మరాఠీ వారైన షిండే గారి నోట తెలంగాణ ప్రకటన వినబడగానే నాకు యీ మాటలే స్ఫురించాయి.
ఛత్రపతి శివాజీ సింహ్‌గఢ్ కోటను జయించి రమ్మనమని తన సేనాని తానాజీని పంపించాడు. కోటను గెలిచారు. కానీ ఆ యుద్ధంలో తానాజీ చనిపోయాడు. రెండు వార్తలు ఒకేసారి వినగానే శివాజీ రియాక్షన్ అది – 'గఢ్ ఆలా పణ్ సింహ్ గేలా..' – 'కోట వచ్చింది, కానీ సింహం వెళ్లిపోయింది'. అది ఫేమస్ కొటేషన్‌గా మిగిలిపోయింది.
తెలంగాణ ప్రజలు కోరుకున్నట్టే పది జిల్లాల తెలంగాణయే దక్కింది. హైదరాబాదే దానికి రాజధాని. భద్రాచలం, మునగాల అన్నీ వాళ్లవే. ఆంధ్రావాళ్లు అడిగిన ఒక్క కోరిక కూడా తీర్చలేదు. రాయలసీమ 'అడ్డపంచెల వాళ్ల'ని తెలంగాణ 'గళ్లలుంగీల'తో కలిపి కలుషితం చేయలేదు. (ఈ విశేషణాలు నావి కావు, మన నాయకులవి).
అంతా హ్యేపీస్ అనుకోమని టి-కాంగ్రెసు వాళ్లు మనల్ని వూదరగొడుతున్నారు. కానీ తెరాస నాయకులు, యితర టి-వాదులు అనుకోవటం లేదు. పూర్తి వివరాలు రానీయండి చూదాం అంటున్నారు.
అవును మరి, తెలంగాణ పోరాటం జరిగిందే హైదరాబాదు కోసం. ఇది పచ్చి నిజం. అన్ని ఉపాధి అవకాశాలు, వ్యాపారావకాశాలు హైదరాబాదులోను, చుట్టూనే వున్నాయి. అక్కణ్నుంచి ఆంధ్రులను బయటకు నెట్టేస్తే ఆ అవకాశాలు మనవే అని ఆశపెట్టే అందర్నీ ఉద్యమంలోకి లాక్కుని వచ్చారు.
హైదరాబాదు లేకపోతే మేమెలా బతుకుతాం, కనీసం దాన్ని యుటీ చేసి అందరికీ అవకాశాలు వుండేట్లు చేయండి అంటూ సీమాంధ్రులు గగ్గోలు పెట్టారు. – 'ససేమిరా వీలుపడదు, ఆంక్షలు లేని హైదరాబాదు యివ్వకపోతే ఉద్యమిస్తాం, పోరాడతాం' అన్నారు తెరాస వాళ్లు.
'మా వద్ద ఉన్నత విద్య, వైద్య సౌకర్యాలు లేవు, హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా పెట్టి మేం అవకాశాలు కోల్పోకుండా చూడండి' అని అడిగారు విభజనకు సిద్ధపడిన సీమాంధ్ర నాయకులు. – 'కుదరదు, రెండేళ్లో, మూడేళ్లో తాత్కాలిక రాజధాని చాలు. అదీ ఎంసిఎచ్ చాలు.' అంటున్నారు తెరాస వారు.
ఇవాళ వచ్చిన ప్రకటన ప్రకారం హైదరాబాదు అంటే జిఎచ్‌ఎంసీ పరిధిని తీసుకున్నారు. అది కూడా తక్కువేమీ కాదు. సీమాంధ్రులు అడిగినా ఎచ్‌ఎండిఏ అయితే 5 జిల్లాల వరకు వ్యాపించేది. యుటీని చేయలేదు కానీ దాదాపు అంత పనీ చేశారు. శాంతిభద్రతలు, భూపాలన యివన్నీ గవర్నరు చేతిలో.. అనగా కేంద్ర ప్రతినిథి చేతిలో పెట్టారు.
ఇక విద్య, వైద్య అవకాశాలు యిప్పటిలాగానే కొనసాగుతాయి అన్నారు. అంటే అందరూ స్థానికులే అవుతారన్నమాట. ఉద్యోగుల ఆప్షన్లు వగైరా బిల్లులో విపులంగా వుంటాయట. రేపటి పేపరు చూస్తే యింకా ఎన్ని బయటపడతాయో తెలియదు.
