Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: కార్తికేయ

సినిమా రివ్యూ: కార్తికేయ

రివ్యూ: కార్తికేయ
రేటింగ్‌: 3.25/5

బ్యానర్‌: మాగ్నస్‌ సినీ ప్రైమ్‌ ప్రై.లి.
తారాగణం: నిఖిల్‌, స్వాతి రెడ్డి, ప్రవీణ్‌, రావు రమేష్‌, సత్య, తనికెళ్ల భరణి, తులసి తదితరులు
సంగీతం: శేఖర్‌చంద్ర
కూర్పు: కార్తీక శ్రీనివాస్‌
ఛాయాగ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని
నిర్మాత: వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం
కథ, మాటలు, కథనం, దర్శకత్వం: చందు మొండేటి
విడుదల తేదీ: అక్టోబర్‌ 24, 2014

‘హ్యాపీడేస్‌’ తర్వాత ఎక్కువగా అల్లరి చిల్లర పాత్రలు చేయడానికి మొగ్గు చూపిన నిఖిల్‌ ‘స్వామిరారా’తో పంథా మార్చాడు. మాస్‌ని మెప్పించడానికి రొటీన్‌ చిత్రాల్ని నమ్ముకోవడం కంటే కథల్ని, కొత్త దర్శకుల్ని నమ్మడం మంచిదని రియలైజ్‌ అయ్యాడు. ‘స్వామిరారా’తో సుధీర్‌ వర్మ అతని నమ్మకాన్ని నిలబెడితే, ఆ చిత్రానికి సహాయకుడిగా పని చేసిన చందు ‘కార్తికేయ’తో నిఖిల్‌కి ఇంకో మంచి చిత్రాన్ని అందించాడు. 

కథేంటి?

సుబ్రమణ్యేశ్వరపురం అనే ఊరిలో సుబ్రమణ్యస్వామి గుడికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందామని ప్రయత్నించే ప్రతి ఒక్కరూ పాము కాటుకి చనిపోతుంటారు. ఆ గుడికి సంబంధించిన రహస్యం ఏమిటనేది తెలుసుకోవాలని తన ప్రయత్నం మొదలు పెడతాడు ఆ ఊరికి మెడికల్‌ క్యాంప్‌ మీద వచ్చిన మెడికో కార్తీక్‌ (నిఖిల్‌). ప్రతి యేటా కార్తీక పౌర్ణమికి వెలుగులు విరజిమ్మే ఆ గుడి వెనుక రహస్యం ఏమిటి? ఒకప్పుడు ఎంతో ఖ్యాతి గడించిన ఆ గుడిని గురించి ఎవరైనా మాట్లాడినా కానీ ఎందుకని చనిపోతున్నారు? ఆ రహస్యం ఛేధించడానికి చేసే ప్రయత్నంలో కార్తీక్‌కి ఏమవుతుంది?

కళాకారుల పనితీరు:

‘స్వామిరారా’లో కంట్రోల్డ్‌ పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్న నిఖిల్‌ మరోసారి అదే స్టయిల్‌ ఫాలో అయ్యాడు. డీసెంట్‌ పర్‌ఫార్మెన్స్‌తో తన పాత్రకి న్యాయం చేసాడు. స్వాతిని కూడా తన సహజ ధోరణికి భిన్నంగా నెమ్మదస్తురాలి పాత్రలో చూపించారు. నిఖిల్‌, స్వాతి జంట బాగుంది. అయితే అసలు కథలో స్వాతి చేయడానికి అంటూ ఏమీ లేకపోవడంతో తేలిపోయింది. రావు రమేష్‌, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషించారు. ప్రవీణ్‌, సత్య వినోదాన్ని పంచారు. తులసి కొంచెం ఓవర్‌ ది బోర్డ్‌ వెళ్లింది.  

సాంకేతిక వర్గం పనితీరు:    

చందు రాసిన డైలాగ్స్‌ సింపుల్‌గా బాగున్నాయి. కార్తీక్‌ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. లో బడ్జెట్‌లో తీసిన సినిమా అయినా కానీ రిచ్‌ అవుట్‌పుట్‌ ఇచ్చాడు. ప్రొడక్షన్‌ డిజైన్‌కి కూడా మంచి మార్కులు పడతాయి. ఈ చిత్రం నిడివి రెండు గంటలు దాటకుండా ఎడిటర్‌ షార్ప్‌గా ఎడిట్‌ చేసాడు. శేఖర్‌ చంద్ర స్వరపరిచిన పాటలు వినసొంపుగా ఉన్నాయి. పాటల కంటే నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రాణంగా నిలిచింది. డివోషనల్‌ బ్యాక్‌డ్రాప్‌కి తగ్గట్టుగా... అలాగే థ్రిల్లర్‌ జోనర్‌కి సూట్‌ అయ్యేట్టుగా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అద్భుతంగా చేసాడు. 

