకు ఎంచుకునే పోకడలు పెరుగుతున్న తరుణంలో.. నెమ్మదిగా కులరహిత సమాజం వైపు అడుగులు వేస్తున్నాం అనే ఆశ మనలో చాలా మందికి కలుగుతూ ఉంటుంది. అదే సమయంలో.. కేవలం కులం అనే కొలబద్ధ మీద ఇద్దరి అన్యోన్యతను అంగీకరించలేక చంపేసే వ్యక్తులు కూడా ఇదే సమాజంలో ఉన్నందుకు మనం తప్పకుండా సిగ్గుపడాలి.

కొన్ని ఉదాహరణలు చెప్పుకోకుండా.. ఇలాంటి సమస్యను అర్థం చేసుకోవడం, విశ్లేషించడం కష్టం.

నా మిత్రుల్లో ఒక కుటుంబంలో ప్రేమ పెళ్లి ప్రతిపాదన కొన్నాళ్ల కిందట తెరమీదికి వచ్చింది. మిత్రుడి కూతురు చక్కటి ఉద్యోగం చేస్తోంది. ఆమె ఆఫీసులోని ఒక కొలీగ్‌ పెళ్లికి ప్రతిపాదించాడు. ఆ ప్రతిపాదన అమ్మాయి తల్లిదండ్రుల వరకూ వచ్చింది. ఇక్కడ కులాల గురించి చెప్పుకోకుండా ఉంటే అర్థం లేదు కాబట్టి ఖచ్చితంగా చెప్పాల్సిందే. నా మిత్రుడు ఓసీ కింద గుర్తింపు ఉన్న శూద్ర కులానికి చెందిన వాడు. వాళ్ల అమ్మాయిని ప్రేమించిన వాడు మధ్వ బ్రాహ్మణుడు! అబ్బాయిని కలిసిన తర్వాత పెళ్లికి నో చెప్పడానికి నా మిత్రుడి దంపతులకు కారణాలేం కనిపించలేదు. అయితే ఎందుకైనా మంచిదని మా వాడు.. ఆ కుర్రాడిని విడిగా ఒకపూట డిన్నర్‌కు తీసుకెళ్లి.. తాను చెప్పదలచుకున్న కొన్ని హెచ్చరికలు చెప్పాడు.

‘మా అమ్మాయికి వంటలూ గట్రా పెద్దగా రావు. చికెన్‌ ముక్క లేకుండా ఒక్కరోజు కూడా ముద్ద దిగదు’ లాంటివి ఆ హెచ్చరికల్లో కొన్ని. కుర్రవాడు ఒప్పుకోవడంలో వింతేం లేదు.. అమ్మాయి గురించి తెలిసీ, ప్రతిపాదించిన వాడే గనుక.. ఒప్పుకున్నాడని అనుకోవచ్చు. అతడి తల్లిదండ్రులు.. సాంప్రదాయ మధ్వ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు కూడా ఈ హెచ్చరికలను పట్టించుకోలేదు. వారు చెప్పిన మాట ఏమిటో తెలుసా..? ‘మీ అమ్మాయికి మేం వండిపెట్టడం కుదరదు. తను వండుకోగలిగితే.. తెప్పించుకుని నాన్‌ వెజ్‌ వండుకోవచ్చు. లేదా, నాన్‌వెజ్‌ ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకుని తెప్పించుకుని తినవచ్చు.. మాకెలాంటి ఇబ్బంది లేదు’ అని! మొత్తానికి ఉభయపక్షాల్లో పెద్దల అంగీకారంతో పెళ్లయింది. వారు.. ఏదో అప్పటికి పని గడపడానికి అలాంటి మాటలు అన్నారనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే.. మా మిత్రుడి బృందాన్ని తమ ఇంటికి ఆహ్వానించినప్పుడు.. వీళ్లకోసం ప్రత్యేకంగా నాన్‌వెజ్‌ వంటకాలన్నీ పార్సిల్‌ తెప్పించి మరీ విందుభోజనం ఏర్పాటు చేశారు. అంతగా.. తాము నమ్ముతున్న విలువల్ని, సాంప్రదాయాలుగా తాము అనుకుంటున్న నియమాలను అన్నింటినీ పక్కన పెట్టేసి.. ప్రధానంగా.. కులం గురించి ఏమాత్రం పట్టింపు కూడా లేకుండా.. పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్న సమాజంలో మనం ఉన్నాం.

