తెలుగు సినిమా సెన్సార్ ఛీఫ్‌గా ధనలక్ష్మి ఉన్నంత కాలం పెద్ద సినిమాలకి చుక్కలు కనిపించేవి. చాలా మామూలు సీన్లని కూడా కత్తిరించి పారేయడం, మితి మీరిన హింస కానీ, అసభ్యత కానీ లేని చిత్రాలకి అకారణంగా ఏ సర్టిఫికెట్ ఇచ్చేయడం జరిగేది. ఆమె వెళ్లిపోయాక పరిస్థితులు మారాయి. ‘ఐ’ సినిమా కూడా యు/ఏ సర్టిఫికెట్‌తో రిలీజ్ అయింది.
ఇదే సినిమా ధనలక్ష్మి హయాంలో అయితే చాలా కట్స్‌కి గురయి, అదనంగా అడల్ట్ సర్టిఫికెట్ తెచ్చుకునేది. గోపాల గోపాలలాంటి క్లీన్ మూవీకి కూడా ‘యు/ఏ’ వచ్చి ఉండేది. కాస్త లిబరల్ సెన్సార్ ఆఫీసర్లు ఉన్న ఈ టైమ్‌లో కూడా కళ్యాణ్‌రామ్ ‘పటాస్’కి ఏ సర్టిఫికెట్ వచ్చింది. చూడ్డానికి వినోదాత్మక చిత్రంలానే కనిపిస్తున్నా కానీ ఏ సర్టిఫికెట్ ఎందుకొచ్చిందో మరి.
మాస్‌ని మెప్పించే ప్రయత్నంలో భాగంగా హింస మితి మీరిందో ఏమో. త్రీడీ సినిమాలనీ, కామెడీ సినిమాలనీ ప్రయత్నించి చేతులు కాల్చుకున్న కళ్యాణ్‌రామ్ ఈసారి మాస్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏ సర్టిఫికెట్ అతని సినిమాకి కొందరు ఫ్యామిలీ ఆడియన్స్‌ని దూరం చేసినా మాస్ ఆడియన్స్‌ని ఘనంగా ఆకట్టుకుంటే ఓకే.