కొత్త దర్శకుడైనా కానీ చందు ఈ చిత్రాన్ని చాలా బాగా హ్యాండిల్‌ చేసాడు. తను ఎంచుకున్న పాయింట్‌ని అందరూ ఆమోదించదగ్గ విధంగా చెప్పడంలో డైరెక్టర్‌ విజయవంతమయ్యాడు. అన్ని శాఖల నుంచి మంచి పనితనం రాబట్టుకుని తనకి ఉన్న పట్టు చూపించాడు. సుధీర్‌ వర్మలానే తనకి కూడా డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌తో సినిమాలు తీయడం ఇష్టమని చాటుకున్న చందు నుంచి మరిన్ని వైవిధ్యభరిత చిత్రాలు ఆశించవచ్చు. 

హైలైట్స్‌:

  • స్టోరీ
  • బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌
  • ప్రొడక్షన్‌ డిజైన్‌
  • డైరెక్షన్‌

డ్రాబ్యాక్స్‌:

  • స్వాతి - నిఖిల్‌ ట్రాక్‌
  • చివరి ఘట్టం

విశ్లేషణ:

కొన్ని కామెడీ సీన్లు ఉంటే జనం ఎంజాయ్‌ చేసేస్తున్నారని ఈమధ్య చాలా మంది దర్శకులు సక్సెస్‌ కోసం సులువైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. రొటీన్‌కి భిన్నంగా ఆలోచించి... ఆకట్టుకునేలా సినిమా తీయడం కష్టంతో కూడుకున్న పని... అదో పెద్ద ఛాలెంజ్‌ కూడా. ఎందుకంటే రొటీన్‌గా చేసిన దాంట్లో తప్పులున్నా పెద్దగా పట్టించుకోరు కానీ కొత్తగా చేసిన ప్రయత్నంలో ఉన్న తప్పుల్ని భూతద్దంలో చూపించి వేలు చూపిస్తారు. అయినా కానీ కష్టమైన మార్గాన్నే ఎంచుకున్న దర్శకుడు చందు తన ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్‌ అయ్యాడు. 

ఆసక్తికరమైన కథాంశాన్ని ఎంచుకున్న దర్శకుడు ఆకట్టుకునే కథనం కూడా రాసుకున్నాడు. కథాపరంగా కాస్త సీరియస్‌నెస్‌ ఉన్న కాన్సెప్ట్‌ అయినా కానీ వినోదానికి లోటు రాకుండా చూసుకున్నాడు. ‘సస్పెన్స్‌కి కామెడీ తోడైతే ఫార్ములా హిట్టు..’ అంటూ ఒక సందర్భంలో హీరోతో చెప్పించిన డైరెక్టర్‌ దానిని తాను కూడా బలంగా నమ్మాడు. ప్లాట్‌ నుంచి డీవియేట్‌ కాకుండా కామెడీ పండించాడు. నవ్వించే సన్నివేశాలున్నా కానీ అవేమీ బలవంతంగా ఇరికించినట్టు అనిపించలేదు. 

హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు, తర్వాత వారి కుటుంబాల నేపథ్యంలో వచ్చే దృశ్యాలు మాత్రం అంతగా ఆకట్టుకోవు. పైగా అసలు కథకి బ్రేక్‌ వేస్తూ కొంచెం ఇబ్బంది పెడతాయి. ఈ మైనస్‌ పాయింట్‌ మినహాయిస్తే ఫస్ట్‌ అండ్‌ సెకండ్‌ యాక్ట్స్‌ వరకు డైరెక్టర్‌ చందు ఈ చిత్రాన్ని ఆకట్టుకునేలా తెరకెక్కించాడు. అయితే ఎప్పుడైతే థర్డ్‌ యాక్ట్‌ స్టార్ట్‌ అవుతుందో అప్పట్నుంచీ ఎప్పుడెప్పుడు ముగించేద్దామా అనే తొందర కనిపించింది. అంతవరకు ఎంతో గ్రిప్పింగ్‌గా సాగిన స్క్రీన్‌ప్లే పట్టు తప్పుతుంది. 

బడ్జెట్‌ పరిమితుల కారణమో, మరి ఏమిటో తెలియదు కానీ పతాక సన్నివేశాలు హడావుడిగా అనిపిస్తాయి. ఈ పార్ట్‌ని మరింత బాగా హ్యాండిల్‌ చేసినట్టయితే కార్తికేయ ఇంకో రేంజ్‌కి వెళ్లి ఉండేది. ఈ బలహీనతలు ఉన్నప్పటికీ డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోరుకునే ప్రేక్షకుల్ని చాలా వరకు సంతృప్తి పరిచే చిత్రమిది. భక్తి, సైన్స్‌ మధ్య ఉన్న సన్నని గీతపై నడిచిన దర్శకుడు అటు, ఇటు మొగ్గు చూపకుండా పాటించిన బ్యాలెన్స్‌ మెప్పిస్తుంది. రొటీన్‌ సినిమాలకి ‘పూజ’ చేసే ప్రేక్షకులకి మినహా వైవిధ్యభరిత చిత్రాల్ని ఆదరించే వారిని కార్తికేయ ఆకట్టుకుంటుంది. 

బోటమ్‌ లైన్‌: రొటీన్‌ సొద నుంచి రిలీఫ్‌ ఇచ్చే ‘కార్తికేయ’

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

Watch Karthikeya Public Talk

Watch Karthikeya Special Program With Nikhil And Swathi

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?