బాపుగారి గురించి ప్రఖ్యాత గాయకులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగారు ''హాసం'' పత్రికలో ''బాపు విశ్వరూపం'' శీర్షిక క్రింద 2002 లో వ్రాసిన వ్యాసపరంపర. బాలుగారికి కృతజ్ఞలతో, ''హాసం'' సౌజన్యంతో పునర్ముద్రణ…
ఆయన అన్నిరకాల సంగీతాల్నీ విని అధ్యయనం చేసేవారు. ఆయన దగ్గర చాలా కలెక్షన్లు ఉండేవి. ''జాకీ''లో 'అలా మండిపడకే జాబిలి' పాట పల్లవివిూద ఒక ఫ్లూట్ కాంబినేషన్‌లాగ ఇంటర్లూడ్ వస్తుంది. అది ముందు మేం కంపోజ్ చేసుకుని ఉన్నప్పుడు లేదు. ఆయన ఒక ఇంగ్లీషు పాటలో విని 'నాకు ఇలా కావాలి' అని ఆడిగి చేయించుకున్నారు. అప్పట్లో ఇప్పుడున్నటువంటి విస్తారమైన సింథసైజర్స్ లేవు. అప్పుడు నా సింథసైజర్ ప్లేయర్ మాధవపెద్ది సురేష్. అతని దగ్గరున్న ఇన్‌స్ట్రుమెంట్ లోంచి సౌండ్ పట్టుకొచ్చి వాయిస్తే ఆయనకు చాలా నచ్చింది. ఆ తర్వాత పల్లవిలో పాటంతా అయిపోయిన తర్వాత కోడా లాగా ఆ మ్యూజిక్ విూదే ఎండ్ అవుతుంది కూడా! ఆయనకు ఆ పాట చాలా ఇష్టం. అందులో ఉన్నటువంటి ఆయనకు ఇష్టం.
''సీతమ్మ పెళ్లి'' మ్యూజిక్ కూడా ఒక గమ్మత్తయిన అనుభవం నాకు. విజయకృష్ణగారి ఆఫీసులో కంపోజింగ్. బాపుగారు సెట్‌లో ఉన్నప్పుడు చాలా తక్కువ శబ్దం ఉంటుంది. ఎక్కడా అరవడాలు ఉండవు. అలాగే కంపోజింగ్ చేస్తున్నప్పుడు కూడా. ఆయన వేరే ఏవిూ పనిచేయకుండా ఊరికే అలా కూర్చుని 'విూరు ఏమి చేస్తున్నారో చూస్తాను' నేను అన్నట్టు ఉండరు. ఏదో పుస్తకం చదువుకుంటూనే ఉంటారు. అప్పట్లో ఆయన పైప్ కాల్చేవారు. పైప్ నోట్లో పెట్టుకుని పుస్తకం చదువుకుంటూ ఉండేవారు. నాకు సన్నివేశం చెప్పేవారు. మేం ఒక ట్యూన్ మా కంపోజింగ్ బృందంతో ఒక రాగంలో ఒక ట్యూన్ అనుకుంటూ ఉంటాననుకోండి ఏదో ఒక నడకను ఫిక్స్ చేసి దానికి తగినటువంటి ఒక ట్యూన్ నేను అనుకుంటూ ఉంటే అది ఆయనకు నచ్చని రాగమైతే నేను ఎప్పుడు ఆయన వైపు చూస్తానా అని చూస్తూండేవారు.
అంతవరకు అసలు మాతో ఇన్వాల్వ్ అయ్యేవారు కారు, పుస్తకం చదువుతూ ఉండేవారు. ఎప్పుడైనా ఆయన వైపు తిరిగినపుడు పుస్తకంలోంచి కళ్లు తిప్పి 'ఈ రాగం అక్కర్లేదు' అన్నట్లుగా కళ్లు చిట్లించేవారు. అది నాకు అర్థమయ్యేది. వెంటనే వేరే రాగంలోకి వెళ్లిపోయేవారం. అలాగే ఆయనకు నచ్చిన రాగం, నచ్చిన నడక వచ్చిందంటే కనుబొమ్మలు పైకి ఎగరేసి బాగుంది అన్నట్టుగా చూసేవారు. అంతే… అంతకంటే ఏవిూ లేదు. తర్వాత ఓ పల్లవిని, ఓ చరణాన్ని చేసి వినిపిస్తే – ఎక్కువ ఆల్టర్నేటివ్స్ కూడా అడిగేవారు కాదు. ఆయనకు నచ్చేది మెలోడి. చక్కగా ఉండాలి. దానికి అద్భుతంగా మాటలు రాసేటువంటి కవులు – ఆరుద్రగారు, సుందర రామమూర్తిగారు లాంటి వారు ఉండేవారు. ఇవన్నీ కూడా నాలాంటి సంగీతదర్శకుడికి అప్పటికి దొరికిన వరాలన్నమాట!
ఓరోజున ఓ పాట చేసేసి, పేకప్ చేద్దామని వెళ్లిపోతుంటే సుందరామ్మూర్తిగారు పేపరువిూద ఓ రెండు లైన్లు రాసిచ్చారు. అందులో 'ఆకుపచ్చ చందమామ' అన్న పదప్రయోగం ఎంతో బాగా చేశారు. అని చూసి నేనూ, సుందర రామమూర్తి సంతోషపడుతుంటే – 'ఏంటి మాకు చెప్పరా.. మాకూ ఇవ్వరా విూ సంతోషం' అని అడిగారాయన. అది చూపించాను. 'ఇంత మంచి పల్లవిని వదిలేస్తే ఎలాగండి. మనం ఎక్కడన్నా ఒక సన్నివేశం పెట్టుకుని అయినా ఈ పాట చేయాలి. ఈ పద్ధతిలో చరణాలు రాసేయండి గురువుగారూ' అని, వేటూరి గారి చేత చరణాలు రాయించి – ఆ పాటను రికార్డ్ చేయడం కూడా జరిగింది.
