సినిమా రివ్యూ: లయన్‌

రివ్యూ: లయన్‌ రేటింగ్‌: 2/5 బ్యానర్‌: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమా తారాగణం: బాలకృష్ణ, త్రిష, రాధిక ఆప్టే, ప్రకాష్‌రాజ్‌, అలీ, ఎమ్మెస్‌ నారాయణ, జయసుధ, చంద్రమోహన్‌, గీత తదితరులు సంగీతం: మణిశర్మ కూర్పు:…

రివ్యూ: లయన్‌
రేటింగ్‌: 2/5

బ్యానర్‌: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమా
తారాగణం: బాలకృష్ణ, త్రిష, రాధిక ఆప్టే, ప్రకాష్‌రాజ్‌, అలీ, ఎమ్మెస్‌ నారాయణ, జయసుధ, చంద్రమోహన్‌, గీత తదితరులు
సంగీతం: మణిశర్మ
కూర్పు: గౌతంరాజు
ఛాయాగ్రహణం: వెంకట ప్రసాద్‌
నిర్మాత: రుద్రపాటి రమణారావు
రచన, దర్శకత్వం: సత్యదేవ
విడుదల తేదీ: మే 14, 2015

గత పదేళ్లలో బాలకృష్ణతో బోయపాటి శ్రీను ఒక్కడే హిట్‌ సినిమాలు తీయగలిగాడు. బాలకృష్ణ తన కెరీర్లో ఇంతవరకు ఎన్నో పవర్‌ఫుల్‌ మాస్‌ సినిమాలు చేసేసారు. ఆయనతో సినిమా తీసినప్పుడు సదరు సినిమాల కంటే మించి, లేదా ఆ స్థాయికి తగ్గట్టు కమర్షియల్‌ ప్యాకేజ్‌ చేస్తే తప్ప ఆడియన్స్‌ని మెప్పించడం కష్టం. బాలకృష్ణ ఇమేజ్‌కి తగ్గట్టు, ఆయన ఆహార్యం, వాచకాలకి సరితూగే పాత్రల్ని బోయపాటి శ్రీను తీర్చిదిద్దగలిగాడు. అందుకే సింహా, లెజెండ్‌ చిత్రాలు అంతగా ప్రేక్షకాదరణ పొందాయి. బి. గోపాల్‌ తర్వాత బాలకృష్ణని అంత పవర్‌ఫుల్‌గా చూపించింది బోయపాటి మాత్రమే. ఈ పదేళ్ల కాలంలో మిగతా దర్శకులంతా బాలకృష్ణతో సక్సెస్‌లు సాధించలేకపోవడానికి కారణం కూడా ఇదే. బోయపాటి అధ్యయనం చేసినట్టు బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్‌ని ఎవరూ స్టడీ చేయలేదు. ఆయనకి మాత్రమే సూటయ్యే పాత్రలని ఇంకెవరూ తీర్చిదిద్దలేదు. ఒకటి, రెండు సీన్లలో బాలకృష్ణని పవర్‌ఫుల్‌గా చూపించగలిగినా కానీ సినిమా అంతటా ఆ ఇంటెన్సిటీ చూపించడంలో, బాలకృష్ణకి ఉన్న కోర్‌ మాస్‌ ఫాన్స్‌ని శాటిస్‌ఫై చేయడంలో మిగతా వాళ్లు విఫలమయ్యారు. 

కొత్త దర్శకుడు సత్యదేవ అటు బాలకృష్ణ ఇమేజ్‌కి తగ్గ పవర్‌ఫుల్‌ పాత్రని సృష్టించలేదు, అంత పవర్‌ ఉన్న సన్నివేశాలనీ రాసుకోలేదు. మరోవైపు కనీసం మనం చూడని కొత్తదనాన్ని కూడా అందించలేదు. సత్యదేవ రాసుకున్న స్క్రిప్ట్‌లో బేసిక్‌ ప్లాట్‌ బాగానే ఉంది. తెరపైకి వచ్చిన అవుట్‌పుట్‌ కంటే పేపర్‌పైన రా మెటీరియల్‌ ఖచ్చితంగా బెటర్‌గానే ఉండి ఉంటుంది. అయితే ఆ స్టోరీ లైన్‌కి ఆకట్టుకునే స్క్రీన్‌ప్లే, ఎక్సయిట్‌ చేసే సీన్స్‌ రాయలేకపోవడంతో మొత్తం సినిమానే నీరస పడిపోయింది. 

