ఉగ్రవాది లఖ్వీని ఇంకో మూడు నెలలపాటు జైల్లోనే వుంచే దిశగా పాకిస్తాన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందట. అంతర్జాతీయంగా ఉగ్రవాది లఖ్వీకి బెయిల్ రావడంపై విమర్శలు వెల్లువెత్తడంతో పాకిస్తాన్, ఒత్తిడికి తలొగ్గాల్సి వచ్చింది. ఇటీవలే పాకిస్తాన్‌లోని పెషావర్‌లో గల ఓ సైనిక్ స్కూల్‌పై తీవ్రవాదులు దాడి చేసి, 150 మంది విద్యార్థుల్ని పొట్టనపెట్టుకున్న విషయం విదితమే. ఆ మరుసటి రోజే ఉగ్రవాది లఖ్వీకి బెయిల్ లభించడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
ఇక, ఉగ్రవాది లఖ్వీకి బెయిల్ రద్దు చేయాలని భారతదేశం డిమాండ్ చేస్తోంది. బెయిల్ రద్దు చేసినా, ఇంకొన్నాళ్ళు లఖ్వీ జైల్లోనే వున్నా.. అతనికి నష్టమేం లేదు. ఎందుకంటే, పాకిస్తాన్లో ఉగ్రవాదులకు జైలు అంటే, సొంతిల్లులానే వుంటుంది మరి. సకల సౌకర్యాలూ లఖ్వీకి పాకిస్తాన్ జైళ్ళలో లభిస్తాయి. ఫోన్ సౌకర్యంతోపాటు, ఆయనతో గడిపేందుకు ఆయన భార్యకూ అవకాశం కల్పిస్తారక్కడ. అలా జైల్లోనే భార్యతో సంసారం చేసి, లఖ్వీ ఓ బిడ్డకు తండ్రయ్యాడనే విమర్శలున్నాయి.
పాకిస్తాన్ జైల్లో ఉగ్రవాదులకు ఈ స్థాయి సౌకర్యాలు అందుతోంటే, వారు జైల్లో వుంటేనేం.. బెయిలొచ్చి బయట వుంటేనేం. బయట వుంటే రక్షణ తక్కువ.. అదే జైల్లో వుంటే ఫుల్ సెక్యూరిటీ.. దాంతోపాటు అప్పనంగా సకల సౌకర్యాలు. విచారణ త్వరితగతిన చేపట్టి, కఠిన శిక్ష విధించాలనే కోరాలి ఎవరైనా ఉగ్రవాదుల కేసు విషయమై.
వాస్తవాలిలా వుంటే, పాకిస్తాన్ మాత్రం.. ఇంకో మూడు నెలలదాకా ఉగ్రవాది లఖ్వీ జైల్లోనే వుండాల్సి వస్తుందంటూ, అదేదో ఘనకార్యంగా ప్రపంచానికి చెప్పుకుంటోంది. ఇదీ పాకిస్తాన్ ఉగ్ర నీతి.!