రాజరికంలో దోపిడీ అనేది స్పష్టంగా తెలుస్తుంది. మనదేశంలోనే పంటలో 20% పన్నుగా తీసుకునేవారు. ఇప్పటి మన యిన్‌కమ్‌టాక్స్ రేట్లతో పోలిస్తే అది చాలా ఎక్కువ. పారిస్ వంటి నగరాల్లో రాజమహళ్ల వైభవం చూస్తే ప్రజలను ఎంత దోచేశార్రా బాబూ అనిపిస్తుంది. ఆ దోపిడీ భరించలేని పరిస్థితి వచ్చినపుడు ప్రజలు విప్లవం చేశారు. ప్రజలు అలా తిరగబడకుండా చూడడానికి రాజుగారు అనేక మార్గాలు అవలంబిస్తాడు. రాజుగారు విష్ణ్వాంశసంభూతుడు, ఆయనకు ఎదురు తిరిగితే దైవద్రోహం అని పురోహితవర్గం చేత చెప్పిస్తాడు. వాళ్లకు వూళ్లు దానం చేస్తాడు. రాజుగారు యింతటివాడు, అంతటివాడు అని కీర్తించి ప్రచారం చేసే కళాకారులకు సన్మానాలు చేస్తాడు. తాము దరిద్రులుగా వుండడమనేది కొందరు మానవుల చేష్టల ఫలితమే అని కాకుండా, పూర్వజన్మ ఫలం అని ప్రజలు నమ్మేట్లు దైవభక్తిని ప్రచారం చేయడానికి గుళ్లు, గోపురాలు కట్టిస్తాడు. విద్యకు దూరం చేస్తాడు. అజ్ఞానం, మూఢభక్తి పెంచి ప్రశ్నించే స్వభావాన్ని ఆదిలోనే తుంచేస్తారు. సమాజం నుండి లాభం పొందే వర్గాలు శ్రామిక వర్గాలు ఒక పరిమితి దాటి ఎదగకుండా చేస్తారు. ఇదంతా వ్యవస్థలో భాగమే, సంస్కృతిలో భాగమే అనే భ్రమ కలిగిస్తారు. ఇంత చేసినా కొందరు ప్రశ్నించారు, తిరగబడ్డారు. అప్పుడు సామాన్యప్రజల్లో ఒకడు రాజుగా ఎదిగేవాడు. అయితే రాజయ్యాక అతనిలో స్వార్థం ప్రవేశించి, తన వంశమూలాలను మార్చేసుకుని, పాత రాజు దోపిడీ మార్గంలోనే అతనూ వెళ్లేవాడు.
ఈ వ్యవస్థలో వర్గపరమైన దోపిడీ తేటతెల్లంగా తెలిసేది. అయినా మెజారిటీ ప్రజలు యిదంతా తమ కర్మం అని సరిపెట్టుకునే వారు. రాజరికపు కొనసాగింపుగానే వుండే జమీందారీ (ఫ్యూడల్) వ్యవస్థలో కూడా యించుమించు యిలాగే సాగేది. వీరిలో కొందరు జమీందార్లు మంచి పనులు చేసి ప్రజలను ఆకట్టుకునేవారు. ఎంతైనా వర్గస్వభావాన్ని పోగొట్టుకోలేదు. తమ ఆధిపత్యాన్ని అంగీకరించేవరకే వాళ్లు ఉదారంగా వుండేవారు. ధిక్కరించిన వాళ్ల పట్ల క్రూరంగా ప్రవర్తించేవారు. ఎవరికైనా ఏదైనా ఉపకారం చేసినా దాన్ని తమ ఔదార్యంగానే ఫీలయ్యేవారు తప్ప ప్రజల నుండి తీసుకున్న డబ్బులోంచే మనం వాళ్లకు ఖర్చు పెడుతున్నాం, వాళ్లకు రావలసిన న్యాయమైన వాటా యిస్తున్నాం అని అనుకునేవారు కారు. ఈ వ్యవస్థలో దోపిడీని గుర్తించడం కాస్త శ్రమతో కూడుకున్న పని.
ఇక కాపిటలిస్టు వ్యవస్థ. రాజరికం, జమీందారీ వ్యవస్థలు వంశపారంపర్యంగా వచ్చినవైతే యివి తెలివితేటలతో, శ్రమతో పైకి వచ్చిన వ్యాపారస్తులు నడిపే వ్యవస్థ. వీళ్లు స్వయంగా కష్టపడతారు, డబ్బు పెట్టుబడి పెడతారు, తెలివితేటలు, ముందుచూపు ప్రదర్శిస్తారు. కేవలం యితరుల శ్రమతోనే వీరు పైకి వచ్చారని తీర్మానించడం తప్పు. రాజులు, జమీందారులు నియంతలు. ప్రత్యర్థి తల ఎగరేయగల అధికారం వాళ్ల చేతిలో వుంది. వీళ్లు అలాటివాళ్లు కాదు. మనలో ఒకరు. ప్రత్యర్థిని తెలివితేటలతో, యుక్తులతో, ఒక్కోప్పుడు కుయుక్తులతో, మోసంతో గెలవాల్సిన అగత్యం వుంది. వీళ్లు ప్రజాస్వామిక వ్యవస్థలో పని చేస్తారు కాబట్టి ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడవాల్సి వుంటుంది. అయితే ప్రభుత్వ విధానాలను తమకు అనుగుణంగా వుండేట్లు మలచుకోవడంలో వీళ్లకు నేర్పు వుంటుంది. జమీందారు తన బానిసలను చూసినట్లు వీళ్లు తమ కార్మికులను చూడలేరు. వాళ్ల సహకారం తీసుకుంటూనే వాళ్లను అణచి వుంచుతూ, పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుంటూ ఎదుగుతూ వుండాలి. ఈ వ్యవస్థలో దోపిడీని గుర్తించడం చాలా కష్టం.