కోమాలోంచి బయటకి వచ్చిన గాడ్సేని (బాలకృష్ణ) గత స్మృతులు వెంటాడుతుంటాయి. తాను గాడ్సేని కాదని, తనకో గతం ఉందని… తన వాళ్లమని చెబుతున్న వాళ్లెవరూ తన వాళ్లు కాదని అనిపిస్తుంటుంది. తనని తాను అన్వేషించుకునే ప్రయత్నంలో ముంబయి నుంచి హైదరాబాద్‌ వెళతాడు. అక్కడ మహాలక్ష్మిని (త్రిష) చూసి తన ప్రేయసి అంటాడు. ఆమె నువ్వెవరో నాకు తెలీదని అంటుంది. తన తల్లిదండ్రులు అనుకున్న వాళ్లు కూడా తనెవరో తెలీదని చెప్తారు. తాను బోస్‌ అని భావిస్తున్న గాడ్సేకి డిఎన్‌ఏ టెస్ట్‌ చేసిన డాక్టర్లు తను గాడ్సే అనే తేలుస్తారు. ఇంతకీ గాడ్సే ఎవరు, తనని బోస్‌ జ్ఞాపకాలు ఎందుకు వెంటాడుతుంటాయి?

కథగా వినడానికి ఆసక్తికరంగానే ఉన్న ఈ పాయింట్‌లో స్ట్రాంగ్‌ కాన్‌ఫ్లిక్ట్‌ కూడా ఉంది. కొత్త దర్శకుడైనా కానీ బాలకృష్ణ తనపై నమ్మకముంచి అవకాశం ఇవ్వడానికి ఇదే కారణమై ఉంటుంది. తను అనుకున్న కథని అంతే ఆసక్తికరమైన సినిమాగా మలచడంలో మాత్రం సత్యదేవ అనుభవ రాహిత్యం అడుగడుగునా కనిపించింది. తనని తాను అన్వేషించుకునే ప్రయత్నంలో ఉన్న హీరో కథతో అమాంతం కనెక్ట్‌ అయిపోయేలా కథనం ఉండాలి. అంత బలమైన కాన్‌ఫ్లిక్ట్‌ ఉన్న స్క్రిప్ట్‌తో ఇన్‌స్టంట్‌గా ఏర్పడే ఇంట్రెస్ట్‌తో నెక్స్‌ట్‌ ఏంటి, అసలు ఇతనెవరు అనే ప్రశ్నలకి సమాధానం కోసం ఉత్కంఠతో ఎదురు చూడాలి. కథ మొదలైన కొన్ని నిముషాలకే ఆసక్తి సడలిపోయేలా, అతనెవరనేది సస్పెన్స్‌గానే ఉన్నా కానీ దాని గురించి ఏమాత్రం పట్టకుండా పోయేలా కథనం చాలా బలహీనంగా సాగుతుంది. హీరోకి అతనెవరనేది తెలిసిన సీన్‌లో కూడా ఎమోషన్‌ పండలేదు. అరుపులు, పెడబొబ్బలే ఎమోషన్స్‌ అనుకునే భ్రమలోంచి దర్శకులు బయటకి రావాలి. కథలో అత్యంత కీలకమైన సన్నివేశాన్నే పేలవంగా చిత్రీకరించిన తర్వాత ఇక కొత్త దర్శకుడి నుంచి అద్భుతాలు ఆశించడం కూడా అనవసరం అనిపిస్తుంది. అందుకు తగ్గట్టే ద్వితీయార్థం కూడా బలహీన సన్నివేశాలతో నిస్సారంగా నడుస్తుంది. 