'28 రాష్ట్రాలు ఎలా ఏర్పడ్డాయో తెలంగాణకూడా అలాగే ఏర్పడాలి' అన్న టి- ఉద్యమకారుల డిమాండు నెరవేరలేదు. ఇప్పటిదాకా ఏ రాష్ట్రానికీ లేనన్ని పరిమితులు, ఆంక్షలు తెలంగాణకు విధించారు.
ముఖ్యంగా ఈ ఆంక్షలు తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ అయిన హైదరాబాదుపై విధించారు. ముఖ్యపట్టణంపై అధికారం చెలాయించలేని ప్రభుత్వం తెలంగాణను ఏలబోతుంది. అందుకే 'కోట దక్కింది, కానీ సింహాసనం దక్కలేదు'
కుంటిరాజుగారు సేనాపతి ఆంక్షల మేరకు నడుచుకోవలసి వస్తే పాలన ఎంత అందంగా వుంటుందో అంత అందంగా వుంటుంది.
కేంద్రం చేతిలో వుంటే అంత భయం దేనికి? తెలంగాణ అంటే వల్లమాలిన ప్రేమ వున్న సోనియా పైన వుండగా.. అనుకోవడానికి లేదు. సోనియా అస్తమిస్తున్న సూర్యుడు. 2014లో మళ్లీ ఉదయిస్తుందో లేదో తెలియదు. పైగా ఆమె ప్రేమ శాశ్వతమో, తాత్కాలికమో తెలియదు. 9 ఏళ్లగా తెలంగాణ అనే మాట తన నోట ఉచ్చరించకుండా జాగ్రత్త పడింది. హైదరాబాదు ప్రగతి కుంటుపడిపోయినా ఉలకలేదు, పలకలేదు. ఇంత చేసినా తెలంగాణలో కాంగ్రెసుకు ఆమె అనుకున్నన్ని ఓట్లు పడకపోతే, యుపిఏ 3 అధికారంలోకి వస్తే ఆమె మూడ్ ఎలా వుంటుందో తెలియదు. ఆమె కాకుండా ఎన్‌డిఏ వస్తే ఎలా వుంటుందో అదీ తెలియదు. కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వం ఎవరిపై ఆధారపడుతుందో, దానికి మద్దతిచ్చే పార్టీలు యిరుగుపొరుగు రాష్ట్రాలలో వుంటే ఏం జరుగుతుందో అదీ తెలియదు.
ఇంత అయోమయస్థితి వున్నపుడు హైదరాబాదుపై సర్వాధికారాలు కేంద్రానికి వెళ్లిపోవడం అత్యంత దుఃఖదాయకం. తెలంగాణ రాష్ట్రానికి పూడ్చలేని నష్టం. 'అబ్బే పదేళ్లు మించకుండా… అన్నారు కదా, ఓర్చుకుంటే సరి' అనవచ్చు టి-కాంగ్రెసు వారు. పదేళ్ల తర్వాత రాజెవరో? రంగడెవరో? అప్పుడు అధికారంలో వుండేవాడికి రాహుల్ వంటి కొడుకుండి, అతగాడిని ప్రధానిని చేయాలని తల్లికో, తండ్రికో అనిపిస్తే.., అప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికి ఎరుక?
అందుకే తెలంగాణకు వచ్చిన దాని కంటె పోగొట్టుకున్నది ఎక్కువ అనిపిస్తోంది.
ఇక ఆంధ్ర ప్రాంతం గురించి చెప్పాలంటే – వాళ్లకూ కోటా లేదు, సింహమూ లేదు. అక్కడ నాయకులుగా చలామణీ అవుతున్నవి పిల్లులే!
అవి కూడా ముసలి పిల్లులు. బాగా బలిసిపోవడం చేత దుమికి ఎలుకలను వేటాడలేని పిల్లులు!!
కిచెన్‌లో దూరి దొంగతనంగా పాలు తాగేసి, ధ్యానముద్ర పట్టి, రాజకీయసన్యాసం పుచ్చుకున్నట్లు నటించే రుద్రాక్షపిల్లులు!!!
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]