ఏ రాష్ట్రప్రభుత్వానికీ లేని దుస్థితి తెలంగాణ రాష్ట్రానికి పట్టబోతోంది. ఆత్మగౌరవం కోసం ఉద్యమం నడిపాం అని చెప్పుకుంటూ యిలాటి షరతులకు లోబడడం ఎలాటి ఆత్మగౌరవ రక్షణో టి-ఉద్యమకారులే చెప్పాలి. మాట్లాడితే యిది సీమాంధ్రుల కుట్ర అంటారు. అది తప్ప నోట యింకో మాట రాదు. ప్రత్యేక రాష్ట్రం వస్తే చాలు, ఎలాటి నిబంధనలు పెట్టినా ఒప్పుకుందాం అని వీళ్లు ప్రజలకు ఏ విధంగా కన్విన్స్ చేయగలరో నాకు అర్థం కాదు. శాంతి భద్రతలు, రెవెన్యూ కేంద్రానికి అప్పగించి కూర్చున్నారు. ఇప్పుడు మంత్రుల ముఠా సూచన ప్రకారం నదీజలాలన్నీ కూడా వారి పర్యవేక్షణలోకే వెళ్లిపోతాయి. ఇరు రాష్ట్రాలు కూర్చుని మాట్లాడుకుని ఒక ఒప్పందానికి రావడానికి రెండేళ్లు గడువు యిస్తారట. ఆ తర్వాత ఓ బోర్డు ఏర్పాటు చేసి దాన్ని వాళ్ల అధీనంలోకి తీసుకుంటారట. అంతా వాళ్లే చేస్తారట, వాళ్లు చెప్పినదే జరుగుతుందట. రెండు రాష్ట్రాలూ చూస్తూ కూర్చోవాలి. తెలంగాణ ఉద్యమం నడిచిన పుష్కరకాలంలో ఏ నాడైనా యిరు ప్రాంతాల వారిని ఒక్క దగ్గర కూర్చోబెట్టి మాట్లాడించే ప్రయత్నం చేయని కాంగ్రెసు ప్రభుత్వం, చర్చలే జరపకుండా ముందే నిర్ణయం తీసేసుకుని వివాదాలు సృష్టించిన కాంగ్రెసు ప్రభుత్వం, పుకార్లతో, లీకులతో యిరు ప్రాంతాల వారి మధ్య ద్వేషాగ్ని రగిల్చిన యీ ప్రభుత్వం యిద్దరూ కూర్చుని సామరస్యంగా సమస్య పరిష్కరించుకుంటారని ఎలా అనుకుంటుంది? రెండేళ్ల గడువు కూడా దండగ. ఇవాళే బోర్డు ఏర్పరచి అంథా వాళ్ల చేతిలో తీసుకోమనండి.
నిజానికి దేశంలో ఏ రెండు రాష్ట్రాలూ యింత దిక్కుమాలిన పరిస్థితిలో లేవు. నదీజలాలపై హక్కు కోల్పోయి, కేంద్రం ఎలా చెపితే అలా తలాడించే దుస్థితిలో లేవు. ఎందుకంటే కేంద్రం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందన్న నమ్మకం లేదు. దేవెగౌడ తను ప్రధానిగా వుండగా ఆల్మట్టి మొదలెట్టించారని గుర్తు పెట్టుకుంటే చాలు. 'మీరు ఏం చేసినా మేం పడి వుంటాం' అని సంతకం పెట్టి యివ్వబోతున్నారు మన తెలుగు నాయకులు. ఎందుకురా అంటే కొత్త రాష్ట్రం కోసం! కొందరికి కొన్ని కొత్త పదవులకోసం! నిజానికి యుపి, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు మనకంటె అనేక విషయాల్లో వెనుకబడి వున్నారు. వాళ్లు విభజన విషయంలో నాగరీకత ప్రదర్శించి వారిలో వారు చర్చించుకుని ఏకగ్రీవ అభిప్రాయానికి వచ్చారు. మనం అనాగరికంగా ఒకరినొకరం రాక్షసులని నిందించుకుని, వెళ్లి ఢిల్లీ ముందు సాగిలబడుతున్నాం. స్వతహాగా రావల్సిన హక్కులన్నీ క్షవరం చేసుకుని యిలాటి రాష్ట్రం తెచ్చుకుంటే ఎంత, తెచ్చుకోకపోతే ఎంత! మనకు స్వాతంత్య్రం వచ్చినపుడు అప్పటి కమ్యూనిస్టు పార్టీ అధినేత బిటి రణదివే ఒక ప్రకటన యిచ్చాడు – చివర్లో ..యిది అర్ధబానిసత్వం అన్నాడు. ఇది పూర్తి బానిసత్వమే.
