సిపియం పార్టీ ఆవిర్భావం అని హెడ్డింగ్ పెట్టి ఏదేదో రాస్తూ నేను దారితప్పానని ఒక పాఠకుడు అంటున్నారు. నేను దారి తప్పలేదు, దారి వేస్తున్నాను. ఫలానా సమావేశములో తీసుకున్న తీర్మాన ఫలితముగా, ఫలానా తేదీన, ఫలానా చోట, ఫలానా వారు సెక్రటరీగా ఆ పార్టీ ఆవిర్భవించెను అని ఒక పేజీ ఆర్టికల్ కూడా రాయవచ్చు. పాఠకుడికి అది ఏ వికీపీడియాలోనో దొరుకుతుంది. నా కాలమ్ దాకా రావడం దేనికి? చాలామంది తెలుగు జర్నలిస్టుల్లా పూర్వాపరాలు చెప్పకుండా, న్యూస్ ఏజన్సీ నుంచి వచ్చిన ఆ నాటి వార్తను యథాతథంగా యిచ్చేయడం నాకు నచ్చదు. అడుగు పొడుగులేని బిడ్డ ఆవిర్భవించాలన్నా చాలా కథ నడవాలి. తొమ్మిది నెలల క్రితమే బీజం పడాలి. అలా పడడానికి కూడా యిద్దరు వ్యక్తుల మధ్య ఒక భౌతిక చర్య జరగాలి. ఆ చర్యకు మందు వారిద్దరి మధ్య రసాయనికం (కెమిస్ట్రీ) వుండాలి. మనసుల్లో రసస్పందన కలగాలి. మొదటి భౌతిక చర్యకే ఫలితం రాదు, ఎప్పటికో అప్పటికి అన్నీ కుదురుతాయి. ఆ తర్వాత పుట్టబోయే బిడ్డకు అన్నీ అడ్డంకులే. ఎప్పుడు జారిపోతాడో, ఎప్పుడు అడ్డం తిరుగుతాడో తెలియదు. పెద్ద ప్రాణి తినకూడదనిది తిన్నా యీ ప్రాణి ఉసురు నిలవదు. తొమ్మిది నెలల తర్వాత బయటపడడం కూడా అతి క్లిష్టంగా ఒక్కోప్పుడు యిద్దరికీ ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఒక బిడ్డ పుట్టుకకే యింత రామాయణం వుంటే, లక్షలాది సభ్యులున్న పార్టీ పుట్టడానికి ఎంత మహాభారతం జరిగి వుంటుంది?
అదేమీ చెప్పకుండా ఆయనలా ఓ నాలుగు పేర్లు వల్లిస్తే అర్థమవుతుందా? వారిలో ఎంతమంది పాఠకులకు తెలుసు? వారి గురించి, వారి వ్యక్తిత్వాల గురించి కాస్తయినా చెప్పవద్దా? లేకపోతే వారంతా దేశద్రోహులని యీయన లాగే వాళ్లూ అనుకుని తీర్మానించేస్తే…? చైనాకు మ్యాప్లమ్మారని ఆయనంటున్న సిపిఎం కాలగతిలో బలపడి, సిపిఐ బలహీనపడడాన్ని వాళ్లు ఎలా అర్థం చేసుకోవాలి? భారతప్రజలు దేశద్రోహులను ప్రోత్సహించే రకం అనుకోవాలా? ఆయన సమాచారం సరైనదా? సమగ్రమైనదా? ఎ కె గోపాలన్, డాంగే పక్షాన వున్నారని ఆయన రాశారు. ఢిల్లీలో సిపిఎం కార్యాలయానికి గోపాలన్ (ఎకెజి) పేరే పెట్టారు. అంటే వాళ్లు డాంగే అనుచరుడి పేర బిల్డింగు కట్టారా? '1962లో డాంగే ముఠా పార్టీ నాయకత్వం చేపట్టి యంత్రాంగాన్ని వారి అధీనంలోకి తెచ్చుకున్నాక పార్టీ నిర్మాణ సూత్రాలను గాలికి వదిలేసి, తన సొంత విధానాలను పార్టీ మీద రుద్దేందుకు డాంగే ప్రయత్నం చేశాడు… తనతో విభేదిస్తున్న అతివాదులకు వ్యతిరేకంగా రాయమని కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేక పత్రిక అయిన 'పేట్రియాట్' వారపత్రికకు డాంగే 30 వేల రూపాయలను విరాళంగా దారుణం…' అంటూ గోపాలన్ తన ఆత్మకథలో రాసుకున్నారు. ఆయన 1964 డిసెంబరులో అరెస్టయ్యారు కూడా.
