రివ్యూ: జ్యోతిలక్ష్మి
రేటింగ్: 2.5/5
బ్యానర్: సికె ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి., శ్రీ శుభస్వేత ఫిలింస్
తారాగణం: ఛార్మి, సత్య, బ్రహ్మానందం, టార్జాన్, రామ్‌రెడ్డి తదితరులు
కథ: మల్లాది వెంకటకృష్ణమూర్తి
సంగీతం: సునీల్ కశ్యప్
కూర్పు: ఎస్.ఆర్. శేఖర్
ఛాయాగ్రహణం: పి.జి. విందా
సమర్పణ: ఛార్మి కౌర్
సహ నిర్మాత: బి.ఏ. రాజు
నిర్మాతలు: శ్వేతలాన, వరుణ్, తేజ
కథనం, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్
విడుదల తేదీ: జూన్ 12, 2015
‘‘ఆడపిల్లలంటే ఆ దేవుడికి కూడా చులకనే… అందుకే ఒక్క దేవుడు కూడా ఆడపిల్లని కనలేదు. అందరూ మగపిల్లల్నే కన్నారు!’’ ` జ్యోతిలక్ష్మి క్యారెక్టర్ ఈ డైలాగ్ చెప్పినప్పుడు పూరి జగన్నాథ్ అబ్జర్వేషన్‌కి, ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు దానిని సమర్ధించే సంభాషణలు రాయడంలో తనకున్న టాలెంట్‌కి సలాం చెప్పకుండా ఉండలేం. మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన ‘మిసెస్ పరాంకుశం’ నవలకి కాంటెంపరరీ ఇష్యూస్ జోడించి పూరి జగన్నాథ్ తీసిన జ్యోతిలక్ష్మి హడావిడి వ్యవహారం అనిపిస్తుందే తప్ప పూరి జగన్నాథ్ మనసు పెట్టి రాసిన కథనం అనే భావన కలిగించదు.
ఒక వేశ్యని పెళ్లి చేసుకుని ఆమెకి జీవితం ఇవ్వాలనే సదుద్దేశం ఉన్న ఓ యువకుడు (సత్య), తన వృత్తిని వదిలేసి చాలా మంది ఆడాళ్లలా గౌరవప్రదంగా జీవితాన్ని గడపాలని అనుకునే ఓ యువతి (ఛార్మి).. క్యారెక్టర్ల పరంగా చాలా బలమైనవీ, లోతైనవి. పూరి జగన్నాథ్ ఆ బలం చూపించే ప్రయత్నం కానీ, ఆ లోతు కొలిచే ప్రయాస కానీ వద్దనుకున్నట్టున్నాడు. అందుకే ఇలాంటి పాత్రల చుట్టూ పాప్‌కార్న్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి ట్రై చేసాడు. వేరే కథలని డీల్ చేసేప్పుడు ఈ లైట్ అప్రోచ్ కరెక్టే అనిపించవచ్చునేమో కానీ దీంట్లో టచింగ్ మూమెంట్ ఒక్కటీ లేకుండా అంతా ‘టచ్ మీ నాట్’ వ్యవహారంలా సాగిపోవడమే సమస్యగా మారింది.
జ్యోతిలక్ష్మిని ప్రేమిస్తున్నానంటూ సత్య ఆమెని రోజూ బుక్ చేసుకోవడం, ఆమెని కన్విన్స్ చేసి తనతో వచ్చేసి పెళ్లి చేసుకోవడానికి అంగీకరించేలా చేయడం, తీసుకెళ్లిపోవడం, పెళ్లి చేసేసుకోవడం వగైరా అంతా సినిమాటిక్‌గా ఉందే తప్ప ఎక్కడా కన్విన్స్ చేయలేకపోయింది. కానీ జ్యోతిలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి సత్య ఎందుకు నిర్ణయించుకుంటానే దానికి మాత్రం బలమైన లాక్ పడింది. సెక్స్ రాకెట్ నడుపుతోన్న వారిపై ఛార్మి తిరగబడాలని డిసైడ్ అయ్యే కీలక సన్నివేశాల్లో మాత్రం డ్రామా పండలేదు. ఎంత పెద్ద సమస్యని అయినా సింపుల్‌గా సాల్వ్ చేసేయడం పూరి సినిమాల్లో తరచుగా కనిపిస్తుంది. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’, ‘బిజినెస్‌మేన్’ చిత్రాల్లో ఇదే శైలిలో సమస్యలకి పరిష్కారం చూపించేసాడు. లార్జర్ దేన్ లైఫ్ ఇమేజ్ ఉన్న హీరోలతో తీసిన సినిమాల్లో కొన్ని లిబర్టీస్ చెల్లిపోతాయి కానీ ఇక్కడైనా పూరి రియాలిటీకి దగ్గరగా ఉండాల్సింది.
