బాపుగారి గురించి ప్రఖ్యాత గాయకులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగారు ''హాసం'' పత్రికలో ''బాపు విశ్వరూపం'' శీర్షిక క్రింద 2002 లో వ్రాసిన వ్యాసపరంపర. బాలుగారికి కృతజ్ఞలతో, ''హాసం'' సౌజన్యంతో పునర్ముద్రణ…
నేను ఎంతసేపూ సినిమాల గురించే మాట్లాడుతున్నాను. బాపు గీత గురించి, బాపు అక్షరం గురించి ఏమి చెప్పగలను. ఇక రమణగారి పదాల పడికట్టు అంటే నాకు మహా ఇష్టం. బ్రివిటితో ఆ పద్ధతిలో డైలాగులు రాసేవాళ్లు చాలా అరుదు. ఆరోజుల్లో ఒక్క ఆత్రేయను చూశాను, ఆ తర్వాత గణేష్ పాత్రో, ఇప్పుడొస్తున్న వాళ్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్. చాలా అరుదైనటువంటిది రమణగారి పద్ధతి. ఎంత లోతైన భావాన్నయినా పాత్రలతో మామూలు వాడుక పదాలతో ఎలా చెప్పిస్తారో బయట కూడా అంత ముక్తసరిగా మాట్లాడుతారు. ''శ్రీనాథకవిసార్వభౌమ''లో ఆఖర్న నిర్యాణం చెందబోయేముందు భార్య విలపిస్తూంటే – అనునయిస్తూ శ్రీనాథుడు చెప్పేటటువంటి సంభాషణ నాకు చాలా నచ్చింది. ఆ సినిమా కోసం ఆయన రాసుకున్న స్క్రీన్‌ప్లే పుస్తకం చూసి నాకు నచ్చిన సన్నివేశాలన్నీ ఆయన పర్మిషనుతో చించి తీసి జాగ్రత్తగా దాచుకున్నాను. అవి నాకు దొరికిన వరాలు. 'మన ఘంటసాల' ప్రింట్ చేసిన తర్వాత కూడా ఇంటికి పంపిస్తే బాపుగారు ఊర్లో లేరు. రమణగారు ఒక అందమైన ఉత్తరం రాసి పంపించారు నాకు. దాన్ని అతి జాగ్రత్తగా దాచుకున్నాను నేను. ఇప్పటికి వీటి విలువలు తెలియవు. ఆ తర్వాత నా మనుమలు మనుమరాళ్లకు కూడా ఇవి ఫలానా వాళ్లు రాశారని చూపించాలని నా కోరిక. నేను లేకపోయినా వాళ్లు చూసి చదివి సంతోషించాలన్నది నా ఆకాంక్ష.
చాలామంది నిరాడంబరంగా ఉంటున్నట్టు నటిస్తారు. కానీ బాపురమణలగారి నిరాడంబరత నిజంగానే…! అసలు వాళ్ల రక్తంలో ఉన్నటువంటి లక్షణమే అది. ఆడంబరంగా డ్రస్సు చేసుకోవడం కానీ ఎప్పుడూ చూడలేదు నేను. ఒక్కోసారి చినిగిన చొక్కాలు వేసుకోవడం కూడా గుర్తుంది నాకు. ''ముత్యాలముగ్గు'' సినిమా అవార్డు వచ్చిన తర్వాత దూర్‌దర్శన్‌లో బాపుగారిని రమణగారిని ఓ ఇంటర్య్వూ నన్ను చేయమన్నారు. వాళ్లిద్దర్ని పట్టుకొని దూరదర్శన్‌కు తీసుకొచ్చేసరికి తలప్రాణం తోకకొచ్చింది. మొదట బాపుగారిని తీసుకొచ్చాం రమణగారు ఎంతకూ రారు. వస్తారో రారో తెలియదు. వెయిట్ చేస్తూ కూర్చున్నాం. బాపుగారు కూడా ఫోన్ చేస్తున్నారు – 'ఏమిటి వెంకటరావ్ ఎక్కడున్నావ్' అని.
'ఇంట్లోనే ఉన్నాను.' అన్నారు రమణ.
'మరి రావేమిటి?'
'చొక్కా చాకలికి వేసాను. ఇంకా రాలేదు. మంచి చొక్కా లేదయ్యా ఎలా రాను?'
