బాపు గురించి బాలు – 03

బాపుగారి గురించి ప్రఖ్యాత గాయకులు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంగారు ''హాసం'' పత్రికలో ''బాపు విశ్వరూపం'' శీర్షిక క్రింద 2002 లో వ్రాసిన వ్యాసపరంపర. బాలుగారికి కృతజ్ఞలతో, ''హాసం'' సౌజన్యంతో పునర్ముద్రణ.. . తర్వాత ''ముత్యాలముగ్గు'' సినిమాలో 'గోగులు…

బాపుగారి గురించి ప్రఖ్యాత గాయకులు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంగారు ''హాసం'' పత్రికలో ''బాపు విశ్వరూపం'' శీర్షిక క్రింద 2002 లో వ్రాసిన వ్యాసపరంపర. బాలుగారికి కృతజ్ఞలతో, ''హాసం'' సౌజన్యంతో పునర్ముద్రణ..
.
తర్వాత ''ముత్యాలముగ్గు'' సినిమాలో 'గోగులు పూచె గోగులు పూచె ఓ లచ్చాగుమ్మాడి' పాట. విజయాగార్డెన్స్‌ (ఓల్డ్‌ థియేటర్‌)లో పాడాను. అది ఎంతమంచి పాటో అందరికి తెలిసిందే. పర్టిక్యులర్‌గా చరణాల్లో మాత్రమే నేను పాడడం… అది గజల్‌ స్టయిల్లో ఉండడం… కొంచెం హిందుస్తానీ బాణీలో ఉండడం… బహుశా నారాయణరెడ్డిగారు, బాపుగారు, రమణగారు ఈ పాట నాకిస్తే బాగుండునని అనుకునే ఇచ్చినట్టున్నారు. కానీ నా దృష్టిలో ఈ సినిమాలో  తమ్ముడు రామకృష్ణ పాడిన 'ఏదో ఏదో అన్నది' అన్న పాట చాలా మంచి పాట. అతని జీవితంలో కూడా ముఖ్యమైన పాటల్లో ఒకటిగా మిగిలిపోయే పాట. 'గోగులు పూచే' పాట పాడగానే నాకు పేమెంట్‌ చెక్కును తీసుకొచ్చి ఇచ్చిన వ్యక్తిని చూసి 'ఎవరీ హ్యాండ్సమ్‌ మ్యాన్‌, అందంగా గమ్మత్తయిన టీ షర్ట్స్‌ వేసుకుని తిరుగుతున్నాడు… ఎవరో ప్రొఫెషనల్‌ మేనేెజరేమో' అని అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది అతనే ఎమ్‌.వి.ఎల్‌. అని…  ఆ సినిమా నిర్మాత అని. ఆ సందర్భంగానే ఆ ఎమ్‌.వి.ఎల్‌. అనే ఆ అద్భుతమైన మనిషితో, ఆ అద్భుతమైన రచయితతో స్నేహం కలిపే అవకాశం నాకు కలిగింది. 

ఈ సినిమా తీస్తున్న సందర్భంలోనే బాపుగారిని నేను మరొక వరం అడగడానికి వెళ్లాను. చాలా కొద్దిపాటి పరిచయంతో  చొరవ తీసుకున్నాననే చెప్పాలి. నా మిత్రుడు సురేష్‌ అని నెల్లూరు వాస్తవ్యుడు. అతను సినిమాల్లో వేషాలు వెయ్యాలని తాపత్రయ పడుతుంటే బాపుగారి దగ్గరకు తీసుకెళ్లాను. చూసిందే తడవుగా వెంటనే అతనికి హీరోయిన్‌ బ్రదర్‌ క్యారెక్టర్‌ ఇచ్చారు. నేనెప్పటికి మరిచిపోలేను. సురేష్‌ కూడా మరిచిపోలేడు. అసలు మరిచిపోయే అవకాశమే లేదు ఎందుకంటే అతను దివంగతుడయ్యాడు. అడిగిందే తడవుగా ఆ అవకాశం అతనికి ఇవ్వడం నాకు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. వారి మనసులో ఎవరన్నా ఆర్టిస్టులు ఉన్నారో లేదో నాకు తెలియదు కాని అతనికి చక్కని క్యారెక్టర్‌ ఇచ్చారు. 

ఆ తర్వాత ''సంపూర్ణ రామాయణం'', ''సీతాకల్యాణం'' వీటన్నిటిలో కూడా నాకు పాడే అవకాశం దొరికింది. ముఖ్యంగా నాకు దొరికిన ఇంకో అదృష్టం ఏమిటంటే – ''రామాంజనేయ యుద్ధం'' బాపుగారు తీస్తున్న సందర్భంలో… మహదేవన్‌గారు ఎవైలబుల్‌గా లేక … పుహళేందిగారు కూడా దొరక్కపోవడం వల్లనో ఏమో అందులో కొన్ని పద్యాలు నాచేత కంపోజ్‌ చేయించారు బాపుగారు.  అది యుద్ధానికి సంబంధించినవి… ఆంజనేయుడికి రాముడికి మధ్య జరిగేటటువంటి వాగ్వివాదం. నేను కంపోజ్‌ చేసిన…ఆ పద్యాలు నేనూ, మాధవపెద్ది సత్యం బాబాయ్‌ పాడాం. అది కూడా నేను గొప్ప వరంగా భావిస్తున్నాను. నిజం చెప్పాలంటే బాపుగారి సినిమాకి సంగీతాన్ని సమకూర్చే అవకాశం మొట్టమొదటిసారి ఇలానే నాకు వచ్చింది అనుకోవాలి. 

