కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి కేంద్ర ఎన్నికల సంఘం కూడా కీలక పాత్ర పోషించిందనే విమర్శలు వెల్లువెత్తుత్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు ఎందుకు పెట్టకూడదని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించడం దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. మద్రాస్ హైకోర్టు అన్నంత పని అయ్యింది.
పశ్చిమబెంగాల్ ఎన్నికల సంఘంపై ఓ మహిళ ఫిర్యాదు మేరకు మర్డర్ కేసు నమోదు కావడం చర్చనీయాంశమమైంది. ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు తుది దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. చిట్ట చివరిదైన 8వ విడత ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కరోనాతో టీఎంసీ అభ్యర్థి కాజల్ సిన్హా మృతితో ఆయన భార్య తీవ్ర ఆవేదనకు గురైంది.
ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌లో ఎనిమిది విడతల్లో పోలింగ్ నిర్వహించి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆమె ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన భర్త ప్రాణాలు పోవడానికి ఎన్నికల సంఘమే కారణమని ఆమె ఆరోపించింది.
ఈ మేరకు పశ్చిమబెంగాల్ ఎన్నికల సంఘంపై బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆ రాష్ట్ర పోలీసులు మర్డర్ కేసు నమోదు చేయడం సంచలనం రేకెత్తిస్తోంది.