ఇవన్నీ అక్కడక్కడ మెరుపుల్లా చెపితే పాఠకుల్లో అధికాంశం గందరగోళ పడతారు. ఏవో కొన్ని మాటలు, పేర్లు చెవిన పడి ఎవరెవరో స్పష్టంగా తెలియని సాధారణ పాఠకుడు – నా లక్ష్యం. అతని కోసమే నేను ఏదైనా సరే, తీరికగా, ఓపికగా, సరళమైన శైలిలో చెప్తాను. కమ్యూనిజం గురించి, సోషలిజం గురించి చదవాలంటే ఆ తాలూకు పుస్తకాల్లో అంతా గులకరాళ్ల భాష. పది పేజీలు చదివేసరికి తలనొప్పి ప్రారంభమౌతుంది. ఏవేవో సాంకేతిక, పారిభాషిక పదాలు, సంక్లిష్టమైన వాక్యనిర్మాణం, ఎక్కడెక్కడివో 50, 70 ఏళ్ల క్రిందటి ఉదాహరణలు. చరిత్ర కాస్తయినా తెలిస్తే తప్ప ఆ కాన్సెప్టు అవగాహనలోకి రాదు. అవన్నీ నేను అనుభవిస్తుంటాను కాబట్టి, సోదరపాఠకుడికైనా ఆ అవస్థ తప్పిద్దామని చూస్తూంటాను. ఎంత సింపుల్గా చెప్పగలనా అని చూసుకుంటూ, వాక్యాలు తిరగరాస్తూ వుంటాను. ఏదైనా సంఘటన జరగగానే వెంటనే వార్తగా రాసేసేది రిపోర్టరు. నేను రిపోర్టరును కాను. కొంతమంది అది అర్థం చేసుకోకుండా అది రాయలేదేం, యిది రాయలేదేం అంటారు. సంఘటన జరిగిన తర్వాత పదిమందీ రిపోర్టు చేసినది, వ్యాఖ్యానించినదీ చూసి, మొత్తం నా మెదడులో సమన్వయం చేసుకుని, పూర్వజ్ఞానంతో అనుసంధానం చేసుకుని అప్పుడు రాయడానికి పూనుకుంటాను. సమయాభావం వలన అనుకున్నవన్నీ రాయలేను, అనుకున్న సమయంలోనూ రాయలేను.
ఇంత శ్రమ పడాలంటే ఆ అంశం నాకు మనసుకు హత్తుకోవాలి. అందరూ చెప్పగా మిగిలినదేదో వుంది, దాన్ని నేను పాఠకులతో పంచుకోవాలి అనుకున్న సబ్జక్ట్పైనే నేను కసరత్తు చేస్తాను. మీడియా అరగదీసేసిన వార్తను మళ్లీ రాయడంలో నాకు మజా వుండదు. అది గ్రహించనివాళ్లు మీరు కావాలని ఫలానా సబ్జక్ట్ వదిలేశారు, ఫలానాదాన్నే పట్టించారు అంటూ వుంటారు. ఈ కమ్యూనిజం సీరీస్ విషయంలో యిప్పటికే అన్నీ చదివేసి, స్థిరమైన అభిప్రాయాలు ఏర్పరచుకున్న సీనియర్ పాఠకులకు నా వివరణ సహజంగానే బోరు కొడుతుంది. అందువలన సీరీసంతా అయిపోయిన తర్వాత వాళ్లు పైపైన అలాఅలా బులబులాగ్గా పేజీలు తిప్పేసి, నేనెక్కడైనా తప్పు చేస్తే దాన్ని ఎత్తి చూపి, తాము ఎక్కడైనా పొరబడి వుంటే సవరించుకుంటే అందరికీ హాయి.
ఏ నాయకుడినైనా సరే దేశద్రోహి అనడం తప్పు. దేశం బాగుపడాలనే ప్రతివాడికీ అనిపించినా, దానికి మార్గం ఏమిటన్నదానిపై భేదాలు వుండవచ్చు. బ్రిటిషువాళ్ల పరిపాలన యింకా కొనసాగాలని అనుకున్నవాళ్లందరూ దేశద్రోహులే అంటే అనేకమందిని ఆ క్యాటగిరీలో పెట్టాల్సివస్తుంది. భారతీయుల్లో పరిణతి యింకా రాలేదు కాబట్టి అప్పుడే స్వాతంత్య్రం వద్దని కొందరన్నారు, సంఘసంస్కరణలను ప్రోత్సహిస్తున్న ఆంగ్లేయులు వెళ్లిపోతే ఛాందసవాదులు విజృంభిస్తారని కొందరు, మెజారిటీగా వున్న హిందువులు తమను వేధిస్తారని మైనారిటీలు, అగ్రవర్ణస్తులు తమను అణగదొక్కుతారని దళితులు, స్వాతంత్య్రం వచ్చాక అధిక అక్షరాస్యతతో అప్పటికే ఉద్యోగాల్లో, రాజకీయనాయకత్వంలో అగ్రస్థానంలో వున్న బ్రాహ్మణుల సారథ్యంలో నడుస్తున్న కాంగ్రెసుకి అధికారం దక్కుతుందని భయపడిన బ్రాహ్మణేతర అగ్రవర్ణాలు, సోషలిజం ప్రవచిస్తున్న కాంగ్రెసు అధికారంలోకి వస్తే భూసంస్కరణలు అమలు చేస్తుందన్న భయంతో భూస్వాములు, సంస్థానాధీశులు… యిలా అనేక వర్గాలలోని అధికాంశం ప్రజలు రకరకాల కారణాలతో ఆంగ్లేయులు కొనసాగాలని కోరుకున్నారు. జస్టిస్ పార్టీ స్థాపించారు. తర్వాతి కాలంలో కాంగ్రెసు పార్టీలో లేక యితర పార్టీల్లో చేరి, పదవులు అనుభవించిన అనేకమంది యీ జస్టిస్ పార్టీకి సారథులు, మద్దతుదారులు. గాంధీగారి పిలుపు మేరకు చాలామంది ప్రభుత్వోద్యోగాలు వదిలేశారు. కొంతమంది ఉద్యోగాలలోనే కొనసాగి, ప్రజలకు ఉపయోగపడే అనేక పనులు చేశారు. వాళ్లను తిట్టాలా? 1947కు ముందు పోలీసు సర్వీసులో, సైన్యంలో చేరినవాళ్లందరూ బ్రిటిషువారి ప్రయోజనాలను కాపాడినట్లే అనుకుని వాళ్లందరికీ ద్రోహుల ముద్ర కొట్టాలా? (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2014)