బాలకృష్ణ చిత్రాల్లో కొన్నిసార్లు సన్నివేశ బలం లేకపోయినా కానీ సంభాషణలతో వాటికి బలమొస్తుంది. పవర్‌ఫుల్‌ డైలాగుల్ని అద్భుతంగా పలకడంలో, మాస్‌ ప్రేక్షకులు ఉర్రూతలూగిపోయే ఉత్సాహాన్ని నింపడంలో బాలకృష్ణకి సాటి రాలేరెవరూ. ఇందులో సంభాషణలు కూడా పేలవంగా ఉన్నాయి. ఇంటర్వెల్‌ సీన్‌లో బాలకృష్ణ, ప్రకాష్‌రాజ్‌ మధ్య ఫోన్‌ కాన్వర్‌జేషన్‌ తేలిపోయింది. సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లాల్సిన టైమ్‌లో కూడా ‘లయన్‌’ యావరేజ్‌ ‘లైన్‌’ దాటలేక చతికిల పడిపోయింది. బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిలబెట్టడానికి తన శాయశక్తులా ప్రయత్నించారు. కొన్ని సందర్భాల్లో రచనా పరంగా, దర్శకత్వ పరంగా ఉన్న బలహీనతలు తనని కట్టి పడేస్తున్నా కానీ అభిమానుల్ని అలరించగలిగారు. సిబిఐ ఆఫీసర్‌ వర్సెస్‌ సీఎం క్లాష్‌ని చాలా సిల్లీగా చూపించారు. తెరపై జరిగే ఏ సన్నివేశాన్ని సీరియస్‌గా తీసుకోవడానికి లేకుండా లాజిక్‌ని పూర్తిగా గాలికి వదిలేసారు. కంప్యూటర్‌ హ్యాకింగ్‌, శాటిలైట్‌ ట్రాకింగ్‌ వగైరా అంశాలని ఇరికించి ఏదో హై డ్రామా జరుగుతోన్న ఉత్కంఠని రేపాలని చూసారు కానీ ఆ దృశ్యాలన్నీ అతి దారుణంగా తేలిపోవడంతో ‘లయన్‌’కి కనీసం క్లయిమాక్స్‌లో అయినా గర్జించే వీల్లేకపోయింది. 

ఎలాంటి పాత్రనైనా రక్తి కట్టించే ప్రకాష్‌రాజ్‌ ఇందులో ఒక ఎలిమెంటరీ లెవల్‌ నటుడిలా కనిపించాడు. త్రిష, రాధిక ఆప్టేలని చూసి జాలి పడే పరిస్థితి తెచ్చారు. సిబిఐ ఆఫీసర్‌ క్యారెక్టర్‌లో క్రైమ్‌ వాచ్‌ యాంకర్‌లా రెచ్చిపోయిన ఇంద్రజ.. ఓవరాక్షన్‌ అనే పదం చిన్నబోయేలా చేసింది. ప్రకాష్‌రాజ్‌ స్థాయి నటుడే క్లూలెస్‌గా కనిపించినపుడు ఇక ఇతర తారాగణం ఆ మాత్రం కంట్రోల్‌ తప్పడంలో వింతేముంటుంది. మణిశర్మ ట్యూన్స్‌లో ఒక్కటీ ఆకట్టుకోదు. అడపాదడపా నేపథ్య సంగీతంతో ఫర్వాలేదనిపించినా కానీ టోటల్‌గా అవుట్‌ ఆఫ్‌ ఫామ్‌ అనేది తెలుస్తూనే ఉంది. ముందే చెప్పినట్టు బేసిక్‌ ప్లాట్‌లో మేటర్‌ ఉంది కానీ దానిని ఆసక్తికరమైన సినిమాగా మలచడంలో డైరెక్టర్‌ ఇన్‌ఎక్స్‌పీరియన్స్‌ డామినేట్‌ చేసింది. తెరపై ఈ చిత్రానికి సర్వం తనే అయినట్టు, బాక్సాఫీస్‌ వద్ద కూడా బాలకృష్ణే ఈ చిత్రాన్ని తీరం చేర్చాలి. 

బోటమ్‌ లైన్‌: సింహం గర్జించలేదు!

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri