విశాఖ ఉక్కు పోరాటం నవంబర్ 8 నాటికి వేయి రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బంద్ జరిగింది. విశాఖలో బంద్ సందర్భంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. కార్మిక సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విఫలం అయ్యారని ఘాటు విమర్శలు చేశారు.
ఎన్నో పోరాటాల ద్వారా ఉక్కు కర్మాగారాన్ని సాధించుకున్నామని ఆయన అంటున్నారు. 32 మంది అమరుల త్యాగం విశాఖ ఉక్కు అని కూడా గుర్తు చేశారు. సీఎం విఫలం అని అంటున్న గంటా ఆదికి ముందు ఎమ్మెల్యే పదవికి తాను చేసిన రాజీనామా సంగతేంటి అని వైసీపీ నేతలు అంటున్నారు.
ఒక వైపు రాజీనామా అని చెబుతూనే రాజ్యసభ ఎన్నికల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల వరకూ గంటా ఓటేసి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు గంటాకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామాను ఆమోదించుకునేవారు లేదా ఎన్నికల్లో ఓటు వేయకుండా దూరంగా ఉండేవారు కదా అని అంటున్నారు.
సీఎం జగన్ విఫలం అయ్యారని గంటా అంటున్నారని అసెంబ్లీలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సంగతి గుర్తు లేదా అని నిలదీస్తున్నారు. గంటా కానీ టీడీపీ నేతలు కానీ ఎన్నికల వేళ ఉక్కు కార్మిక లోకం మద్దతు కోసమే వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారు అని అంటున్నారు.