ఓవరాక్ష‌న్.. ఎంపీ న‌వ‌నీత్ కౌర్ దంప‌తుల‌కు ఝ‌ల‌క్!

మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే ఇంటి ముందుకు వెళ్లి హ‌నుమాన్ చాలీసాను ప్లే చేస్తామంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన ఆ రాష్ట్రానికే చెందిన ఎంపీ న‌వ‌నీత్ కౌర్, ఆమె భ‌ర్త‌, ఎమ్మెల్యే ర‌వి రాణాల‌కు…

మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే ఇంటి ముందుకు వెళ్లి హ‌నుమాన్ చాలీసాను ప్లే చేస్తామంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన ఆ రాష్ట్రానికే చెందిన ఎంపీ న‌వ‌నీత్ కౌర్, ఆమె భ‌ర్త‌, ఎమ్మెల్యే ర‌వి రాణాల‌కు కోర్టులో కూడా ఊర‌ట ద‌క్క‌లేదు. 

ఒక వ్య‌క్తి ఇంటి ముందుకు వెళ్లి మ‌త‌ప‌ర‌మైన ప‌ఠ‌నాలు చేస్తామ‌ని హెచ్చ‌రించ‌డం నిస్సందేహంగా ఆ వ్య‌క్తి వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌ను హ‌రించ‌డ‌మే అని బాంబే హై కోర్టు స్ప‌ష్టం చేసింది. ఈ కేసులో న‌వనీత్ కౌర్, ఆమె భ‌ర్త అరెస్టుల‌ను కోర్టు స‌మ‌ర్థించింది. వారిని రిమాండ్ కు పంపుతూ ఆదేశాలు  జారీ చేసింది.

అలాగే మ‌త‌సంబంధ ప‌ఠ‌నాల‌ను బ‌హిరంగంగా, ఉద్దేశ‌పూర్వ‌కంగా చేప‌ట్ట‌డం కూడా శాంతిభ‌ద్ర‌త‌ల‌ను దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నంగానే కోర్టు ప‌రిగ‌ణించింది. అలాగే ఈ కేసులో వీరిని అరెస్టు చేయ‌డానికి వెళ్లిన పోలీసుల‌పై కూడా దాడి జ‌రిగిన‌ట్టుగా మ‌రో కేసు కూడా న‌మోద‌య్యింది. ఇలా ఓవ‌రాక్ష‌న్ తో న‌వ‌నీత్ కౌర్ దంప‌తులు ఇర‌కాటంలో ప‌డ్డారు.

మ‌సీదులకు ఉండే మైకుల‌ను తొల‌గించాలంటూ మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ సేన డిమాండ్ చేయ‌డంతో మ‌హారాష్ట్ర‌లో వివాదానికి తెర‌లేచింది. మైకుల‌ను తీసేయ‌న‌ట్టు అయితే మ‌సీదుల నుంచి ప్రార్థ‌న‌లు వినిపించే స‌మ‌యంలోనో తాము హ‌నుమాన్ చాలీసాను మైకుల్లో ప్లే చేస్తామంటూ ఎంఎన్ఎస్ ప్ర‌క‌టించింది. ఈ వివాదంలో త‌మ వంతు క్రెడిట్ పొంద‌డానికేమో ర‌వి రాణా, న‌వనీత్ కౌర్ లు ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే ఇంటి ముందు హ‌నుమాన్ చాలీసా ప్లే అంటూ ప్ర‌క‌టించారు. 

ఇలా ఓవ‌రాక్ష‌న్ చేయ‌బోయి వీరిని మ‌హారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్ కోసం చేసిన ప్ర‌య‌త్నాల‌కు కోర్టు అభ్యంత‌రం చెప్పింది. ఈ దంప‌తుల‌ను చెరో జైలుకు త‌ర‌లించారు పోలీసులు.