ఈ వ్యూహం సోనియా, రాహుల్ కు బోధ‌ప‌డేనా?

కురువృద్ధ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీకి మిత్రుడే అయిన లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ త‌న‌యుడు తేజ‌స్వి యాద‌వ్ ఒక స‌ల‌హా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కి రాజ‌కీయ వ్యూహాన్ని బోధించాడు లాలూ త‌న‌యుడు. ప్ర‌స్తుత…

కురువృద్ధ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీకి మిత్రుడే అయిన లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ త‌న‌యుడు తేజ‌స్వి యాద‌వ్ ఒక స‌ల‌హా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కి రాజ‌కీయ వ్యూహాన్ని బోధించాడు లాలూ త‌న‌యుడు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ చేయాల్సింది ఏమిటో.. ఒకే ముక్క‌లో తేజ‌స్వి వివ‌రించాడు. త‌న స‌ల‌హా పాటిస్తే ఆ పార్టీకే మంచిద‌ని తేల్చి చెప్పాడు.

ఇంత‌కీ కోలుకోలేక‌పోతున్న కాంగ్రెస్ కు బిహార్ లో బీజేపీ కూట‌మికి గ‌ట్టి పోటీ ఇచ్చిన తేజ‌స్వి చెప్పే మాట ఏమిటంటే, దేశ వ్యాప్తంగా 200 సీట్ల‌పై కాంగ్రెస్ దృష్టి పెడితే చాల‌నేది! దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని లోక్ స‌భ సీట్ల‌లోనే స‌త్తా చూపించాల‌నే ఉబ‌లాటాన్ని ప‌క్క‌న పెట్టి కాంగ్రెస్ పార్టీ త‌ను డైరెక్టుగా బీజేపీతో పోటీ ప‌డే రెండు వంద‌ల స్థానాల‌ను ఎంపిక చేసుకుని అక్క‌డ క‌ష్ట‌ప‌డుకోవాల‌ని తేజ‌స్వి సూచించాడు.

ప్రాంతీయ పార్టీల‌ను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్ర‌వ‌ర్తించాల‌ని, ఓట్ల చీలిక వంటి చేష్ట‌ల‌కు పాల్ప‌డ‌కుండా..  బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్ పోరాటం జ‌రిగే సీట్ల‌లోనే ఆ పార్టీ క‌ష్ట‌ప‌డితే మంచిద‌ని తేజ‌స్వి చెబుతున్నాడు.

క‌ర్ణాట‌క‌, గుజ‌రాత్, మ‌ధ్య‌ప్ర‌దేశ్, రాజ‌స్తాన్.. వంటి రాష్ట్రాల్లో బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్ పోరాట‌మే ఉంది. ఇటీవ‌లే ప్ర‌శాంత్ కిషోర్ కూడా దేశంలోని రెండు వంద‌ల డెబ్బై లోక్ స‌భ సీట్ల‌లో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉంద‌నే విష‌యాన్ని ప్ర‌స్తావించాడు.

ఇలా తాము రెండో స్థానంలో ఉన్న‌, బీజేపీతో డైరెక్టుగా త‌ల‌ప‌డే సీట్ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఆయా రాష్ట్రాల్లో, స్థానిక ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని.. ముందుకు సాగితే అందులో స‌గం సీట్ల‌లో నెగ్గినా కాంగ్రెస్ ప‌రువు నిల‌బ‌డుతుంది. ఎలాగూ యూపీఏ వైపు ఉన్న ప్రాంతీయ పార్టీలు అంతిమంగా కాంగ్రెస్ తోనే జ‌త‌క‌ల‌ప‌నూ వ‌చ్చు. మ‌రి ఈ మాత్రం వ్యూహం సోనియా, రాహుల్ ల‌కు అర్థ‌మ‌వుతుందా అని!