Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : సిపిఎం ఆవిర్భావం - 01

సిపిఎం పార్టీకి ఈ నవంబరుతో 50 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా రెండు అంశాలు ముందుకు వచ్చాయి. ఒకటి - 50 ఏళ్ల క్రితం సిపిఐ, సిపిఎం ఎందుకు విడిపోయాయి అన్న విషయంపై కేరళలోని సిపిఐ, సిపిఎం నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. రెండోది - ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్న ప్రకాశ్‌ కరాట్‌ అనుసరిస్తున్న విధానాలపై సీతారాం ఏచూరి విమర్శ. రెండో అంశం గురించి మాట్లాడే ముందుగా కమ్యూనిస్టు పార్టీలో చీలిక గురించి కాస్త రాద్దామనుకుంటున్నాను. కమ్యూనిస్టు పార్టీది థాబ్దాల నాటి చరిత్ర. అదంతా యిక్కడ చెప్పదలచుకోలేదు. ఇప్పుడు లైమ్‌లైట్‌లో వున్న ఆరెస్సెస్‌, జనసంఘ్‌, బిజెపిల చరిత్ర గురించి ఆడ్వాణీ జీవితచరిత్ర ద్వారా చెపుదామని అర్ధరథుడు ఆడ్వాణీ పేరుతో సీరియల్‌ మొదలుపెట్టాను కానీ తక్కిన సీరియల్స్‌ లాగే అదీ ఆగిపోయింది.  తిరిగి ఎప్పటికి మొదలుపెడతానో, ఎప్పుడు పూర్తి చేస్తానో తెలియని పరిస్థితుల్లో కొత్తది ప్రారంభించడం బుద్ధితక్కువ. అందుకని కమ్యూనిస్టు పార్టీ చీలిక ఎలా జరిగిందో మాత్రం చెప్పి యీ సీరీస్‌ ముగిస్తాను. ఈ సీరీస్‌ చదవడం వేస్టని కొందరు పాఠకులు ఫీలయినా నేను ఆశ్చర్యపడను. ఎందుకంటే ప్రస్తుతం కమ్యూనిజానికి గ్లామర్‌ లేదు. కమ్యూనిజం, సోషలిజం, ట్రేడ్‌ యూనియనిజం పనికిరాని సిద్ధాంతాలను, ప్రగతి నిరోధకాలనీ చాలామంది భారతీయ యువత భావిస్తున్నారు. ఇప్పుడు మోజంతా కాపిటలిజంపై వుంది. కార్మిక చట్టాలు యిష్టం వచ్చినట్లు సవరించేసినా రావలసినంత నిరసన రావటం లేదు. 

రాజకీయగమనాన్ని గమనించినవారు సోషలిజం చావలేదని గ్రహిస్తారు. ఇప్పటికీ ప్రపంచంలోని అనేక దేశాల్లో సోషలిజం, కమ్యూనిజం బలంగానే వుంది. లోకంలో నుండి యీ శక్తులు తుడిచిపెట్టివేయబడితే యిక కాపిటలిజానికి, నియంతృత్వానికి అడ్డే వుండదు. సిద్ధాంతాలు గొప్పగా వున్న వాటిని అమలు చేసే పార్టీ పటిష్టంగా వున్నపుడే వాటికి వన్నె వస్తుంది. లేకపోతే పార్టీకి వున్న బలహీనతలను సిద్ధాంతాలకు ఆపాదిస్తారు. భారతీయ కమ్యూనిస్టు పార్టీ, సోషలిస్టు పార్టీ చాలా పొరపాట్లు చేసింది. దానికి నాయకత్వం వహించినవారు చారిత్రక తప్పిదాలు చేసినట్లు వారంతట వారే ఒప్పుకున్నారు. అంతమాత్రం చేత కమ్యూనిజం లేదా సోషలిజం ఫెయిలందని అనడానికి లేదు. గాంధేయులని చెప్పుకునేవారు పొరపాట్లు చేసి విఫలమైతే, గాంధీ అహింసామార్గం తప్పుడు సిద్ధాంతమని వాదిస్తే ఎలా? ఈ రోజు బెంగాల్‌లో వామపక్షకూటమి పార్టీ చావుదెబ్బ తింది, కోలుకోలేకపోతోంది కాబట్టి దాని గురించి పట్టించుకోవడం అనవసరం అనుకునేవాళ్లు త్రిపురలో సిపిఎం ఎందుకు గెలుస్తోందో చెప్పగలగాలి. బిజెపికి రెండు ఎంపీ సీట్లు మాత్రమే వచ్చినపుడు యిక దాని గురించి, దాని స్ఫూర్తిదాత ఆరెస్సెస్‌ గురించి తెలుసుకోవడం అనవసరం, టైము దండగ అనుకున్నవారెవరైనా వుంటే వాళ్లిప్పుడు నాలిక కరుచుకోవాలి. అందుచేత కమ్యూనిస్టుల పట్ల ఏ మాత్రం గౌరవం లేనివాళ్లు కూడా కాస్త ఓపిక చేసుకుని యిది చదివితే వారికే మంచిది. కమ్యూనిస్టు పార్టీ ప్రముఖుల పేర్లు, తేదీలు చెప్పి కంగారు పెట్టకుండా అసలు భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఎదుర్కున్న యిబ్బంది గురించి జనరల్‌గా వివరిస్తాను. నా అవగాహన లోపం వున్నట్లు పాఠకులకు ఎవరికైనా తోస్తే సవరించగోర్తాను. 

అసలు కమ్యూనిజం అంటే ఏమిటి? - సింపుల్‌గా చెప్పాలంటే ఒకడి కోసం పదిమంది, పదిమంది కోసం ఒకడు! మానవజాతి ఏర్పడిన కొత్తల్లో వ్యక్తిగత కుటుంబం, ఆస్తి అంటూ లేదు. అంతా గుంపుకు లేక గణానికి సంబంధించినదే. అందరూ కలిసి సంపాదించడం, కాపాడుకోవడం, ఖర్చుపెట్టడం - అంతా ఉమ్మడే. కండపుష్టి వున్నవాళ్లు వేటకు వెళ్లి ఆహారాన్ని తెస్తారు, కొందరు స్త్రీలు వండుతారు, మరి కొందరు పిల్లల ఆలనాపాలనా చూస్తారు. ఇలా అందరికీ బాధ్యతలున్నాయి. నైపుణ్యం మేరకు ఆ బాధ్యత వహిస్తారు. ఎవరైనా జబ్బు పడి వేటకు రాలేకపోతే వాడికి కూడా వేటాడిన దానిలో భాగం యివ్వడం, గుంపులో వున్న గర్భిణీ స్త్రీలు, బాలబాలికలు, వృద్ధులు, బలహీనుల బాధ్యత కూడా కండపుష్టి వున్నవారే భరించడం జరిగింది. స్త్రీపురుషులు మొత్తం గణానికి చెందినవారే. ఎవరైనా ఎవరితోనైనా కలవవచ్చు, పిల్లలు కనవచ్చు. పుట్టిన పిల్లలు గణానికి సంబంధించినవారే. అంటే గణం-వ్యక్తి మధ్య సంబంధం ఎలాటిదంటే - ప్రతి వ్యక్తి తన సామర్థ్యం బట్టి గణానికి సమకూరుస్తాడు, తన అవసరం బట్టి గణం నుండి తీసుకుంటాడు. ఇది నిజానికి చాలా ఆదర్శమైన వ్యవస్థ. ఎక్కువతక్కువల ప్రశ్న లేదు. 

అయితే కొంతకాలానికి వ్యక్తుల స్వార్థం ముందుకు వచ్చింది. 'నేను బాగా వేటాడాను కాబట్టి, నాకు ఎక్కువ భాగం రావాలి, ఫలానా స్త్రీ నాకు నచ్చింది కాబట్టి ఆమె నాకే సొంతం కావాలి, ఆమె నాకే పిల్లలు కనాలి, నా పిల్లల బాగోగులు నేనే చూసుకుంటాను, నాకు వయసు మీరినపుడు వాళ్లు నా సంగతి చూసుకుంటారు' అనే వాదనతో వ్యక్తిగత కుటుంబం, ఆస్తి ఏర్పడ్డాయి. మొదట్లో ఆహారధాన్యాలు దాచుకునేవారు కాబట్టి అది ఆస్తి అయింది. కట్టుకున్న గూడు ఆస్తిగా పరిగణింపబడింది. ఆ తర్వాత ఆయుధాలు, విలువైన లోహాలు, డబ్బు కనిపెట్టిన తర్వాత డబ్బు... యిలా అంతా వ్యక్తిగతం అయిపోయింది. ఇక అక్కణ్నుంచి పక్కవాడి కంటె ఎక్కువ సంపాదించాలి, నా పిల్లలే కాదు మనుమలు సైతం కాలుమీద కాలు వేసుకుని కూర్చుని తిన్నా తరగనంత వెనకేయాలి అనే తపన బయలుదేరి సక్రమమైన మార్గంలో ఆర్జించలేకపోతే అక్రమమైన మార్గమైనా ఫర్వాలేదు అనే ఆలోచన వచ్చి సమాజంలో దోపిడీ ప్రవేశించింది. అదే అనేక అనర్థాలకు మూలమైంది.

కార్ల్‌ మార్క్‌స్‌, ఫ్రెడరిక్‌ ఎంగేల్స్‌ అనే యిద్దరు తత్త్వవేత్తలు యిదంతా అధ్యయనం చేసి, దోపిడీ పోయి సమసమాజం మళ్లీ ఏర్పడాలంటే మనిషి తన మూలాల్లోకి వెళ్లాలని ప్రతిపాదించారు. ఆదిమకాలం నాటి గణం (జర్మన్‌ భాషలో కమ్యూన్‌) పద్దతి మళ్లీ రావాలన్నారు. ఆ సిద్ధాంతానికి కమ్యూనిజం అని నామకరణం చేశారు. అయితే యిది ఓ పట్టాన సాధ్యం కాదని వారికీ తెలుసు. ఇన్ని వేల సంవత్సరాలుగా కుప్పలుకుప్పలుగా వ్యక్తిగతమైన ఆస్తి పోగేసుకున్నవారితో 'రేపణ్నుంచి మీరూ, ఆ గుడిసెలోని గోచీపాతరాయుడు యిద్దరూ సమానమే. తెల్లారి లేవగానే యిద్దరూ చెరో పారా పట్టుకుని బయలుదేరండి' అంటే ఒప్పుకుంటారా? అందువలన దానికి మొదటిమెట్టుగా సోషలిజం రావాలి అన్నారు. దీన్నే తెలుగులో సామ్యవాదం అంటున్నాం. ధనికులకు, పేదలకు మధ్య అంతరం తగ్గించడం దీని ధ్యేయం. ధనికుడు అలా అలా ద్రాక్షారం భీమేశ్వరుడిలా పెరిగిపోతూ వుంటే నెత్తిమీద మేకు కొట్టి ఆగక్కడ అని మధ్యతరగతికి దించడం, పేదలకు ఉచితంగా విద్య, వైద్యం కల్పించి, చిన్న యిల్లూ వాకిలీ కట్టి యిచ్చి, తక్కువ వడ్డీకి ఋణాలిచ్చి వ్యాపారం చేసుకోమని ప్రోత్సహించి బీదరికం నుంచి మధ్యతరగతికి పెంచడం జరగడం. ఈ విధంగా యిద్దరినీ యించుమించు సమానస్థాయికి తీసుకురావడం సంభవమౌతుంది. తర్వాతి థలో వ్యక్తిగత ఆస్తిని రద్దు చేసి కమ్యూనిజాన్ని తీసుకురావచ్చు అని ప్రతిపాదన. ఇప్పటిదాకా అచ్చమైన కమ్యూనిస్టు రాజ్యం ప్రపంచంలో ఎక్కడా ఏర్పడలేదు. 

ఈ సోషలిస్టు సిద్ధాంతం ప్రపంచంలో చాలామందికి ఆమోదయోగ్యంగా తోచింది. తమ పరిస్థితి మెరుగుపడుతుంది కాబట్టి పేదలకు నచ్చడంలో ఆశ్చర్యం లేదు. ముందుచూపున్న ధనికులు కూడా దీన్ని ఆహ్వానించారు. ఎందుకంటే రాజరికంలో కాని, భూస్వామ్య వ్యవస్థలో కాని, కాపిటలిస్టు వ్యవస్థలో కాని ధనికుల ఆటలు సాగినంత కాలం సాగుతున్నాయి. దోపిడీ హద్దులు మీరగానే పేదలు ఒక్కసారిగా తిరగబడి వాళ్లను చంపి పారేస్తున్నారు. ఇప్పుడు సామ్యవాదం పేరు చెప్పి పేదలు తిరగబడకుండా చూడవచ్చు. తాము నడుపుతున్న వ్యవస్థ ద్వారా 'సామ్యవాదమే మా లక్ష్యం. దాని వైపు మెల్లిమెల్లిగా అడుగులు వేస్తున్నాం, మీ పరిస్థితి మెరుగు పరుస్తున్నాం, తొందరపడి ఏ అఘాయిత్యానికి దిగకండి.' అని కొన్ని పథకాలు, సంక్షేమవిధానాలు చేపట్టి పేదలను జోకొట్టడానికి యిది పనికి వస్తుంది. (సశేషం)

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2014)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?