రివ్యూ: పాఠశాల
రేటింగ్: 2.5/5
బ్యానర్: మూన్ వాటర్ పిక్చర్స్
తారాగణం: నందు, శశాంక్, హమూద్, సాయి రోనక్, అనుప్రియ, శిరీష తదితరులు
మాటలు: మహి వి. రాఘవ, రాజశేఖర్
సంగీతం: రాహుల్ రాజ్
కూర్పు: కె. శ్రవణ్
ఛాయాగ్రహణం: సుధీర్ సురేంద్రన్
నిర్మాతలు: రాకేష్ మహంకాళి, పవన్ కుమార్ రెడ్డి
కథ, దర్శకత్వం: మహి వి. రాఘవ్
విడుదల తేదీ: అక్టోబర్ 10, 2014
ఆకర్షణీయమైన పబ్లిసిటీతో సినీ ప్రియుల దృష్టిలో పడిన ‘పాఠశాల’ ఇప్పుడు ప్రేక్షకులు ముందుకి వచ్చింది. ఈ బళ్లో ఏమి చూపించారో… ఏమేమి నేర్పించారో చూద్దాం పదండి.
కథేంటి?
ఇంజినీరింగ్ పూర్తి చేసిన అయిదుగురు స్నేహితులు (నందు, అనుప్రియ, హమూద్, సాయి, శిరీష) జీవితంలో సెటిల్ అయ్యేందుకు ఏ నిర్ణయం తీసుకోవాలనే అయోమయంలో ఉంటారు. ముఖ్యంగా ఒకరిని విడిచి ఒకరు వెళ్లలేకపోతారు. ఆ టైమ్‌లో అయిదుగురు కలిసి ఒకరింటికి ఒకరు వెళ్లడానికి రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. ఈ ప్రయాణంలో తమ స్నేహితుల గురించి తమకే తెలియని కొత్త సంగతులు తెలుస్తాయి. తమ జీవితంలో ఏమి చేద్దామనే దానిపై వారికో క్లారిటీ వస్తుంది. ఆ ప్రయాణం వారికి ఏ విధంగా పాఠశాలగా మారి జీవిత పాఠాలు నేర్పుతుందనేది ఈ చిత్ర కథ.
కళాకారుల పనితీరు:
శశాంక్ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించాడు. అతని నటన బాగుంది. అయిదుగురు స్నేహితులలో నందు క్యారెక్టర్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. ఈజ్‌తో నటించాడు. హమూద్, సాయి నటన అంతంత మాత్రంగానే ఉంది. అనుప్రియ, శిరీష కూడా నటనతో ఆకట్టుకోలేకపోయారు. నందు మినహా స్నేహితుల బృందంలో ఎవరూ ఇంప్రెస్ చేయలేకపోయారు. సినిమా మొత్తం వీరి మీదే నడుస్తున్నప్పుడు… మంచి యాక్టర్స్‌ని సెలక్ట్ చేసుకుని ఉండాల్సింది.
సాంకేతిక వర్గం పనితీరు:
ఈ చిత్రానికి తారాగణం ఎంత బలహీనంగా ఉందో… సాంకేతిక వర్గం అంత బలంగా కుదిరింది. చక్కని లొకేషన్స్ ఎంచుకుని… కనువిందైన ఛాయాగ్రహణంతో ఆకట్టుకున్నారు. రోడ్ ఫిలింకి చక్కని విజువల్స్ తోడు కావాలి. ఆ విషయంలో పాఠశాల ఫుల్ మార్క్స్ స్కోర్ చేసింది. రాహుల్ రాజ్ నేపథ్య సంగీతం చాలా బాగుంది. దర్శకుడు మహి వి. రాఘవ్‌కి మంచి అభిరుచి ఉంది. చిన్న సినిమాల్లో ఇంత క్వాలిటీ అవుట్‌పుట్ అరుదుగా కనిపిస్తుంది. అన్ని క్రాఫ్ట్స్‌పై దర్శకుడికి కమాండ్ ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది.