గజల్స్‌ పాడే మెహదీ హసన్‌ అన్నా, గులాం ఆలీ అన్నా… తర్వాత సజ్జాద్‌ హుస్సేన్‌ మ్యాండొలిన్‌ అన్నా బాపుగారికి  చాలా చాలా ఇష్టం. ఈ  విధమైన పిపాస ఉండడం వల్ల ఆయన దగ్గరున్న కొన్ని వందల గంటల గజల్స్‌ని వినే అవకాశం నాకు కలిగింది. మా మిత్రబృందం ఎప్పుడొచ్చినా బాపుగారింటికి వెళ్లేవాళ్లం. సాయంత్రం డాబా మీద కూర్చుని ఈ పాటలు మొదలు పెట్టాక పరిసరాలు మరిచిపోయేవాళ్లం. వాళ్లలో కొందరు అక్కడే కునుకు తీసేవాళ్లు, ఇంకొందరు వెళ్లిపోయేవాళ్లు కూడా!  తెల్లవారుఝాముదాకా బాపుగారు, నేను కూర్చుని విన్న సందర్భాలు చాలా చాలా ఉన్నాయి. మరిచిపోలేనటువంటి అనుభూతి అది. ఎందుకంటే ఆ పాటలు వింటున్నప్పుడు నేను సంపాదించుకున్న జ్ఞానం ఎంతుందో చెప్పడానికి వీల్లేదు. 

ముఖ్యంగా ''తూర్పు వెళ్లే రైలు'' సినిమాకు సంగీతం నన్ను మ్యూజిక్‌ చేయమని అడిగినప్పుడు అందులో 'చుట్టూ చెంగావి చీర' పాటకి ఆయన 'రఫ్‌తా రఫ్‌తా' అనే  ఒక గజల్‌లోని పల్లవి వినిపించి  'నాకు ఈ పద్ధతిలో పాట కావాలి' అని అడిగారు. అలా ఆ పాట చేయడం జరిగింది. జెమినిలో ఆ పాట రికార్డ్‌ చేసి బయటకొచ్చాక రమణగారు అందులో ఉన్న వయొలిన్‌ ప్రోగ్రెషన్స్‌ విని 'మళ్లీ నాకు నౌషాద్‌గారి వయొలిన్‌ ప్రోగ్రెషన్స్‌ గుర్తుకొచ్చాయి' అని అనడం నేనెప్పటికీ మరిచిపోలేని కితాబు.

ఆ సినిమాలోనే 'పల్లె నిదుర లేచింది' అని  టైటిల్‌ సాంగ్‌ ఒకటుంది. దానికి బాపుగారు 'తబలా విూద రైలుబండి వెళుతున్నట్టు ఓ నడక కావాలి, దాంతో పాట కావాలి' అని అడిగారు. దానికి తబలా ప్లేయర్‌ ధృవుడు. తను మహదేవన్‌ గారి దగ్గర వాయించేవాడు. అప్పుడు నాకు అసిస్టెంట్‌ గుణసింగ్‌. చాలా అద్భుతమైనటువంటి మురళీగాన విద్వాంసుడు. ఆ మధ్యనే అతను దివంగతుడయ్యాడు. మేమందరం కలిసి  రైలుబండి వెళుతున్నట్టు ఎలా ఉండాలో అని ఒక నడకను అనుకుని ఆ పాటను చేశాం. బాపుగారికి ఎంత అల్పసంతోషి అంటే  రిహార్సల్‌ చేస్నుప్పుడు వినిపించగానే ఎంతో సంబరపడిపోయారు. 'ఇదేనండి నేననుకున్నది ఎగ్జాట్లీ అలాగే వచ్చింది' అని. 

బ్యాక్‌గ్రౌండ్స్‌లో గాని ఎక్కడైనా గానీ పెద్ద రిస్ట్రిక్షన్స్‌ చూపించేవారు కాదు. ఆయనకు మెలోడియస్‌గా ఉండాలి. ఆయనకు కొన్ని నచ్చని ఇన్‌స్ట్రుమెంట్స్‌ ఉన్నాయి – ఒకటి ట్రంపెట్‌ మరొకటి షెహనాయ్‌. ఎందుకో మరి నాకు అర్థం కాదు కానీ బాపుగారికి ఈ రెండు ఇన్‌స్ట్రుమెంట్స్‌  నచ్చవు. 'అవి  నాకు మాత్రం వాడకండి' అని అనేవారు. ఆయనకు బాగా నచ్చింది 'ఎకొస్టిక్‌ క్లాసికల్‌ గిటార్‌ గెట్‌గిటార్‌ కాని టల్వ్‌స్టింగ్స్‌ గిటార్‌, ఫ్లూట్‌లో పీకోలాగా వాయించే పర్క్‌షన్స్‌్‌ తర్వాత కొన్ని సౌండ్స్‌ ఉండేటువంటి సింథసైజర్‌ – ఇవన్నీ చాలా ఇష్టం. (సశేషం) 

– ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం

Click Here For Part-1

Click Here For Part-2