అందరూ అతి పెద్ద సంక్రాంతి పండుగను వేడుకగా చేసుకుంటున్నారు. వచ్చిన చుట్టాలతో ఇంటిల్లిపాదీ హాయిగా ఆనందంగా గడుపుతున్నారు. కొత్త బట్టలు, పిండి వంటలతో లోగిళ్ళు కళకళలాడుతున్న వేళ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మాత్రం భయం భయంగా వాతావరణం ఉంది.
ఇక్కడ గత కొన్ని రోజులుగా భూకంపం ప్రకంపనలతో జనాలు అల్లాడుతున్నారు. అది ఎంతవరకూ ఉంది అంటే ఏకంగా రెండు వారాలలో ఏడు సార్లు ఇక్కడ భూకంపం వచ్చింది. అంటే రోజు విడిచి రోజు అలా భూమి ప్రకంపిస్తోంది అన్న మాట. ఈ నెల 5 నుంది ఇదే రకమైన పరిస్థితి ఉందని ప్రజానీకం అంటున్నారు. ఈ ఏడాది తొలిసారిగా 5న అర్ధరాత్రి భూ ప్రకంపనలు వచ్చాయి. దాంతో జనాలు హడలిపోయారు. అది స్వల్పంగా రావడంతో తెల్లారుతూనే ఎవరి పనుల్లో వారు పడిపోయారు.
ఆ తరువాత కూడా రోజు విడిచి రోజు అలా స్వల్పంగా భూ ప్రకంపలను వస్తూనే ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా భోగీ రోజు అర్ధరాత్రి మళ్లీ భూ ప్రకంపలను రావడంతో జనాలు బెంబేలెత్తిపోయారు. అంతా ఆనందంగా ఉన్న వేళ ఈ షాకులేంటి అని స్థానిక ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ భూ ప్రకంపలన మూలంగా సోంపేట, ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి మండలాల్లోని పలు చోట్ల స్వల్పంగా ప్రభావం చూపించింది అంటున్నారు. ఇక భోగీ రోజు రాత్రి అయితే పది గంటల నుంచి తెల్లవారు జాము మూడు గంటల మధ్యన అలా అపుడపుడు భూమి కంపిస్తూనే ఉంది. దాంతో ఇళ్ళలోనికి వెళ్లడానికి జనాలకు మాత్రం ధైర్యం చిక్కలేదు.
సంక్రాంత్రి సంబరాలకు అంతా సిద్ధమవుతున్న వేళలో ఇలా భూమాత భయపెట్టడం భావ్యమేనా అని ప్రజలు బాధతో అంటున్న మాట. మరి కొన్ని రోజులుగా అదే పనిగా ఎందుకు ఇలా ప్రకంపనలు వస్తున్నాయో చూడాలని అంటున్నారు అంతా. ఇలా తరచూ ఎందుకు భూమి కంపిస్తోంది అన్న దాని మీద అధ్యయనం చేయాలని స్థానిక ప్రజలు డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాన్ని గట్టిగా కోరుతున్నారు.