నా మిత్ర ప్రపంచంలో ఇలాంటి ఉదాహరణలు కొల్లలుగా ఉన్నాయి. కులపట్టింపులేని ప్రేమ వివాహాలను ఉభయ పక్షాల తల్లిదండ్రులు స్వయంగా ప్రోత్సహించడం నాకు చాలా మామూలు సంగతి అయింది. ఈ వైబ్రేషన్స్‌ అందించే ఉత్సాహంతో.. నేను ఇతర మిత్ర బంధు వర్గాల్లో.. తమ కులంలోనే పిల్ల కావాలని వెతుకులాడే, నానా పాట్లు పడుతూ ఉన్న కొందరికి.. ఉచిత సలహా కూడా పడేశాను! ‘కులంలో సంబంధాలు దొరకడం అంతా అయ్యేపనికాదు.. మీ మిత్రవర్గంలో బాగా తెలిసిన అమ్మాయి ఉంటే చేసుకోండి.. కులానిదేముంది.. తతిమ్మా కుటుంబ వ్యవహారాలన్నీ మీకు తెలిసినవే ఉంటాయి కదా.. అది చాలా మంచిది’ అని చెప్పాను! ‘అబ్బెబ్బే.. అలా ఎలా..? మన కులంలో పిల్లని వెతికి చేయలేకపోతే.. మన ఇమేజి ఏం కావాలి..’ అంటూ నిరీక్షిస్తున్నారు! పెళ్లి వయసు వచ్చిన తర్వాత.. ఈ నిరీక్షణ పర్వంలోనే దశాబ్దాలు గడుస్తున్నాయి.

రేపటి కుల రహిత సమాజం ఆవిష్కృతం అవుతున్న ఈ సంధి యుగంలో ఇలాంటి వారిని చూసినప్పుడు.. మారి తీరాల్సిందే.. పాత బుద్ధుల సమాజానికి శిథిల అవశేషాలుగా వీరు మిగిలిపోకూడదు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈ దశలో ఉన్న వారిని చూసినప్పుడే నేను మధనపడుతూ ఉండగా.. పత్రికల్లో ఇలాంటి కథనాలు వచ్చినప్పుడు కడుపు మండకుండా ఉంటుందా?

తమ కులం కానివాడిని కన్న కూతురు ప్రేమించింది. తండ్రికి ఆ విషయం రుచించలేదు. ఆమెను తన వెంట టూవీలర్‌ లో ఎక్కించుకుని ఊరు బయట ఓ పెద్ద చెట్టు వద్దకు తీసుకువెళ్లాడు. ఓ తాడు ఆమె చేతికిచ్చి.. ఆ చెట్టుకు ఉరివేసుకోవాల్సిందిగా ఆదేశించాడు! ఎటూ అంతటి తీవ్ర నిర్ణయాన్ని అతను తీసుకున్న తర్వాత.. ఆ అమ్మాయి.. తండ్రి మాటను ధిక్కరించి, అక్కడినుంచి పారిపోయి ఉంటే ఏం జరిగేదో మనకు తెలియదు. కానీ.. ఆమె కుమిలి కుమిలి చివరికి తండ్రి చెప్పినట్టే ఉరివేసుకుని మరణించింది. తర్వాత శవాన్ని దించి.. తన వెంట తెచ్చిన పెట్రోలు పోసి తగలబెట్టాడు. ఇంటికెళ్లిపోయాడు. రెండు రోజుల తర్వాత.. ఏం అనుకున్నాడో.. తానే వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కూతురు మరణం ఇలా జరిగిందని తానే వారికి తెలియజెప్పాడు. తొలుత పోలీసులు కూడా నమ్మలేకపోయారంటే అర్థం చేసుకోవచ్చు. కుప్పంలోనూ అదే తరహా సంఘటన జరిగింది.

పిల్లలు పెళ్లిచేసేసుకున్న తరువాత.. పంచాయతీకని అమ్మాయి తండ్రి వారిని పిలిపించాడు. కొందరు మధ్యవర్తులతో కలిసి ఆ కొత్త దంపతులు వచ్చారు. ముందే సిద్ధం చేసుకున్న మనుషులతో వారందరి మీద దాడిచేసి అందరినీ విచక్షణ రహితంగా పొడిచారు. మధ్యవర్తిగా వచ్చిన వ్యక్తి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో ఉన్నాడు. ఈ రెండు ఘటనలు ఒకే రోజు చోటు చేసుకున్నవి కాగా.. రెండింటిలోనూ కులమే ఈ దుర్మార్గపు పనులకు హేతువు కావడం గమనార్హం.

ఉన్మాద వస్తువులుగా కులమతాలు..

దైవం అనే ఒక నమ్మకాన్ని అందుకోవడానికి విశ్వసించే రకరకాల మార్గాలే మతాలు! వృత్తిపరమైన, సామాజికమైన ఏకరూపత లను బట్టి ఒకరికొకరు అండగా నిలవడానికి సమూహాలుగా ఏర్పడడం నుంచి పుట్టినవి కులాలు! వీటికి సంబంధించిన నిర్వచనాలుగా ఎన్నో మాటలు ప్రచారంలో ఉండవచ్చు. కులాల వర్గీకరణను సూచించే స్మృతుల గురించి అనేక వివాదాలు మనకు కనిపిస్తుండవచ్చు. కానీ.. వాటి మౌలిక స్వరూపం మాత్రం అంతే. ఈ కులమతాలనే సమూహాలు పెద్దవిగా, చిన్నవిగా మారుతున్న కొద్దీ.. అస్తిత్వం కోసం జరిగే పోరాటాలూ.. ఆధిపత్యం కోసం జరిగే కుట్రలూ అనివార్యంగా సంఘంలోకి చొరబడిపోతూ వచ్చాయి.

కులమతాల పుట్టుక నుంచి.. ఇప్పటిదాకా సమాజానికి ఆ వర్గీకరణల అవసరం ఏ రూపంలో ఉండినప్పటికీ.. ఆధునిక వ్యవస్థలో.. కులమతాలు రాజకీయ అధికారానికి అడ్డదారులుగా ఉపయోగపడే వ్యవహారాలుగా తయారయ్యాయి. కుల సంఘాలు.. రాజకీయ ప్రాపకం కోసం దారులుగా, బ్లాక్‌ మెయిలింగ్‌కు ఉపయోగపడగల అడ్డగోలు వ్యవస్థలుగా రూపొందుతున్నాయి.

ఎక్కడైతే.. ఏదో ఒకనాటికి మన కళ్లెదుటకు కుల రహిత సమాజం ఆవిష్కృతమవుతుంది అని మనం ఆశలు పెంచుకుంటూ ఉంటామో.. ఆ ఆశలను చిదిమేస్తూ ఉండేవి ఈ కులసంఘాల వ్యవహారాలు. కుల మత సంఘాలను, వ్యవస్థీకృత సమూహాలను నడిపించే వారి లక్ష్యాలు వేరు. వారికి స్వార్థ, సంకుచిత ప్రయోజనాలు అనేకం ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవడం కోసం కులాన్ని అంతర్ధానం కానివ్వరు. కులమూ మతమే ఒక చోదక శక్తి అయినట్టుగా మూర్ఖ సమాజాన్ని నడిపిస్తూ ఉంటారు. వారి దుర్బుద్ధులను గ్రహించలేని గొర్రెల మందల్లాంటి జనాలు.. కులాల, మతాల ఉన్మాదంతో చెలరేగిపోతూ ఉంటారు. ఆ నడుమ.. ఆ కులాలూ మతాలే పరమావధిగా అనుకుంటూ.. ఇలా కన్నపిల్లల్ని కూడా కడతేర్చుకునే మహామూర్ఖులు ఇంకో రకం.

ఈ పోకడలకు నిష్కృతి ఎలా?

ఇలాంటి హత్యలను పరువు అనే పదం జోడిరపుతో పిలవనే కూడదని మనం తొలి నుంచి అనుకుంటున్నాం. వీటికి అడ్డుకట్ట వేయడం ఎలా? సాధారణంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.. ఇలాంటి దుర్మార్గుల వెన్నులో వణుకు పుట్టేలా చట్టాలు రూపొందించాలి.. అంటూ పడికట్టు, మొక్కుబడి డిమాండ్లు వినిపిస్తే సరిపోదు. ఎందుకంటే కేవలం పటిష్టమైన చట్టాలు తయారు కావడం వలన సమాజంలో మార్పు వస్తుందని అనుకోవడం భ్రమ.