ఇన్నిటికి రాజీపడినా తెలంగాణ బిల్లు గట్టెక్కుతుందా అంటే సందేహమే. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వచ్చి తీరుతుంది అని జయపాల్ గారు బల్లగుద్ది మరీ చెప్పారు. చూడబోతే అజెండాలో లేనేలేదు. డిసెంబరు 9న తెలంగాణ ఏర్పడుతుందన్న మాట వట్టిపోయింది. అసలు యీ సమావేశాల్లో తెలంగాణ బిల్లు రావడం దాదాపు అసాధ్యం అంటున్నారు. సెషన్ పొడిగించండి అని బిజెపి అంటే దక్షిణాది ఎంపీలు, ఈశాన్యరాష్ట్ర ఎంపీలు క్రిస్‌మస్ రోజుల్లో పెడితే ఒప్పుకుంటారో లేదో వాళ్లను అడిగి చెప్తాం అన్నారు కమల్ నాథ్. ఈ లోపున అసెంబ్లీలో ఎన్ని విన్యాసాలు జరుగుతాయో, ఎన్ని సవరణలు ప్రతిపాదిస్తారో చూడాలి. 2014 ఫిబ్రవరిలోలో ప్రత్యేక సెషన్ పెట్టి యీ బిల్లు క్లియర్ చేస్తారనే మాట ఒకటి కొత్తగా వినబడుతోంది. ఈ సెషన్ 5 నుండి 20 వరకు 16 రోజులుంటే దానిలో 4 రోజులు సెలవులు. 38 బిల్లులు పాసు కావాలిట. వాటిలో వివాదాస్పదమైనవి కూడా వున్నాయి. మహిళా రిజర్వేషన్, లోకపాల్ వంటివి..!
బొగ్గు కుంభకోణం, తేజ్‌పాల్ స్కాండల్.. యిలాటి వాటిపై బిజెపి కనీసం రెండు మూడు రోజులు ఆగమాగం చేయకమానదు. మధ్యలోనే అసెంబ్లీ ఫలితాలు వస్తాయి. 5 రాష్ట్రాలలో ప్రస్తుతం మూడిటిలో అధికారంలో వున్న కాంగ్రెసు రెండిటిలో నిలబెట్టుకుంటే గొప్ప. రాజస్థాన్‌లో ఓటమి తప్పదంటున్నారు. ఢిల్లీలో కూడా ఓడిపోతే పరిస్థితి దీనంగా అయిపోతుంది. షీలా దీక్షిత్‌కు వ్యక్తిగతంగా ఎంత మంచిపేరున్నా అధికధరల పాపం ఆమె మోయక తప్పదు. పైగా కామన్‌వెల్త్ స్కాండల్‌లో ఆమె పేరు కూడా బయటకు వచ్చింది. దానిపై చర్యలు ఏం తీసుకున్నారని స.హ.చట్టం కింద సమాచారం అడిగితే ప్రభుత్వం చెప్పటం లేదు – ఆవిడ ఆవకాశాలు దెబ్బ తింటాయని! తెలంగాణ విషయంలో ఈ రోజు ఎవరి అభిప్రాయాలను లెక్క చేయకుండా బుల్‌డోజర్‌లా దూసుకుపోతున్న కాంగ్రెసుకు ఎన్నికల్లో దెబ్బ తగిలితే, మొహం వేలాడేసి, గుఱ్ఱం దిగక తప్పదు.
