రివ్యూ: మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
రేటింగ్: 3/5
బ్యానర్: సిసి మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్
తారాగణం: శర్వానంద్, నిత్యామీనన్, పవిత్ర లోకేష్, సూర్య, చిన్నా, నాజర్, తేజస్వి, పునర్నవి తదితరులు
మాటలు: సాయిమాధవ్ బుర్రా
సంగీతం: గోపి సుందర్
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్ వి.ఎస్.
నిర్మాత: కె.ఎ. వల్లభ
సమర్పణ: కె.ఎస్. రామారావు
కథ, కథనం, దర్శకత్వం: కె. క్రాంతి మాధవ్
విడుదల తేదీ: ఫిబ్రవరి 6, 2015
అచ్చమైన ప్రేమకథా చిత్రాలు అరుదైపోయిన ఈ రోజుల్లో స్వఛ్ఛమైన ప్రేమకు నిర్వచనమిచ్చే ప్రయత్నం చేసాడు దర్శకుడు కె. క్రాంతిమాధవ్. ఇది ఇక హృద్యమైన, అందమైన, నిజమైన, నిర్మలమైన ప్రేమకథ.
కథేంటి?
రాజారామ్ (శర్వానంద్) ఒక రన్నర్. తనతోనే చదువుతోన్న నజీరాని (నిత్య) ప్రేమిస్తాడు. మతాలు వేరయినా కానీ ఇద్దరూ ప్రేమించుకుంటారు. కానీ అనుకోని పరిస్థితుల్లో విడిపోతారు. ఏళ్లు గడిచిపోతాయి. అయినా కానీ ఇద్దరూ తాము ప్రేమించిన వాళ్లని మర్చిపోకుండా ఆ జ్ఞాపకాలతో బతికేస్తుంటారు. విడిపోయిన ఈ ప్రేమికులు మళ్లీ ఒక్కటవుతారా లేదా?
కళాకారుల పనితీరు:
‘రన్ రాజా రన్’ చిత్రంలో హైపర్ యాక్టివ్ క్యారెక్టర్ చేసి మెప్పించిన శర్వానంద్‌ని ఈ చిత్రంలో చూస్తే కనీసం ఒక్కసారి కూడా ‘రన్ రాజా రన్’ చిత్రంలోని క్యారెక్టర్ గుర్తు రాదు. ప్రతి సినిమాకీ కొత్తదనం కోసం అన్వేషిస్తూ… ప్రతి పాత్రలోను పరకాయ ప్రవేశం చేస్తూ తన ప్రతిభకి ఎల్లలు లేవని చాటుకుంటున్నాడు. ఇప్పటికే చాలా ఇంప్రెసివ్ ట్రాక్ రికార్డ్ ఉన్న శర్వానంద్‌కి ఈ చిత్రం మరో మెమెంటోగా నిలిచిపోతుంది.
తనకోసమే కొన్ని క్యారెక్టర్లు పుడుతున్నాయా అన్నట్టుగా, తను కాకపోతే మరొకరు ఈ పాత్ర చేయగలిగి ఉండేవారా అనిపించేట్టుగా తనకి మాత్రమే సాధ్యమయ్యే రీతిలో అద్భుత అభినయంతో నిత్య మీనన్ అవార్డ్ విన్నింగ్ పర్‌ఫార్మెన్స్ ప్రదర్శించింది. శర్వానంద్ తల్లి పాత్రలో పవిత్ర లోకేష్ నటన ఈ చిత్రానికి మరో ఎస్సెట్. స్టూడెంట్ సక్సెస్‌లో తన సక్సెస్ వెతుక్కునే పాత్రలో సూర్య సహజంగా నటించాడు. నాజర్ చేసింది చిన్న పాత్రే అయినా కానీ కథని టర్న్ చేసే క్యారెక్టర్. తేజస్వి ఓకే అనిపిస్తుంది. నిత్య స్నేహితురాలిగా నటించిన నటి బాగా చేసింది.