అమ్మాయిలపై దారుణమైన అత్యాచారాలు ఎక్కువైన తర్వాత.. ఈ నేరాలకు చాలా కఠిన శిక్షలతో కొత్త చట్టాలు తయారయ్యాయి. ఆ చట్టాలు కొత్తగా అత్యాచారాలు జరగకుండా చూస్తున్నాయా? లేదు! నేరం చేయదలచుకున్న వాడికి చట్టం గురించిన స్పృహ ఉంటుందనీ అనుకోలేము. స్పృహ ఉన్నప్పటికీ.. వారు నేరం చేసే నిర్ణయం తీసుకున్న తరువాత ఆగుతారనీ అనుకోలేము. పైగా.. ఎవరు ఎలాంటి నేరం చేసినా వారిని సమర్థించడానికి హక్కుల సంఘాలూ, కుల సంఘాలూ అనేకం క్యూల్లో ఉంటాయి. పరువు కోసం చేసిన పనిగా వర్ణిస్తూ వారి మీద జాలి పుట్టించే ప్రయత్నం చేస్తుంటాయి. కాబట్టి ఇది చట్టాలతో అయ్యే పని కాదు.

ఇలాంటి కులపిచ్చి ముసుగులో కన్న బిడ్డల ప్రేమలను కూడా అర్థం చేసుకోకుండా చంపేసే దుర్మార్గులకు సంఘబహిష్కారం ఒక్కటే సరైన శిక్షగా అమలు కావాలి. ఒకరు విధించే శిక్ష కాదు ఇది. వారి చర్యలను, హత్యలను నిరసించే యావత్‌ సమాజమూ కలిసి సంఘబహిష్కారం చేయాలి. వారితో మాటలు కలపకూడదు, రాకపోకలు సాగించకూడదు. వ్యవహారాలు నడపకూడదు! కులం పిచ్చితో సొంత బిడ్డనే కడతేర్చుకున్న పాపం.. పరువు నిలబెట్టేది కాదు కదా.. తాము కడతేరిపోయే వరకు.. సమాజంలో తమను ఒక నికృష్టమైన పురుగుగా మార్చేసి చులకన చేసేసిందనే భయం, విరక్తి వారికి కలగాలి. అలాంటి హత్యలతో పరువు నిలబెట్టుకోవడం కాదు కదా.. ఆ హత్యల వల్లనే పరువు మొత్తం గంగపాలవుతోందనే గ్రహించే వాతావరణం ఏర్పడాలి. అలాంటి పరిస్థితుల నుంచి.. వారి వెలిబతుకులను చూస్తూ ఉంటే.. మిగిలిన వారిలో ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఉంటే అవి మొగ్గదశలోనే అంతరిస్తాయి.

ఇలాంటి దుర్మార్గులకు ఎవరో గట్టి శిక్షలు వేయాలని డిమాండ్‌ చేయడం కాదు. మనమే, సంఘమే సరైన శిక్షలు అమలు చేయాలి. ‘పరువు’ను జోడిరచరాదు. హత్యలు.. హత్యలే అని గుర్తించాలి. ఇంకా కావలిస్తే ‘నికృష్ట హత్యలు’గా ప్రత్యేక కేటగిరీ తయారుచేసి.. ఆ దుర్మార్గుల్లో అపరాధభావాన్ని పెంచాలి. అన్యధా ఇవి ఆగవు.

-ఎల్‌. విజయలక్ష్మి

15 Replies to “‘పరువు’ను జోడిస్తే పాపమే హత్యలు హత్యలే!”

  1. తల్లితండ్రుల అభీష్టానికి వ్యతిరేకం గ పెళ్లిచేసుకొనే వారికీ వివాహ వయసు 25 సంవత్సరాలుగా నిర్ణయించాలి అప్పటికి వాళ్ళకి లోకం పోకడల మీద అవగాహన వస్తుంది వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడగలరు అప్పుడు వాళ్ళు ఎవరిని పెళ్లిచేసుకున్న పోలీస్ రక్షణ కల్పించాలి

  2. Surya chowdary correct ga chepparu. L Vijayalakshmi ki chadukodam lo pedda prob raledu Anukunta. Paruvu hathyalaku nenu oppukonu. Kaani ooha teliyani vayasulo sariraka marpuluku akarshitulai evarino okarini istapaadi pelli chesukunta anadam chala tappu. Aaa talli tandrulu enni kastalu padi pencharo vallu vari biddanu bhavishyat lo ela chudali anukuntunnaro evariki telusu. Iruvipula tallitandrlu oppukune prema vivhale chesukovali.

