తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో శవాసనం వేసి ఉంది. దాన్ని అంతో ఇంతో లేపడానికి కాసాని జ్ఞానేశ్వర్ ప్రయత్నం చేస్తే.. ఆ ప్రయత్నాన్ని కూడా అధినేత చంద్రబాబునాయుడు చాలా వ్యూహాత్మకంగా నీరుగార్చేశారు. అసలు పోటీలోనే లేకుండా చేశారు. అయితే.. కాసాని రాజీనామా చేస్తూ,. కాంగ్రెస్ ను గెలిపించడం కోసం నిర్ణయాలు తీసుకునేట్లయితే ఇక పార్టీ ఎందుకు అని చెప్పేసి వెళ్లిపోయారు.
వెళ్లిపోతున్నారు గనుక.. ఆయన ఏదో ఒక నింద వేశార్లే అని ఆ క్షణంలో ఆ పార్టీని అభిమానించే వారికి అనిపించి ఉండవచ్చు. కానీ రోజురోజుకూ తెతెదేపా నీతిమాలని రాజకీయాలు బయటపడుతున్నాయి. చంద్రబాబునాయుడు నోరు తెరచి చెప్పడానికి ఆయనకు సిగ్గు అనిపించి ఉండవచ్చు గానీ.. ఆ పార్టీ శ్రేణులందరూ కూడా ఇండైరక్టు ఆదేశాలతో.. బరితెగించి కాంగ్రెస్ కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. పార్టీ నాయకత్వం తరఫున శ్రేణుల వైఖరిని ఖండించే దమ్ము ధైర్యం ఎవ్వరికీ లేవు. అలాంటి ఆలోచన అసలే లేదు.
మాంసం తిన్నాం అని నలుగురికీ తెలియడానికి వెనకటికి ఎవడో ఎముకలు మెడలో వేసుకుని తిరిగాడట. తెలంగాణ తెలుగుదేశం పార్టీ భ్రష్ట పతన రాజకీయ ధోరణులు కూడా ఈ సామెత చందంగానే ఉన్నాయి.
ఖమ్మం నియోజకవర్గంలో తెలుగుదేశం పెద్ద సభ పెట్టి.. తామందరమూ కలిసి తుమ్మల నాగేశ్వరరావును గెలిపించాలని పిలుపు ఇచ్చారు. పార్టీ నాయకత్వానికి ఏ మాత్రం ఆత్మాభిమానం ఉన్నా సరే.. అప్పుడే ఆ సభను ఖండించి ఉండాల్సింది. ఎవ్వరైనా తమ వ్యక్తిగత ఇష్టాయిష్టాలు చూపించుకోవచ్చు గానీ.. పార్టీ ముద్రతో ఎవ్వరికీ మద్దతు ప్రకటించడానికి వీల్లేదని చెప్పి ఉండాలి. కానీ చంద్రబాబునాయుడు అలాంటి పనిచేయలేదు. పార్టీ శ్రేణులు ఇంకా బరితెగించేశాయి.
కాంగ్రెస్ పార్టీ ర్యాలీల్లో తెలుగుదేశం జెండాలు పట్టుకుని ఊరేగుతున్నారు. ప్రియాంక రాక సందర్భంగా మధిరలో జరిగిన సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ సీపీఐ పేర్లతో పాటు, తెలుగుదేశం కార్యకర్తలదరూ కూడా తమ విసయానికి తోడ్పాటు అందించాలని పిలుపు ఇవ్వడం పరాకాష్ట. ప్రియాంక సభలో తెలుగుదేశం జెండాలు రెపరెపలాడడం ఆ పార్టీ దౌర్భాగ్యానికి నిదర్శనం.
తెలంగాణ తెలుగుదేశాన్ని ఒక్క అంగుళమైనా లేపి నిల్చోబెట్టలేని చంద్రబాబునాయుడు అసమర్థత చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగుదేశం జాతీయ పార్టీ అని టెక్నికల్ గా చెప్పుకోవడానికి ఆయన తెలంగాణలో ఒక పార్టీ ఆఫీసును మెయింటైన్ చేస్తున్నారే తప్ప.. ఆ పార్టీ ఇక్కడ పూర్తిగా కాంగ్రెసుకు ఊడిగం చేయడానికి ఫిక్సయిపోయిందని అంతా అనుకుంటున్నారు.