సాంకేతిక వర్గం పనితీరు:
సంభాషణలు బాగున్నాయి. డెప్త్ ఉన్న డైలాగ్స్ సినిమాలో చాలా ఉన్నాయి. అయితే ఒక్కో సందర్భంలో మరీ డ్రమెటిక్‌గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. వాటిని కాస్త టోన్ డౌన్ చేసి ఉండాల్సింది. గోపీ సుందర్ నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ఊపిరి పోసింది. ప్రేమకథలకి ఫీల్ ఉన్న మ్యూజిక్ తప్పనిసరి. పాటలు వినడానికి బాగున్నాయి. అయితే సినిమాని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లే ఆడియో ఆల్బమ్ అయితే కాదిది. అభినందన, నీరాజనంలాంటి ఇన్‌స్టంట్ అప్పీల్, లాంగ్ లైఫ్ ఉన్న సాంగ్స్ ఉన్నట్టయితే ఈ చిత్రం మరో రేంజ్‌కి వెళ్లేది. ఛాయాగ్రహణం అద్భుతంగా కుదిరింది. ప్రతి ఫ్రేమ్ చాలా ప్లెజెంట్‌గా ఉంది. సినిమా నిడివి తక్కువే అయినా కానీ కథాగమనం మరీ నిదానంగా ఉండడం వల్ల చాలా సేపు ఉన్నట్టు అనిపిస్తుంది. అభిరుచిగల నిర్మాత అనిపించుకున్న కె.ఎస్. రామారావు సంస్థ నుంచి ఇటీవలి కాలంలో అలాంటి సినిమాలు రావడం లేదు. ఈ చిత్రంతో ఆయన మరోసారి తన టేస్ట్ తెలియజెప్పారు. సోకాల్డ్ కమర్షియల్ అంశాల కోసం నిర్మాత వల్లభ దర్శకుడిని ఏమాత్రం ఫోర్స్ చేయలేదని అర్థమవుతోంది.
Video: Malli Malli Idi Raani Roju Public Talk
‘ఓనమాలు’ చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు క్రాంతి మాధవ్ ఈ ప్రేమకథని కూడా అంతే స్వఛ్ఛంగా, మెచ్యూర్డ్‌గా తెరకెక్కించాడు. కథౌచిత్యాన్ని దెబ్బ తీసే ఒక్క సన్నివేశానికి కూడా తావివ్వలేదు. బాలచందర్, మణిరత్నం, గౌతమ్ మీనన్ తరహాలో ఈ లవ్ స్టోరీని అద్భుతంగా తీర్చిదిద్దాడు. ప్రేమ అనే భావనలో ఎంత స్వఛ్ఛత ఉందో దానిని తన సినిమాలో కళ్లకి కట్టినట్టు చూపించాడు. లవ్‌లో పడగానే నెక్స్‌ట్ ఫిజికల్ కాంటాక్టే అన్నట్టు చూపిస్తోన్న నేటి ప్రేమకథల మధ్య ఒక అమలిన ప్రేమకథని అందంగా తెరకెక్కించాడు. ఒక నవల చదువుతున్నట్టు, ఒక అందమైన కవితకి రూపం వచ్చినట్టు… ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఒక దృశ్య కావ్యంలా రూపు దిద్దుకుందంటే ఆ క్రెడిట్ పూర్తిగా క్రాంతి మాధవ్‌దే.
హైలైట్స్:
- స్టోరీ
- బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
- డైరెక్షన్
- నిత్యా మీనన్
- శర్వానంద్
డ్రాబ్యాక్స్:
- మెలోడ్రామా మోతాదు మించింది
- కొన్ని చోట్ల కథాగమనం మరీ మందకొడిగా సాగింది.
