Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: పి కె

సినిమా రివ్యూ: పి కె

రివ్యూ: పి కె
రేటింగ్‌: 4/5

బ్యానర్‌: వినోద్‌ చోప్రా ఫిలింస్‌, రాజ్‌కుమార్‌ హిరాని ఫిలింస్‌
తారాగణం: అమీర్‌ఖాన్‌, అనుష్క శర్మ, సంజయ్‌ దత్‌, సౌరభ్‌ శుక్లా, సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌, బొమన్‌ ఇరానీ తదితరులు
కథ, మాటలు, కథనం: రాజ్‌ కుమార్‌ హిరాని, అభిజిత్‌ జోషి
సంగీతం: అజయ్‌ అతుల్‌, శంతాను మోయిత్రా, అంకిత్‌ తివారి
కూర్పు: రాజ్‌కుమార్‌ హిరాని
ఛాయాగ్రహణం: సి.కె. మురళీధరన్‌
నిర్మాతలు: విధు వినోద్‌ చోప్రా, రాజ్‌కుమార్‌ హిరాని, సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌
దర్శకత్వం: రాజ్‌కుమార్‌ హిరాని
విడుదల తేదీ: డిసెంబర్‌ 19, 2014

వైద్యం మందులతోనే కాదు... మంచి మాటల్తో కూడా చేయవచ్చని ‘మున్నాభాయ్‌ ఎంబిబిఎస్‌’లో, మానవత్వ విలువల్ని, అహింస గొప్పతనాన్ని ‘లగేరహో మున్నాభాయ్‌’లో, పడికట్టు పద్ధతుల్లో చెప్పే చదువుల్తో పిల్లలపై ఒత్తిడి పెంచి చంపొద్దని ‘త్రీ ఇడియట్స్‌’లో.. పవర్‌ఫుల్‌ మెసేజ్‌ని హ్యూమరస్‌గా, హార్ట్‌ టచింగ్‌గా ఇవ్వడంలో రాజ్‌కుమార్‌ హిరాని ఆరితేరిపోయారు. ‘పి కె’లో కూడా రాజ్‌కుమార్‌ శైలిలో మార్పు లేదు. ఈసారి  ఆయన భక్తుల పద్ధతుల్ని, నమ్మకాల్ని సూటిగా ప్రశ్నించారు, సునిశితంగా విమర్శించారు, సున్నితంగా మొట్టికాయలు వేసి తనకి మాత్రమే సాధ్యమైన రీతిలో నవ్వుల్ని పంచారు. 

గ్రహాంతరవాసి పి కె (అమీర్‌ఖాన్‌) భూమ్మీదకి రాగానే తన స్పేస్‌ షిప్‌కి సిగ్నల్స్‌ పంపించే రిమోట్‌ని పోగొట్టుకుంటాడు. దానిని ఎక్కడ వెతకాలో, ఎవరిని అడిగితే దొరుకుతుందో తెలీక ఇబ్బంది పడుతోన్న పి కెకి అన్ని సమస్యలకి పరిష్కారం ఇచ్చేది భగవంతుడే అని తెలుస్తుంది. అయితే వందల కొద్దీ రూపాల్లో ఉన్న దేవుడిని ఎలా కొలవాలో, ఏ పద్ధతిలో ప్రసన్నం చేసుకోవాలో అర్థం కాదు. అతనికి టీవీ జర్నలిస్ట్‌ జగత్‌జనని (అనుష్క శర్మ) సాయపడుతుంది. ఆమె సాయంతో పి కె తను పోగొట్టుకున్నది ఎలా తిరిగి సాధించుకున్నాడు, ఈ క్రమంలో అతనెలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడు అనేది వెండితెరపై చూస్తేనే మజా.

Video: Watch PK Movie Public Talk

ఈ కథ చాలా కొత్తగా ఉన్నా కానీ ఈ కాన్సెప్ట్‌ని అయితే ఇంతకుముందే ‘ఓ మై గాడ్‌’ (తెలుగులోకి ‘గోపాల గోపాల’ పేరుతో రీమేక్‌ అవుతోంది) చిత్రంలో చర్చించారు. ఆ సినిమాలోలానే ఇందులో కూడా ఒక స్వామీజీదే నెగెటివ్‌ క్యారెక్టర్‌. ఈ పోలికలు తప్పిస్తే ఓ మై గాడ్‌, పి కె కంప్లీట్‌గా డిఫరెంట్‌ ఫిలింస్‌. గ్రహాంతరవాసి పాత్రలో అమీర్‌ఖాన్‌ అభినయం ఈ చిత్రానికి అతి పెద్ద ఎస్సెట్‌. ఏ పాత్రలోకి అయినా పరకాయ ప్రవేశం చేసేయగల అమీర్‌ఖాన్‌ ఏలియన్‌ పాత్రకి తగ్గట్టుగా తన బాడీ లాంగ్వేజ్‌ని మలచుకున్న తీరు అద్భుతం. ఆయనలోని గొప్ప నటుడికి ఇది మరో తిరుగులేని ఉదాహరణగా నిలిచిపోతుంది. అమీర్‌ఖాన్‌కి ఏమాత్రం తీసిపోకుండా అనుష్క శర్మ తన పాత్రకి నూటికి నూరు పాళ్లు న్యాయం చేసింది. ప్రధానంగా వీరిద్దరిదే ఈ సినిమా. సౌరభ్‌ శుక్లా, సంజయ్‌దత్‌ కీలక పాత్రల్లో చాలా బాగా నటించారు. బొమన్‌ ఇరాని, సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ సపోర్టింగ్‌ రోల్స్‌లో ఆకట్టుకున్నారు. 

