మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమాగా మొదలైన ఆచార్య కాస్టింగ్ విషయంలో జరిగిన మార్పు చేర్పులను ఆ సినిమా రూపకర్తలే చెబుతున్న తీరు ఆసక్తిదాయకంగా ఉంది! ఏదైనా సినిమా, అది కూడా భారీ సినిమా అంటే.. దానికి సంబంధించి సమస్తం లాక్ అయి ఉందనుకుంటారు ఎవరైనా! స్క్రిప్ట్, ఎవరు నటిస్తారు, ఎవరి రోల్ ఎలా.. అనేది సినిమా ప్రకటనకు పూర్వమే సెట్ అయి ఉంటుందనుకోవడంలో వింత ఏమీ లేదు!
మరి ఇలాంటి లాక్డ్ స్క్రిప్ట్ కూ, లాక్డ్ సెటప్ కూ ఆచార్య చాలా భిన్నంగా కనిపిస్తూ ఉంది. చిరంజీవి హీరో అని మరో హీరోది అతిథి పాత్ర అని అనే కథకు ఆ తర్వాత చాలా మార్పు చేర్పులు జరిగాయని స్పష్టం అవుతోంది. ఆ అతిథి పాత్రలో మహేష్ అనే ప్రచారం దగ్గర ఈ సినిమా కథకూ, ఆ పాత్రను రామ్ చరణ్ చేపట్టాకా ఈ కథకూ చాలా మార్పులు జరిగాయని దర్శకుడు కొరటాలే చెబుతున్నారు!
రామ్ చరణ్ రోల్ ను గెస్ట్ అప్పీరియన్స్ తో మొదలుపెట్టి.. ఆ తర్వాత కథను చాలా మార్చి ఆ పాత్ర నిడివి పెంచినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ మార్పులు కథపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? నిడివి పెంచడం అంటే ఫైట్లు, సీన్లు, పాటలు పెట్టడమేనా! అనేది అంశాలపై ఆచార్య విడుదలైతే కానీ క్లారిటీ రాదు.
ఇక రామ్ చరణ్ పాత్రను గెస్ట్ స్థాయి నుంచి ఫుల్ లెంగ్త్ పాత్రగా మార్చడం ఒక ఎత్తు అయితే, చిరంజీవి పాత్రకు హీరోయిన్ ను పెట్టి కొంత షూటింగ్ అయిన అనంతరం కాజల్ కు సెలివివ్వడం మరో ఎత్తులాగుంది. మొదట్లో కాజల్ పాత్రను రాసుకున్నప్పటికీ ఆ తర్వాత ఆ పాత్ర అసంమజసంగా అనిపించి తొలగించినట్టుగా.. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారంటూ కొరటాల చెబుతున్నారు!
ఇదంతా వింటుంటే.. గెస్ట్ అప్పీరియన్స్ లు ఫుల్ లెంగ్త్ పాత్రలుగా మారడం, ఒక హీరోయిన్ పాత్రను కథలో మార్పు చేర్పుల్లో భాగంగా ఎత్తేయడం.. ఈ మార్పులన్నీ కథ పేపర్ మీద ఉన్నప్పుడు జరిగి ఉంటే పెద్ద ఆశ్చర్యం లేదు. అయితే సెట్స్ మీద, షూటింగ్ అయ్యాకా కూడా మార్పు చేర్పులు మాత్రం ఆచార్య ఎక్కడో స్టార్ట్ అయ్యి, మరెక్కడికో ప్రయాణించిందని స్పష్టం అవుతోంది.