ఉదాహరణకి ఒక వ్యాపారస్తుని వద్ద పాతికేళ్లగా ఒక ఉద్యోగి పని చేస్త్తున్నాడు. సలహాలతో, కష్టంతో యజమాని నిరంతరం ఎదిగేట్లా చేస్తున్నాడు. అయినా యజమాని తన ఎదుగుదలకు అనుగుణంగా ఉద్యోగి జీతం పెంచడు. కాస్త కూస్త, అప్పుడప్పుడు మనసు కరిగి ఏదో విదిలించినట్లుగా పెంచుతాడు. అదేమిటండీి అంటే 'నీకేదైనా కష్టం వచ్చినపుడు చెప్పు, నేను వున్నాను కదా, ముందు నుంచి యిస్తే తగలేస్తావ్. మీ ఆవిడ బంగారం అంటుంది, మీ అబ్బాయి స్కూటరంటాడు.' అంటాడు. పిల్ల పెళ్లా? ఇదిగో లక్ష తీసుకో, మీ ఆవిడకు రోగమా? యిదిగో ఏభై వేలు వుంచు, మీ అబ్బాయికి ఉద్యోగం లేదా? మన కంపెనీలోనే పెడదాం – యిలా వుంటుంది. మా యజమాని చాలా మంచివాడు, కష్టానికి ఆదుకుంటాడు అని తృప్తి పడతాడు ఉద్యోగి. 'ఆయన ఎప్పటికి యివ్వాల్సింది అప్పుడే యిచ్చేస్తే ఆ డబ్బులో కాస్త నేను దాచుకుంటే నా అవసరాలకు కావలసిన డబ్బు కోసం దేబిరించవలసిన అవసరం లేదు కదా' అనే ఆలోచన అతనికి రాదు. యజమాని అలా ఎందుకివ్వడంటే ఉద్యోగి ఆర్థికంగా బలపడితే యింకా కొందరితో కలిసి తనకు పోటీగా వ్యాపారం పెట్టేయవచ్చు. తన క్లయింట్లను లాక్కుని పోవచ్చు. అందుకని తక్కువ జీతంతో అతన్ని అర్ధబానిసగానే వుంచుతాడు.
ఇది వ్యక్తిగత స్థాయిలో జరిగే కనిపించని దోపిడీ. సంస్థాగతమైన దోపిడీ ఎలా వుంటుందో అర్థం చేసుకోవడం మరింత క్లిష్టం. జరిగినదేమిటంటే యూరోప్‌లో పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత కార్మికుల సంఖ్య పెరిగింది. అప్పటిదాకా రైతులు, చేతి పనివారు, వృత్తి నిపుణులు వుండేవారు. యంత్రాలు వచ్చాక కార్మికుల అవసరం పడింది. అయితే వారి పనిగంటలు యిన్ని వుండాలన్న చట్టం ఏమీ లేదు. వారానికి సెలవుండాలన్న పద్ధతి లేదు. బ్రిటిషు వాళ్లు వచ్చేదాకా మన దేశంలో కూడా దుకాణాలకు నెలలో అమావాస్య రోజు మాత్రమే సెలవు వుండేదట. వారానికి ఓ రోజు సెలవు అనేది సంస్కరణల్లో భాగంగానే వచ్చింది. రోజుకి 8 గంటల పని అనేది కూడా అలాటిదే. మే డే ఎలా వచ్చిందో తెలుసుకుంటే అవన్నీ అర్థమవుతాయి. పోనుపోను కార్మికుల సంఘటిత శక్తిగా ఏర్పడి తమకు కావలసిన వసతులు అడగసాగారు. వాళ్లు లేనిదే యంత్రాలు నడవవు కాబట్టి యజమానులు కొన్ని డిమాండ్లకు తలవొగ్గారు. కార్మికులకు ఆరోగ్యసౌకర్యాలు, గృహవసతి, వాళ్ల పిల్లలకు స్కాలర్‌షిప్పులు, పెన్షన్లు యిత్యాది అనేక సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఇవన్నీ యిచ్చి కార్మికులను తృప్తి పరచడం వలన ఉత్పత్తి మరింత పెంచుకుని మరిన్ని లాభాలు సమకూరాయి. కాపిటలిస్టు దేశాల్లో కొన్నిటిలో కమ్యూనిస్టు దేశాల కంటె మిన్నగా కార్మిక చట్టాలు ఏర్పరచి, అమలు చేసి ఆకట్టుకోవడం జరిగింది. ఇలా అన్నీ చక్కగా వున్నపుడు యజమానికి వ్యతిరేకంగా పోరాడడం దేనికి అనే భావం కార్మికులలో కలిగించేటంత యిదిగా దీన్ని అమలు చేశారు కాబట్టి కాపిటలిస్టు వ్యవస్థలో దోపిడీని గుర్తించడం సంక్లిష్టం అంటున్నాను. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2014)