విశ్లేషణ:
ఈతరంలో చాలా మందికి ఈ చిత్రం చూస్తే ఇదంతా నిజమేనా… నిజంగా ఇలా ప్రేమించుకుంటారా అనే అనుమానం కలుగుతుంది. వేగం పెరిగిన జీవనశైలిలో ప్రేమ అనే అందమైన భావానికి అర్థం మారిపోయింది. ఇలాంటి టైమ్‌లో ప్రేమ గొప్పతనం, దాని గాఢత తెలియజేస్తూ సినిమా తీయడమంటే దుస్సాహసమేనని చెప్పాలి. ప్రేమ ఎక్స్‌ప్రెస్ చేసిన పది నిముషాల్లోపు ఆన్సర్ రాకపోతే సహనం కోల్పోయే జనరేషన్ ఇది. ప్రేమించే వాళ్లకంటే ప్రేమిస్తున్నాం అనుకునే వాళ్లు.. ప్రేమించడం అనే ఫీలింగ్‌ని ఆస్వాదించడం కంటే… తమని ప్రేమించే వాళ్లు ఉన్నారని చూపించుకోవడం ఫ్యాషన్ అని భావించేవాళ్లు పెరిగిపోయిన కాలమిది.
ఇలాంటి టైమ్‌లో ప్రేమ లోతుల్ని కొలిచి, దాని విలువని చాటిచెప్పే చిత్రం చేయాలనే ఆలోచన రావడం, దానిని నిష్కళంకంగా తెరకెక్కించడం మాటలు కాదు. అందుకు ఈ చిత్ర నిర్మాత, దర్శకులని ఎంత మెచ్చుకున్నా తక్కువే. అయితే ఈ జోనర్ సినిమాలకి కొన్ని ఇబ్బందులున్నాయి. పరుగులు పెట్టిద్దామన్నా కూడా ఈ తరహా చిత్రాల్ని వేగంగా ముందుకి నడిపించడం కష్టమే. అయితే దర్శకుడు సైతం ఎలాంటి అర్జన్సీ చూపించకపోవడంతో వేగం మరీ మందగించింది. అలా వేగం తగ్గిన సందర్భాల్లో సంభాషణలు కూడా భారంగా మారినపుడు మాత్రం ఈ చిత్రం కాస్త ఇబ్బంది పెట్టింది.
Video: Malli Malli Idi Raani Roju Public Talk
ఎంత మెచ్యూర్డ్ లవ్‌స్టోరీ అయినా, ప్రేమ గొప్పతనం చాటేందుకు దర్శకుడు శతధా ప్రయత్నించినా సహజత్వానికి దూరంగా వెళ్లిపోయి మెలోడ్రామాతో నింపేయాల్సిన అవసరం లేదు. ఎంత ప్రేమలో మునిగిపోయిన వారు అయినా, ఎంతగా ప్రేమలో గాయపడిన వారు అయినా కానీ మరీ ప్రతి మాటలోను డ్రామా పిండేయరు. ఆ బ్యాలెన్స్ ఒక్కటీ మెయింటైన్ చేసినట్టయితే, ప్రేమ తాలూకు భావాల్ని, స్పందనల్నీ కూడా సహజంగా చూపించినట్టయితే ఈ చిత్రం ఈ కాలంలో వచ్చిన అపురూప ప్రేమకథా చిత్రంగా నిలిచిపోయి ఉండేది. అవసరానికి మించిన మెలోడ్రామా ఉన్నప్పటికీ ప్రేమలోని ప్యూరిటీని హైలైట్ చేసిన విధానం, ప్రేమికులకి ఉండాల్సిన కన్విక్షన్‌ని కన్వే చేసిన విధానం ఈ చిత్రాన్ని ‘ప్రేమికులకి’ దగ్గర చేస్తుంది. నిజమైన ప్రేమ అనుభూతి ఏంటనేది తెలిసిన వారందరూ దీనిని అప్రీషియేట్ చేసేట్టుంది. కాకపోతే ఆ క్రమంలో కమర్షియల్‌గా కావాల్సినవెన్నో త్యాగం చేసిన ఈ లవ్‌స్టోరీ ఎంటర్‌టైన్‌మెంట్ లవర్స్‌ని మాత్రం తీవ్రంగా డిజప్పాయింట్ చేస్తుంది. దురదృష్టవశాత్తూ అదే ఈ చిత్ర ఫలితాన్ని కూడా శాశించే అవకాశముంది.
బోటమ్ లైన్: మళ్ళీ మళ్ళీ రావు ఇలాంటి ప్రేమకథలు!
– గణేష్ రావూరి