  3. ఆడవారు ఎవరి ఆధారం లేకుండా బ్రతకగలరు.

    మగవాడికే ఆధారం కావాలి. అందుకే ఆడవాళ్ళని అణిచివేసి దారిలోకి తెచ్చుకోవాలని చూస్తాడు.

    ఆడవాళ్లు తెలివిగా ఉంటే చాల సమస్యలు తేలిగ్గా పరిష్కారం అవుతాయి.

    ఇద్దరూ, చదువు వలన విజ్ఞానం ప్రదర్శించాలి కానీ అహంకారం కాదు.

  4. అమెరికాలో లాగా 18 ఏళ్ళు రాగానే తన్ని తిరుమేయ్యాలి ఇంట్లో నుండి.

    వాళ్ళ బ్రతుకేదో వాళ్ళు బ్రతుకుతారు.

  5. yenta sepu kula mataala yedupule gaani. paatikellu leka iravai yellu kastapadi kani penchina talli dardrulani vaalla chaavuki vaalani vadilesi tinguranga antoo vinyasaalu chese valla gunrinchi raayere? veyyi pellillu peddala angeekaram lekunda jarigite okato rendo paruvu hatyalu jarugutunnayi.. daaniki media yenduku inta raaadhantam chestondi.. deeniki asalu kaaranam talli dadrulaku pillalaku vunna communicaiton gap.

  6. yenta sepu kula mataala yedupule gaani. paatikellu leka iravai yellu kastapadi kani penchina talli dardrulani vaalla c’haavuki vaalani vadilesi t’inguranga antoo vinyasaalu chese valla gunrinchi raayere? veyyi pellillu peddala angeekaram lekunda jarigite okato rendo paruvu h’atyalu jarugutunnayi.. daaniki media yenduku inta raaadhantam chestondi.. deeniki asalu kaaranam talli dadrulaku pillalaku vunna communicaiton gap.

  7. yenta sepu k’ula m’ataala y’edupule gaani. paatikellu leka iravai yellu kastapadi kani penchina talli dardrulani vaalla c’haavuki vaalani vadilesi t’inguranga antoo vinyasaalu chese valla gunrinchi raayere? veyyi pellillu peddala angeekaram lekunda jarigite okato rendo paruvu h’atyalu jarugutunnayi.. daaniki media yenduku inta raaadhantam chestondi.. deeniki asalu kaaranam talli dadrulaku pillalaku vunna communicaiton gap.

  8. yenta sepu k’ula m’ataala y’edupule gaani. paatikellu / iravai yellu kastapadi k’ani penchina talli dardrulani vaalla c’haavuki vaalani vadilesi t’inguranga antoo vinyasaalu chese valla gunrinchi raayere? veyyi pellillu peddala angeekaram lekunda jarigite okato rendo paruvu h’atyalu jarugutunnayi.. daaniki m’edia yenduku inta r’aaadhantam chestondi.. deeniki asalu kaaranam talli dadrulaku pillalaku vunna communicaiton gap.

  9. yenta sepu k’ula m’ataala y’edupule gaani. paatikellu / iravai yellu kastapadi k’ani penchina t’alli dardrulani vaalla c’haavuki vaalani vadilesi t’inguranga antoo vinyasaalu chese valla gunrinchi raayere? veyyi pellillu peddala angeekaram lekunda jarigite okato rendo paruvu h’atyalu jarugutunnayi.. daaniki m’edia yenduku inta r’aaadhantam chestondi.. deeniki asalu kaaranam Parents ki pillalaku vunna communicaiton gap.

  10. కులం పేరుతో రిజర్వేషన్ లు రద్దు చేయాలి. అప్పుడే కులం పేరు వలన ఉపయోగంలేదు అని అర్థం అవుతుంది.

    కులం తోకలు పేరు లో వుంటే , ప్రత్యేక పన్ను వేయాలి.

    ఒకే కులం లో పెళ్లి చేసుకునే వాళ్ళకి ప్రతి సంవత్సరం ప్రత్యేక పన్ను వేయాల.

  11. కులం పేరుతో రిజర్వేషన్ లు పొందిన వాళ్ళు పెద్ద కులం కంటే తాము నిజంగానే చిన్న వాళ్ళం అని ఒప్పుకున్నట్లు.

    దమ్ము వుంటే , ఓపెన్ కేటగరీలో లో ఉద్యోగం కొట్టాలి.

Comments are closed.