రీ-రికార్డింగ్ కి కూడా ఎంత ఇనిస్పిరేషన్ ఇచ్చేవారంటే – ఓ చిన్న ముక్కను ఎక్కడనుంచో తీసుకొచ్చి ఇచ్చి 'దీన్ని డెవలప్ చేసి థీమ్ చేయగలమా' అని అడిగేవారు. తమాషాగా ఉండేది. అది ఒక విధంగా త్రోయింగ్ ఎ గ్రాంట్‌లెట్ ఆటాచ్. ఒక గజల్‌లో…. మెహదీ హసస్ 'హాహాహాహా…' అని ఫినిష్ చేస్తారు. ఆ పీస్ ఆయనకు చాలా ఇష్టం . దీన్ని ఏదైనా డెవలప్ చేయగలరా అన్నారు. రకరకాల ఇన్‌స్ట్రుమెంట్స్‌లో దాన్ని ఒక అందమైన థీమ్ మ్యూజిక్‌గా చేసి ''హమ్ పాంచ్'' సినిమాకి అంటే ''మనవూరి పాండవులు'' వెర్షన్‌లో ఉపయోగించడం జరిగింది.
లక్ష్మీకాంత్ – ప్యారేలాల్ గారు ఆ సినిమాకి సంగీత దర్శకులు. రీ-రికార్డింగ్ సమయానికి ఆ సంస్థ ఫైనాన్షియల్‌గా కొంచెం యిబ్బందిలో పడింది. నిర్మాత బోనీ కపూర్ తమ్ముడు అనీల్ కపూర్ బాపుగారిని 'ప్రత్యామ్నాయంగా వేరెవరిచేతనైనా చేయిద్దామండి. ఇప్పటికే చాలా కాస్‌ట్లీ అయింది.'' అని అన్నారు. అనిల్ కపూర్ అప్పటికింకా ఆర్టిస్టు కాలేదు … ప్రొడక్షన్ వ్యవహారాలు చూసేవారు. బోనీ కపూర్ ప్రొడ్యూసర్. వారి తండ్రిగారు సినిమా ప్రొడక్షన్ నుంచి యించుమించు అస్త్రసన్యాసం చేసేశారు.
అలా వారు అడిగినపుడు బాపుగారు మహదేవన్‌గారిని అడిగి ఉండవచ్చు, వేరే ఎవరి పేరైనా చెప్పి ఉండవచ్చు….''బాలుగారితో చేయిద్దామండి'' అన్నారు. అసలు నేను ఊహించలేదన్నమాట – నన్ను రీ-రికార్డ్‌ంగ్ చేయమంటారని! ఆ సినిమాలో థీమ్ చూశారంటే 'హా….. రారే రసా' ఈ థీమ్ ఎన్నిసార్లు వస్తుందో చెప్పడానికి వీల్లేదు. దాన్ని రకరకాల ఇన్‌స్ట్రుమెంట్స్‌లో మేం వాయించడం జరిగింది. సినిమాలో కూడా చాలా అద్భుతంగా అమిరింది.
జెమినిలో ఈ థీమ్ మేం రీ-రికార్డ్ చేస్తున్నప్పుడు ఓరోజు వాసూరావు (ఇప్పుడు సంగీతదర్శకుడైన వాసు అప్పుడు నా దగ్గర బేస్‌గిటార్ వాయించేవాడు) ఓ చిన్న కుర్రాణ్ణి తీసుకొచ్చాడు. ''ఈ కుర్రాడు మ్యాండలిన్ వాయిస్తాడు. ఒకసారి విూరందరు వినాలి.'' అన్నాడు. నేను, బాపుగారు, బోనీ కపూర్, అనిల్ మేమందరం కూర్చొని విన్నాం. ఏదో మామూలు పాటలు వాయించాడు. బాగానే ఉంది. తర్వాత నేను సరదాగా 'స్వరం రాయడం వచ్చా' అన్నాను. 'నాకు స్వరం రాయడం రాదండి' అన్నాడు అప్పుడా అబ్బాయి. బహుశా పది పన్నెండు ఏళ్లుంటాయేమో అతనికి!
'సరే నేను ఊరికే ఒక హమ్మింగ్ లాగ అంటాను దాన్ని నువ్వు వాయిస్తావా' అన్నాను. 'అనండి సార్' అన్నాడు. ఈ థీమ్ నేను పాడితే ఒకటి రెండుసార్లు విన్న తర్వాత మ్యాండలిన్ మీద వాయించడం మొదలుపెట్టాడు. బాపుగారు వెంటనే ''ఈ సీన్‌లో మనం ఈ అబ్బాయి మ్యాండలిన్‌నే వాడుకుందాం'' అన్నారు. అప్పట్లో మ్యాండలిన్ ప్లేయర్‌కి 50-55 రూపాయలు పేమెంట్ ఉండేది. బోనీ కపూర్ జేబులోంచి 100 రూపాయలు తీసి ఆ అబ్బాయి కిచ్చాడు. ఆ అబ్బాయే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మ్యాండలిన్ విద్వాంసుడు చిరంజీవి శ్రీనివాస్! ఆ తర్వాత ఆయన క్లాసికల్ మ్యూజిక్‌లో నిష్ణాతుడై ఎందరినో అధిగమించి ప్రపంచస్థాయికి చేరుకున్నాడు. మొట్టమొదటిసారి సినిమాకు మైకు ముందు అతను వాయించిన గౌరవం నాకు మిగిలింది. చాలాచాలా సంతోషించే విషయం అది. (సశేషం)
– ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం