తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మరోసారి ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావుపేట నుంచి పోటీ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ఆమెకు టికెట్ ఖరారు అయింది అని పార్టీలో ప్రచారం సాగుతోంది.
ఆమె ప్రచార వాహనాన్ని కూడా తయారు చేయించుకుంటున్నారు. ఈసారి ఎన్నికలు గట్టిగా జరుగుతాయని అంతా అంటున్న వేళ ఎర్రన్నలు టీడీపీకి పోటీగా బరిలోకి నిలబడతాయా లేక పొత్తు పెట్టుకుని పోటీ చేస్తాయా అన్న డౌట్లు అందరిలో ఉన్నాయి.
ఉమ్మడి విశాఖ జిల్లాలో పాయకరావుపేట, నర్శీపట్నంలలో తాము పోటీ చేస్తామని సీపీఐ అంటోంది. ఈ రెండు సీట్లలో తాము లౌకిక ప్రజాస్వామ్య శక్తులను కలుపుకుని పోటీకి దిగుతామని సీపీఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ స్పష్టం చేశారు.
నర్శీపట్నంలో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు పోటీ చేస్తున్నారు. నర్శీపట్నంలోనూ పాయకరావుపేటలోనూ సీపీఐ పోటీ అంటే టీడీపీతో పొత్తు ఉన్నా ఈ సీట్లు కోరుతారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
ఈ కీలకమైన సీట్లు అడిగినా టీడీపీ ఇచ్చేందుకు వీలు లేదని అంటున్నారు. లౌకిక శక్తులను కలుపుకుంటామని జిల్లా కార్యదర్శి చెప్పడం చూస్తూంటే పొత్తులు ఉన్నట్లుగానే భావించాల్సి ఉంది అంటున్నారు. సీపీఐ రాష్ట్ర నాయకులు టీడీపీతో పొత్తుకు సుముఖంగా ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. పొత్తు లేకపోతే మాత్రం సీనియర్ నేతల మీదనే పోటీ అన్నట్లుగా ఎర్రన్నల తీరు ఉంది అంటున్నారు.