రీసెంట్‌గా జరిగిన శ్వేత బసు ప్రసాద్ ఇన్సిడెంట్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని క్లయిమాక్స్ పార్ట్ రాసుకున్నట్టున్నాడు. రెయిడ్‌లో ఆడవాళ్ల పరువు తీయాలని, మగాళ్ల పరువు దాయాలని చూసే మీడియాని, పోలీసులని సూటిగా ప్రశ్నించాడు. ‘ప్రముఖ పారిశ్రామికవేత్త’ అంటూ రెయిడ్‌లో దొరికిన వాడి ఐడెంటిటీని దాచేసే పద్ధతిని ఎండగట్టాడు. ఇక్కడ పూరి మార్కు సంభాషణలు కొన్ని బాగా పేలాయి. ఆడవాళ్లని సపోర్ట్ చేస్తూ పూరి తీసుకున్న స్టాండ్ ఈ సినిమాకో పర్పస్‌ని ఆపాదించడమే కాకుండా చిన్నపాటి సందేశాన్ని కూడా ఇచ్చింది. కాకపోతే ఉద్దేశం మంచిదే అయినప్పటికీ దానిని తీసిన విధానం ఆకట్టుకునేలా లేకపోవడం వల్ల జ్యోతిలక్ష్మి ఒక బోల్డ్ ఎటెంప్ట్‌గానే మిగిలింది తప్ప మూవింగ్ మూవీ కాలేకపోయింది. ‘టెంపర్’ మాదిరిగా ఎమోషనల్‌గా కదిలించే నిఖార్సయిన ప్రయత్నం మాటవరసకైనా చేసినట్టయితే కథౌచిత్యం నిలబడి ఉండేది.
ఇందులోని లీడ్ క్యారెక్టర్‌తో సింపథైజ్ కాకూడదనేదే పూరి ఉద్దేశంలా కనిపించింది. అందుకే ఆ పాత్రని తను లీడ్ చేసే లైఫ్ పట్ల రిగ్రెట్స్ లేని ప్రాస్టిట్యూట్‌లా చూపించడం జరిగింది. సింపథైజ్ చేయకపోయినా ఆ క్యారెక్టర్ యొక్క భావోద్వేగాలతో అయినా కనెక్ట్ అయ్యేలా ఉండాలి. ఏ పాత్ర ఇంటెన్సిటీని తెలియనివ్వకుండా అంతా పై పై వ్యవహారంలా సాగిపోవడం వల్ల బలమైన క్యారెక్టర్లు కూడా జస్ట్ క్యారికేచర్స్‌గా మిగిలిపోయాయి. తన స్టార్ డైరెక్టర్ ఇమేజ్‌ని పక్కన పెట్టి ఇలాంటి బోల్డ్ మూవీ తీయడానికి ముందుకొచ్చినందుకు పూరిని అభినందించాలి. పూరి కాస్త కాన్సన్‌ట్రేట్ చేసి ఇంకాస్త డీప్‌గా ఈ ఇష్యూని డీల్ చేసినట్టయితే తన కెరీర్‌లో ఒక గుర్తుండిపోయే సినిమా అయి ఉండేది. పూరి ఇమేజ్‌కి అభిముఖంగా చేసిన ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించిన నిర్మాతలని మెచ్చుకోవాలి.
ఛార్మి తను పోషించిన పాత్ర తాలూకు జాణతనాన్ని బాగా చూపించింది. సిస్టమ్‌పై తిరగబడే సీన్లలో కూడా రాణించింది. సత్య తన పాత్రకి న్యాయం చేసాడు. రిచ్ బ్యాచ్‌లర్‌గా బ్రహ్మానందం చేసిన క్యారెక్టర్ కామెడీకి అంతగా ఉపయోగ పడలేదు. సత్య స్నేహితుడిగా నటించిన కుర్రాడిలో ఈజ్ ఉంది. కరప్ట్ పోలీస్‌గా రామ్ రెడ్డి ఫర్వాలేదు. ముందే చెప్పినట్టు పూరి అక్కడక్కడా డైలాగ్ రైటర్‌గా మెప్పించాడు. పాటలు సోసోగా ఉన్నా సినిమాటోగ్రఫీ బాగుంది.
పూరి జగన్నాథ్ బ్రాండ్, ఛార్మి గ్లామర్, జ్యోతిలక్ష్మి టైటిల్‌కి ఉన్న మాస్ అప్పీల్ ఈ చిత్రానికి కలిసి వస్తాయి. లో బడ్జెట్‌లో రూపొందడం మరో అడ్వాంటేజ్. సినిమాగా హాఫ్ హార్టెడ్ ఎటెంప్ట్ అనే ఇంప్రెషనే కలిగించినా పైన చెప్పిన పాజిటివ్స్‌తో జ్యోతిలక్ష్మి కమర్షియల్‌గా పాస్ అయిపోతుందో లేదో చూడాలి.
బోటమ్ లైన్: ‘జ్యోతిలక్ష్మి’ కవ్వించింది కానీ కదిలించలేదు!
-గణేష్ రావూరి