'నా చొక్కా ఉంటుంది, వేసుకొని రావయ్యా' అని బాపు.
తీరా వచ్చిన తర్వాత ప్రశ్నలు అడిగినవాణ్నీ నేనే! సమాధానాలు చెప్పినవాణ్నీ నేనే!! అన్నింటికి ముక్తసరిగా తల కదిలిస్తూనో… లేక 'ఊహు.. ఆహా..' అంటూనో వున్నారే తప్ప నోరు విప్పి ఒక్క మాట మాట్లాడలేదు.
అలాగే దర్శకుడు వంశీ బాపుగారి విూద ఒక డాక్యుమెంటరీ తీశారు. సూత్రధారిగా నన్ను నిర్వహించమన్నారు. ఆరోజున కూడా అదే తంతు… ప్రశ్నలు మేమే రాసుకుని సమాధానాలు కూడా వారి దగ్గర్నుంచి ముందుగా రాయించి పెట్టుకుని 'ఇలా అంటారా? అలా అంటారా? 'ఓహో.. అదన్నమాట' అని అనవలసి వచ్చింది.
బాపుగారు, రమణగారు ప్రసంగించడం నేను వినలేదు. ఇక సభలు ఫంక్షన్స్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఏనాడూ వేదిక విూద కూర్చోరు. వాళ్ళ సినిమా ''ముత్యాలముగ్గు'' సిల్వర్ జూబిలీ ఫంక్షన్ విజయవాడలో జరుగుతోంది. అందరు లోపలకి వెళ్లిపోయారు. చివరి కారులో నేను, గంటి లక్ష్మణ బాబాయి, రమణగారు వెళ్తున్నాం. అప్పటికే జనం ఎక్కువైపోయి గేట్లు వేసేశారు. ముందుసీట్లో రమణగారు ఉన్నారు. గేట్‌మన్ ఆయన్ని గుర్తుపట్టలేదు. గేటు తీయనంటున్నాడు. లోపల రగడ, పోలీసులు.
''మనం హాయిగా హోటల్ వెళ్లిపోదామండి. మనం ఇక్కడుండి చేసేది లేదు. లోపల ఉండాల్సినవాళ్లు ఉన్నారు. సినిమా ఫంక్షన్ అయిపోతుంది మనం అనవసరం కదా' అని అన్నారు రమణగారు. నాకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు. అతి బలవంతంగా లోపలికి తీసుకెళ్తే ఆ రోజు అసలు వేదిక విూద కూర్చోలేదు. ఓ మూల నిల్చున్నారు అంతే! ఒక పూలమాల కూడా వేయించుకోలేదు. అదీ వాళ్ల వినయ సంపద.
అలాగే ''త్యాగయ్య'' చేస్తున్నప్పుడు కూడా! ''శంకరాభరణం'' లో అయినా కూడా వాగ్గేయకారుల పాటలు ఒకటో రెండో తప్ప మిగతావన్నీ మామ కంపోజ్ చేసినవే. ఇందులో త్యాగయ్య స్వరపరిచిన కీర్తనలు పాడాలి. కాళ్లలో వణుకు, గుండెలో చలి. ఏం చేయాలో తెలియదు… నావిూద ఎంతో నమ్మకంతో పుహళేందిగారి చేత పాడించి, రిహార్సల్స్ చేయించి… 'మాకు కావాల్సింది ఆ గమకాలు స్వరాలు కాదండి. … ఆ ఆర్తి కావాలి… అది విూరే పలికించాలి' అని నాచేత పాడించుకున్నతీరు జీవితంలో మరిచిపోలేను.
పండితుల దృష్టిలో నేను పాడింది శుద్ధ కర్ణాటకం కాకపోవచ్చేమో కాని కొంతమంది గొప్ప విద్వాంసులు కూడా ఈ భావం మేం పలికితే ఎంత బావుండేది అని అనిపించేలా నాచేత పాడించుకున్నటువంటి బాపురమణలకి – ఎన్ని వేలసార్లు వాళ్ల పాదాలు కడిగి నా నెత్తివిూద నీళ్లు పోసుకున్నా కూడా ఆ ఋణం తీర్చుకోలేను.