బిల్లు ఎప్పుడు పెట్టినా బిజెపి మాటలను పట్టించుకోక తప్పదు. రాయల తెలంగాణ మాట ఎందుకు వచ్చింది అని బిజెపి అడిగితే వీళ్లు ఏం చెప్తారు? మిమ్మల్ని అణచడానికే అని చెప్తారా? 'తెలంగాణ ఎనౌన్సు చేస్తే కెసియార్ ఎగిరివచ్చి మా చెంత వాలతాడని టి-కాంగ్రెస్ నాయకులు చెప్పిన అబద్ధాలు విని మోసపోయాం, విలీనం మాట ఎత్తని కెసియార్‌పై కసితో యీ ప్రతిపాదన తెచ్చాం' అని చెప్తారా? బిజెపి అమెండ్‌మెంట్స్ ప్రతిపాదించి, బిల్లును అందరికీ ఆమోదయోగ్యంగా చేసి తెలంగాణ యిచ్చిన క్రెడిట్ కాంగ్రెసుకు దక్కేట్లు చేస్తుందా? నా ఉద్దేశం – 'మీకు ఏదీ సజావుగా చేయడం రాదు, అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఓడిపోతున్న మీకు పాలించే అధికారం లేదు. మీరు దిగిపోండి. మేం అధికారంలోకి వచ్చి యిరుప్రాంతాల వారినీ మెప్పించేట్లా బిల్లు తయారుచేసి చూపిస్తాం' అని ఛాలెంజ్ చేస్తారు. గతంలో మూడు రాష్ట్రాల విషయంలో అసెంబ్లీలో బిల్లు తీర్మానం పాస్ అయి వచ్చాక వాజపేయి ప్రభుత్వం పడిపోయింది. కొన్నేళ్లకు మళ్లీ తీర్మానం పాస్ చేయించుకుని తెప్పించి అప్పుడు పాస్ చేసి, విభజన చేశారు. ఆ విషయం గుర్తు చేసి మేం మాట యిస్తే ఎప్పటికైనా నెరవేరుస్తాం, మీలా కాదు అంటూ గొప్ప చెప్పుకుంటారు. కాంగ్రెసు వాళ్లు అదే అదనని 'మేం తెలంగాణకు కట్టుబడి వున్నాం, సకలయత్నాలు చేశాం, కానీ బిజెపి సహకరించలేదు, భారీ మెజారిటీతో మళ్లీ ఎన్నుకుంటే యీసారి తెలంగాణ ఖాయం' అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్లవచ్చు.
2014 ఎన్నికల లోపున తెలంగాణ బిల్లు పాస్ కాలేదనుకోండి, అప్పుడేం జరుగుతుంది? కాంగ్రెసో, బిజెపియో అధికారంలోకి వచ్చి మళ్లీ ప్రయత్నాలు మొదలుపెడుతుంది. కానీ అప్పుడూ యివే సమస్యలు కదా! మరి వీటికి పరిష్కారం ఏమిటి? సమస్యను వాయిదా వేయడం వలన లాభం ఏమిటి? పరిష్కారం ఢిల్లీలో లేదు. మనలోనే వుంది. విభజనవాదులు తమ సర్వకష్టాలకు ఆంధ్రులను తిట్టడం మానేసి వారితో కూర్చుని సంభాషణ ప్రారంభించాలి. జులై 30 తర్వాత జయపాల్ రెడ్డిగారు ఆ పని చేస్తానని మాట యిచ్చారు, మళ్లీ మర్చిపోయారు. ఢిల్లీ వాళ్లు తన మాటే వింటున్నారు కదా, యీ కోన్‌కిస్కాయ్‌లతో మాట్లాడేది ఏముంది అనుకున్నారేమో. రాయల తెలంగాణ అనగానే ఆయనా ఉలిక్కిపడ్డారు. ఆంక్షలు లేని హైదరాబాదు నుండి 'పరిమిత ఆంక్షల' స్థితికి దిగారు. ఢిల్లీ వాళ్లను దేబిరిస్తే ఏమొస్తోంది? అన్ని అధికారాలూ వాళ్ల చేతిలోకి వెళుతున్నాయి. వాళ్లు చూస్తే – వాళ్ల మాటమీద వాళ్లే నిలబడరు. రాష్ట్రాల పేర్లు మార్చేస్తారు, బిల్లు పేరు మార్చేస్తారు. హైదరాబాదులో వున్న హైకోర్టు ఆంధ్ర హైకోర్టు అవుతుందిట, తెలంగాణ హైకోర్టు ఎక్కడ పెడతారో తర్వాత చెప్తారట. ఇవాళ రాయల తెలంగాణ అంటారు, రేపు మరొకటి అంటారు. ఇవాళ యింత హంగామా చేసినదాకా వుండి రేపు అంతా తూచ్ అన్నా అనవచ్చు. ఏం చేసినా మనం శుంఠల్ల్లా చూస్తూ వుండాల్సిందే! (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2013)