ఎమ్బీయస్‌ : ఎంత నేర్చినా… కాంతదాసులే!

74 ఏళ్ల డా|| రాజేంద్ర కుమార్‌ పచౌరీ పద్మవిభూషణ్‌ బిరుదాంకితులు. నోబెల్‌ బహుమతి తెచ్చుకున్న యునైటెడ్‌ నేషన్స్‌ వారి ఇంటర్‌గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లయిమాటిక్‌ ఛేంజ్‌ (ఐపిసిసి)కి 13 ఏళ్లగా చైర్మన్‌. అలాటి పెద్దమనిషి…

74 ఏళ్ల డా|| రాజేంద్ర కుమార్‌ పచౌరీ పద్మవిభూషణ్‌ బిరుదాంకితులు. నోబెల్‌ బహుమతి తెచ్చుకున్న యునైటెడ్‌ నేషన్స్‌ వారి ఇంటర్‌గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లయిమాటిక్‌ ఛేంజ్‌ (ఐపిసిసి)కి 13 ఏళ్లగా చైర్మన్‌. అలాటి పెద్దమనిషి యీ రోజు తల దించుకుని తన పదవుల నుంచి రాజీనామా చేయవలసి వచ్చింది. కారణం – కాముకత! భారతప్రభుత్వపు 'ద ఎనర్జీ అండ్‌ రిసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌' (టిఇఆర్‌ఐ – టెరి)కి డైరక్టర్‌ జనరల్‌గా వున్న పచౌరీపై ఆ సంస్థలో రిసెర్చి చేస్తున్న 29 ఏళ్ల రిసెర్చర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది – అతను తనను సెక్సువల్‌గా హెరాస్‌ చేస్తున్నాడని. తను 2013లో టెరిలో చేరిన దగ్గర్నుంచి వేధిస్తున్నాడని, అసభ్యమైన ఇమెయిల్స్‌, ఎస్సెమ్మెస్‌లు, తన కోరిక ఒప్పుకోకపోతే నిరాహారదీక్ష చేస్తానని బెదిరిస్తూ చేత్తో రాసిన లేఖలు పంపాడని, తనను తాకడానికి, ముద్దుపెట్టుకోవడానికి పలుమార్లు ప్రయత్నించాడని ఆమె చెప్పింది. ఆమె ఫిర్యాదు చేసిందని తెలియగానే మొదట పచౌరీ నాటకం ఆడబోయాడు. తన ఈ మెయిల్‌ ఎక్కవుంట్‌, మొబైల్‌ హ్యాక్‌ అయిపోయాయని, ఎవరో తన పేర అశ్లీల సందేశాలు పంపి తన పరువు తీయాలని చూస్తున్నారని, దీన్ని మీడియా జనంలోకి తీసుకెళ్లకూడకుండా నిరోధించాలని ఢిల్లీ హై కోర్టుకి వెళ్లి వారి అదేశం తెచ్చుకున్నాడు. దానితో అప్పటికే యీ వార్తను తన వెబ్‌సైట్‌లో పెట్టిన పత్రిక వెంటనే తీసేసింది. ఈ లోపునే అతని చేష్టల గురించి తక్కినవారు కూడా మాట్లాడడం మొదలుపెట్టారు. వృందా గ్రోవర్‌ అనే అడ్వకేట్‌ యితనిపై మరో టెరి ఉద్యోగిని కూడా యిలాటి ఆరోపణలే గతంలో చేసిందని బయటపెట్టింది. 'పచౌరీకి క్లయిమేట్‌ ఛేంజ్‌ కంటె మేట్‌ (సహచరి) ఛేంజ్‌పైనే మక్కువ' అంటూ ట్వీట్లు పడ్డాయి. 