హైలైట్స్:
- సినిమాటోగ్రఫీ
- లొకేషన్స్
- బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
డ్రాబ్యాక్స్:
- నందు మినహా మిగిలిన లీడ్ కాస్ట్ ఆకట్టుకోలేదు
- మందకొడి గమనం
విశ్లేషణ:
హ్యాపీడేస్ తర్వాత అలాంటి బడ్డీ ఫిలింస్ చాలా మంది ఎటెంప్ట్ చేసారు. ముఖ్యంగా కాలేజ్ తర్వాత ఏం చేయాలనే కన్‌ఫ్యూజన్‌పై పలువురు ఫోకస్ పెట్టారు. ఈ చిత్రం కూడా ఆ అంశం మీదే బేస్ అయింది. దానికి రోడ్ ట్రిప్‌ని నేపథ్యంగా పెట్టుకుని… ఆ ప్రయాణంలో జీవితం గురించి లీడ్ క్యారెక్టర్స్ తెలుసుకోవడంపై దర్శకుడు దృష్టి పెట్టాడు. ఈ ప్రయాణంలో జీవితమంటే ఏంటో తెలియడమనే థీమ్‌తో ‘గమ్యం’ వచ్చింది. ఈ పాఠశాల గురించి ఒక్క వాక్యంలో చెప్పాలంటే… ‘హ్యాపీడేస్ మీట్స్ గమ్యం’ అనవచ్చు. అయితే ఆ రెండు సినిమాల్లోను ఎమోషన్స్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ప్రధానంగా ఉంటుంది. ‘పాఠశాల’లో మాత్రం ఎమోషన్స్ ఎక్కువై… వినోదం బాగా తగ్గింది.
రోడ్ ట్రిప్స్ భారంగా అనిపించకూడదంటే… బోర్ కొట్టకూడదంటే ఎంటర్‌టైన్‌మెంట్ తప్పనిసరి. ‘జిందగీ నా మిలేగీ దుబారా’ కానీ, ‘గమ్యం’ అవనీ.. అంతగా ఆకట్టుకున్నాయంటే కారణం జర్నీ బోర్ కొట్టకుండా జాగ్రత్త పడడం వలనే. ఇందులోని ప్రధాన పాత్రలన్నిటికీ ఏదో ఒక సంఘర్షణ ఉంటుంది. నందు క్యారెక్టర్‌ని, కొంతవరకు అనుప్రియ క్యారెక్టర్‌ని మాత్రమే లైటర్‌వీన్‌లో డీల్ చేసి మిగతా పాత్రలని మెలోడ్రమెటిక్ మోడ్‌లో ఉంచేసారు. దీంతో నందుకి సంబంధించిన సీన్స్‌లో మినహా మిగిలిన చోట్ల రిలీఫ్‌కి తావు లేకుండా పోయింది. ప్రథమార్థంలో ఎక్కువగా రొమాన్స్, ఫ్రెండ్స్ మధ్య స్వీట్ నథింగ్స్ మీదే ఫోకస్ ఉండడం వల్ల ‘పాఠశాల’ రోడ్ ట్రిప్ ఇంటర్వెల్ వరకు సాఫీగానే సాగింది.
ద్వితీయార్థంలో మాత్రం లైట్ మూమెంట్స్ కంటే ఎమోషన్స్ ఎక్కువైపోయాయి. అసలే నిదానంగా సాగుతున్న సినిమాలో డ్రామా మితి మీరడంతో నీరసం వచ్చేస్తుంది. ‘రియలైజేషన్’ పార్ట్‌ని కుదిస్తే బాగుండేది. పాఠశాల గమనం నిదానంగా ఉండి బోర్ కొట్టించినా కానీ అడపాదడపా కొన్ని మంచి సన్నివేశాలు మూడ్‌ని రీసెట్ చేస్తాయి. పిల్లాడి డాన్స్ కాంపిటీషన్ సీన్, శశాంక్ తన లవర్‌కి తన ప్రేమ సంగతి తెలియజెప్పే సీన్ బాగా పండాయి. ఇలాంటి మూమెంట్స్ మరిన్ని ఉండి ఉంటే పాఠశాల మరింత ఆకట్టుకునేది. బోరింగ్ జర్నీలో ఎక్కడో ఒకటీ అరా ఇలాంటి మూమెంట్స్, ఫ్రెండ్స్ మధ్య సరదా సన్నివేశాలు మినహా పాఠశాల అలరించలేకపోయింది. మంచి ప్రయత్నం అనడంలో సందేహం లేదు కానీ మరీ ఇంత నిదానంగా సాగే చిత్రాన్ని, జోష్ కంటే డల్‌నెస్ ఎక్కువైన సినిమాని ఓపిగ్గా భరించడం కాస్త కష్టమైన విషయమే. ఓపిక చేసుకోగలిగితే ఓసారి పాఠశాలకెళ్లి రావచ్చు.
బోటమ్ లైన్: పాఠం బాగున్నా ప్రయాణం బోరు కొట్టింది!
-గణేష్ రావూరి
http://twitter.com/ganeshravuri
Watch Paathshala Movie Public Talk
Watch Special Interview With Paathshala Director Mahi V Raghav