జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు ఎంత ఎంత అసూయతో నిండి ఉందో అర్థం చేసుకోవడానికి ఈ చిన్న ట్వీటు చాలు. గుజరాత్ లో చిక్కుబడిన మత్స్యకారులను ఏపీకి తరలించడం అనే ఎపిసోడ్లో పవన్ కల్యాణ్ స్పందించిన తీరు ఆయన నిస్సిగ్గు తనానికి పరాకాష్టగా మారింది. ఇలాంటి విషయాల్లో తెలుగు రాజకీయాల్లో తీవ్ర విమర్శలను ఎదుర్కొనే మాజీ సీఎం చంద్రబాబు నాయుడును మించి పోయినట్టుగా అగుపిస్తున్నారు జనసేన అధిపతి. కనీసం ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయినా.. అంతా తన వల్లనే అని చెప్పుకోవడానికి మొహమాటపడకపోవడం పవన్ కల్యాణ్ నిస్సిగ్గు తనంలోని మరో పరాకాష్ట.
గుజరాత్ నుంచి మత్స్యకారులను ఏపీకి తరలించడానికి నిధులు ఖర్చు పెట్టింది ఏపీ ప్రభుత్వం, బస్సులను ఏర్పాటు చేసింది ఏపీఎస్ ఆర్టీసీ, ఇలాంటి పరిస్థితుల్లో దారుల్లో తినడానికి కూడా ఏమీ దొరకదని తెలిసీ.. అంత దూరం బస్సులను నడిపి, సాహసోపేతంగా మత్స్యకారులను ఏపీకి తరలించింది ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులు.
ఈ వ్యవహారంలో కృతజ్ఞతలు తెలపాలని పవన్ కల్యాణ్ కు అంతగా అనిపిస్తే.. ఆయనకు ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించడానికి అక్కసు అడ్డు వస్తే.. కనీసం ఆర్టీసీ కార్మికులకు కృతజ్ఞతలు, అభినందనలు తెలపాల్సింది!
ఎవరెవరో గన్నయ్యల పేర్లను ప్రస్తావిస్తూ.. అందులోనూ నిధులు కేటాయింపు చేసింది ఏపీ ప్రభుత్వం అని తప్పక ఒప్పుకుంటూ..ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆ డబ్బులు విడుదల చేశారని చెప్పి కూడా కనీసం ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకుండా.. తన లోని అక్కసు, అసూయను పవన్ చాటుకున్నారు. అంతే కాదు.. బీజేపీ భజనలో రోజు రోజుకూ పవన్ కల్యాణ్ ముదిరిపోతూ ఉన్నాడు. ఆ జీ, ఈ జీ.. అంటూ పవన్ కల్యాణ్ ఒక రేంజ్ లో సాగిలాపడుతున్నారు. అయితే ఆ జీ లు మాత్రం ఈ జీని పట్టించుకునేలా లేరే!
వెనుకటికి జగన్ ఎలా ముఖ్యమంత్రి అవుతాడో చూస్తా.. అంటూ బహిరంగ వ్యాఖ్యానం చేసి, తన వదరబోతు తనాన్ని బయట పెట్టుకుని.. అలాంటి మాటలతో నవ్వుల పాలు అయ్యాడు. అయితే అంత జరిగినా పవన్ కు ఇంకా వాస్తవం అర్థం అయినట్టుగా లేదు, అయ్యేలా కూడా లేదు. ఇప్పటికీ అదే అక్కసు, అహంభావంతో పవన్ వ్యవహరిస్తూ ఉన్నారు. ఇలా అయితే ఏనాటికి ఈయన కనీసం ఎమ్మెల్యేగా నెగ్గగలిగేది?