ఇదంతా చూసి హై కోర్టు తన ఆదేశాన్ని ఉపసంహరించుకుని మీడియాకు స్వేచ్ఛ యిచ్చింది, విచారణలో సహకరించమని పచౌరీకి సలహా యిచ్చింది. అతని లాయరు పవన్‌ దుగ్గల్‌ 'నీ కేసు నేను వాదించను' అంటూ తప్పుకోవడంతో పచౌరీ పరువు గంగలో కలిసింది. టెరి నుండి అతను తప్పుకోవాలన్న డిమాండ్‌ రావడంతో ఫిబ్రవరి 24 న 'ఆయన లీవుపై వెళ్లారు' అని టెరి ప్రకటించింది. అంతకు కొన్ని నిమిషాలకు ముందే పచౌరీ ఐపిసిసి చైర్మన్‌ పదవికి రాజీనామా చేశాడు. 200 దేశాలకు పర్యావరణ విషయాలపై దిశానిర్దేశం చేసే సంస్థ నుండి యింత అమర్యాదకరంగా తప్పుకున్నాక గుండె పోటు వచ్చిందంటూ మర్నాడే  ఆసుపత్రిలో చేరాడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సైంటిస్టుకు ఏమిటీ దౌర్బల్యం? ప్రసిద్ధవ్యక్తులకు వయసు మీరి లైంగిక శక్తి వుడిగినా, శృంగారంలో కూడా తాము యింకా చురుగ్గా వున్నామని చూపించుకోవాలనే యావ వుంటుందని, అందుకే వారు ఔచిత్యం, హోదా మరచి, పదవి సహాయంతో అవతలివారిని బెదిరించి, తమ అహంకారాన్ని తృప్తి పరచుకుంటారని మానసిక శాస్త్రవేత్తలంటారు. తను ఎంత రసికుడో చెప్పుకోవడానికి పచౌరీ ఆత్మకథలా తోచే ''రిటర్న్‌ టు ఆల్మోడా'' అనే నవల రాశాడు. 

దానిలో హీరో 60 ఏళ్ల (పచౌరీ కంటె పదేళ్లు చిన్న) రసికుడు, పచౌరీ లాగే క్లయిమేట్‌ ఛేంజ్‌ ఎక్స్‌పర్ట్‌. ధ్యానం కోసం హిమాలయాల్లోని పచౌరీ స్వగ్రామమైన ఆల్మోడాకు వస్తాడు. ధ్యానం మాట ఎలా వున్నా స్థానిక వివాహిత మహిళలతో, టూరిస్టులుగా వచ్చిన విదేశీ వనితలతో, తన విద్యార్థినులతో శృంగారం సాగిస్తాడు. 2010లో పుస్తకం వెలువడగానే అందరూ 'డర్టీ ఓల్డ్‌ మాన్‌' అంటూ పచౌరీని దుమ్మెత్తిపోశారు. అతని వూహలు అక్షరాలకే పరిమితం కాలేదని, ఆచరణకు కూడా విస్తరించిందని యిప్పుడు తేలింది. ఇతని విషయం బయటకు రాగానే సోషలైట్‌, రచయిత్రి శోభా దే 'అవును, అతని బుద్ధి, చూపులు అలాటివే, నన్ను చూసీ చొంగ కార్చుకున్నాడు' అంది. రిసెర్చర్‌ ధైర్యాన్ని మెచ్చుకుంది. ఇతని వేధింపు భరించలేకపోతే ఆమె రెండేళ్ల క్రితమే ఉద్యోగం నుంచి రిజైన్‌ చేయాల్సింది అని ఎవరైనా అంటే తంతానంది. తప్పు యితనిదైతే ఆమె ఎందుకు ఉద్యోగం వదులుకోవాలి, అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన వ్యక్తిపై కేసు పెట్టిన ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాలంది. పచౌరీకి మద్దతు పలికేవారు ఒక్కరూ లేరు. తేజ్‌పాల్‌ ఉదంతం తర్వాత కూడా యీ ముసలి రసికులు పాఠాలు నేర్చుకోవటం లేదంటే ఏం చెప్తాం! 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2015)

[email protected]