పాటలు సినిమా ఫ్లోని ఇబ్బంది పెట్టకుండా సాగిపోయాయి కానీ రిపీట్‌ వేల్యూ తెచ్చిపెట్టే రేంజ్‌లో లేవు. నేపథ్య సంగీతం చాలా చాలా బాగుంది. ఛాయాగ్రహణం అంతకంటే బాగుంది. అలరించే సంభాషణలతో హిరానీ తన ముద్ర చాటుకున్నారు. హిరాని, అభిజిత్‌ జోషి కలిసి రాసిన స్క్రీన్‌ప్లేకి వంక పెట్టలేం. హిరాని దర్శకత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి సన్నివేశంపై ఆయన ‘స్టాంప్‌’ బలంగా కనిపిస్తుంది. మన చుట్టూ జరిగే వాటి నుంచే ఆయన కథలు పుడతాయి. అందుకే ఆయన సినిమాల్లో సహజత్వం పరవళ్లు తొక్కుతుంది. మనకి తెలిసిన వాటిపైనే ఆయన ఛలోక్తులు విసురుతారు. అందుకే నొప్పెట్టేంతగా నవ్వొస్తుంది. మనం తప్పులు గుర్తించలేనంతగా అలవాటు పడిపోయిన వాటినే ఆయన ప్రశ్నిస్తారు. అందుకే ఆయన సినిమాలు అంతలా గుచ్చుకుంటాయి. 

‘దేవుడితో డైరెక్ట్‌ కాంటాక్ట్‌ చేయవచ్చు’ అంటే ‘డైరెక్ట్‌ కాంటాక్ట్‌ ఉన్నప్పుడు ఇన్ని రకాల ప్రతిమలెందుకు?’ అని ప్రశ్నిస్తాడు పికె. ఇలాంటి సమాధానం దొరకని ప్రశ్నలు, ఇది నిజమే కదా అనిపించే సందర్భాలు కోకొల్లలు. రాజ్‌కుమార్‌ హిరాని క్లిష్టమైన పాఠాన్ని సుస్పష్టంగా చెప్పగల మాస్టర్‌. చేదు మాత్రకి సుగర్‌ కోటింగ్‌ ఇవ్వడంలో ఎక్స్‌పర్ట్‌. కడుపుబ్బ నవ్వించేసి అంతలోనే కంటతడి పెట్టించగల సిసలైన సినిమా డైరెక్టర్‌. పికె ఆ మేధావి గొప్పతనానికి, తెలివితేటలకి, సెన్సాఫ్‌ హ్యూమర్‌కి తాజా ఉదాహరణ అంతే. ఆయనపై ఎన్ని రెట్ల అంచనాలైనా పెట్టుకుని వెళ్లండి.. ఇంత కూడా నిరాశపరచకుండా పంపిస్తాడంతే. 

పికె ద్వితీయార్థంలో కాస్త నెమ్మదించిందనే కంప్లయింట్లు వినబడొచ్చు. అయితే ప్రశ్నించడంలో ఉన్న కంఫర్ట్‌ సమాధానాలు వెతుక్కోవడంలో ఉండదు. క్వశ్చన్స్‌లో ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆన్సర్స్‌లో ఉంటుందనే గ్యారెంటీ లేదు. పగలబడి నవ్వేట్టు చేసిన పికె.. గొంతు పూడుకుపోయేలా ఉద్వేగానికీ గురి చేస్తాడు. పికె వేగం ముందుకు సాగే కొద్దీ మందగించినా కానీ అది అర్థం చేసుకోతగిందే. కథకి తగిన ముగింపునిచ్చే క్రమంలో తెలిసి చేసిందే. ప్రతి మంచిలోను కొన్ని మచ్చలున్నట్టే పికె గమనంలోను కొన్ని హెచ్చు తగ్గులున్నా కానీ ఈమధ్య కాలంలో వచ్చిన అత్యుత్తమ చిత్రాల సరసన ఇది చేరిపోతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. 

సినిమా చివర్లో.. ‘పికె’ కథని పుస్తకం రాసిన అనుష్క శర్మ దానిని చదవడం ముగించగానే తన తండ్రి అదే పనిగా విజిల్స్‌ కొడుతుంటాడు. ఈ సినిమా అయిపోయాక చాలా మందికి అదే పని చేయాలనిపిస్తుంది. త్రీ ఇడియట్స్‌కి, పికెకి మధ్య అయిదేళ్ల విరామం తీసుకున్నారు హిరాని. నెక్స్‌ట్‌ సినిమాకి ఎన్నేళ్లయినా తీసుకోండి సర్‌జీ, ఇలాంటి అనుభూతి కోసం ఎన్నాళ్లు వేచి ఉన్నా ఫర్లేదని అనాలనిపిస్తుంది.  

Video: Watch PK Movie Public Talk

పికె చూస్తున్న సమయంలో చాలా సందర్భాల్లో కళ్లు తడి అవుతుంటాయి. అవి అమితమైన ఆనందం వల్లో, ఉబికి వస్తున్న ఉద్వేగం వల్లో అర్థం కాదు. చాలా మంది అంటున్నట్టు చివర్లో కాస్త నిరాశ కలిగే మాట నిజమే. అయితే అది అలా ముగించడం వల్లో.. లేక అసలుకే ముగించడం వల్లో తేల్చుకోవడం తేలిక కాదు. ఎప్పుడైపోతాయో అని ఎదురు చూసే సినిమాల మధ్య ఎక్కడ అయిపోతుందో అని బెంగ కలిగించే అరుదైన సినిమాటిక్‌ అనుభూతి ఇది. మిస్‌ అవకండి. 

బోటమ్‌ లైన్‌: హేట్సాఫ్‌ టు హిరాని!

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?