తెలంగాణలో బీఆర్ఎస్‌ను ఖాళీ చేసే పనిలో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు బిజీగా ఉన్నారు. ఇటీవల మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకున్న సంగతి తెలిసిందే. ఇంకా మరికొందరు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయ అడుగులపై కూడా రకరకాల ప్రచారం జరుగుతోంది. ఆయన టీడీపీలో చేరుతారని అంటున్నారు.
తాజాగా జనగామ ఎమ్మెల్యే, మాజీ సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన పల్లా రాజేశ్వరరెడ్డి పార్టీ మార్పుపై విస్తృత ప్రచారం జరుగుతోంది. నాయకులందరికీ అధికార పార్టీ అవసరం కావడంతో ప్రతిపక్షంలో ఉండడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. దీంతో పల్లా రాజేశ్వరరెడ్డి కాంగ్రెస్‌లో చేరికను కొట్టి పారేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో అమెరికా పర్యటనలో వున్న రాజేశ్వరరెడ్డి కాంగ్రెస్‌లో చేరికపై స్పందించారు.
పార్టీ మారాలని తనపై కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తెస్తున్న మాట నిజమే అని ఆయన అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారేది లేదని ఆయన తేల్చి చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ ఆరునెలల్లో తీవ్ర వేధింపులకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగైదు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. తన భార్య నీలిమ, కుమారుడు అనురాగ్‌పై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు నమోదు చేసిందన్నారు. ఇలాంటి కేసులకు తాను భయపడే ప్రశ్నే లేదన్నారు.
తెలంగాణ ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చినట్టు పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు. అరెస్టులు, పోలీస్ కేసులు తనకు కొత్త కాదని ఆయన తెలిపారు. తెలంగాణలో గతంలో ఎప్పుడూ ఇలాంటి వేధింపులు చూడలేదన్నారు.