ఇలా చెపుతూ పోతే ఎన్నెన్నో చెప్పవచ్చు. చాలాచాలా సంఘటనలు ఉన్నాయి నేను చెప్పవలసినవి. మర్యాదపూర్వకంగా ప్రింట్‌లోకి రాలేనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. వాటిలో కూడా వాళ్ల సహృదయం, మాతో కలిసిపోయినటువంటి పద్ధతి , వాళ్లు చూపించిన ఆదరణ జన్మలో మరిచిపోలేను. గొప్ప ఆదృష్టం ఇంకొకటి ఏమిటంటే – నేను గాయకుడిగా పుట్టినరోజు, అంటే మొట్టమొదటి నా పాట రికార్డ్ చేసిన రోజు డిసెంబరు 15, 1966. బాపుగారి పుట్టినరోజు కూడా. డిసెంబరు 15 ప్రతిసంవత్సరం ఆయనకు ఫోన్‌చేసి 'ఇవాళ నా పుట్టినరోజండి' అంటా! 'అదేంటి జూన్ కదా' అంటారాయన. 'గాయకుడిగా పుట్టింది నేను ఈరోజునే' అంటే… 'హౌ లక్కీ అయామ్' అంటారాయన.
ఇలాంటి మహామనీషుల్ని అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచినటువంటి ఈ మహానుభావుల్ని….వాళ్లని గౌరవించవలసిన బాధ్యత ప్రభుత్వానికి చాలా ఉన్నది. నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను – తెలుగుదేశంలో ఇవాళ ఎవరో కొద్దిమంది తప్ప వాళ్ల గురించి అనుకునేవాళ్లే లేరు. ముఖ్యంగా సినిమా పరిశ్రమ. ఇలాంటి మహానుభావులకు దక్కవలసినటువంటి గౌరవం దక్కలేదని నా బాధ. ఏమాత్రం అవకాశం ఉన్నా వాళ్లకు కట్టబెట్టవలసిందంతా కట్టబెట్టాలి అన్నదే నా తాపత్రయం. కానీ వాళ్లను ఒప్పించడం కూడా చాలా కష్టమైన విషయమే. ఎందుకంటే అలాంటి వాటికి చాలా దూరంలో ఉండేటువంటి వ్యక్తులు వాళ్లు.
ఇలాంటి మహానుభావుల గురించి… కొన్ని నేరుగా వారితో చెప్పుకోలేనటువంటివి ''హాసం'' మూలంగా చెప్పుకునే అవకాశాన్ని నాకు ఇచ్చారు. ఇది కూడా సంపూర్ణంగా నా మనసులో ఉన్నదంతా చెపుతున్నానన్న తృప్తి నాకు లేదు. చెప్పదలచుకుంటే ఓ గ్రంథమే వ్రాసేయవచ్చు. ఇప్పుడు ''హాసం''లో వారి గురించి వస్తున్న ఈ వ్యాసాల్లో నాది కూడా ఒకటి అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకు ''హాసం'' కి నేను చిర ఋణగ్రస్తుణ్ణి.
బాపు రమణ అంటే – తెలుగు మాటా, పాటా – కలం, సిరా – శ్రుతి, లయ – స్వరం, భావం – దీపం, కాంతి – భాష, భావం – వేదం, నాదం – అక్షరం, పదం… వీరిద్దరికి భగవంతుడు చిరాయువుని ఇవ్వాలి. తెలుగునాట వీరు తయారుచేసిన కదిలే కదలని బొమ్మల కొలువులు చిరకాలం ఉండాలి. వీళ్ల బొమ్మల కొలువుతో ప్రతిరోజు దసరాగా కావాలి. భగవంతుడు వీళ్లకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. వీళ్లకు రావలసిన గుర్తింపు రావాలి. ఇవి నా కోరికలు… నేను కవిని కాను. తెలుగు విూద నాకు మక్కువ ఎక్కువ ఉన్నందువల్ల అందరూ నాకు తెలుగులో ప్రవేశం ఉందని అనుకుంటారు కాని రాయదలచుకుంటే నేను ఎంతెంతో రాయాలనిపిస్తుంది కాని నాకు చేతకాదు… నా గుండెను పేపరు విూద పరిచాను… ఇంతకంటే నేను ఏం చెప్పలేను… వాళ్లకు సాష్టాంగ దండ ప్రమాణాలు సమర్పించుకుంటున్న…
ఓ భక్తుడు
బాలసుబ్రహ్మణ్యం