బాలయ్య ఎమ్జీయార్‌తో కలిసి నటించిన సందర్భం ఎలా వచ్చిందో బాలయ్యగారిపై వ్యాసంలో రాశాను. ఇప్పుడు చంద్రమోహన్ ఎమ్జీయార్‌తో కలిసి నటించిన సందర్భం ఎలా వచ్చిందో వివరిస్తాను. అవును, నిజమే తెలుగు సినిమాల్లో అతి బిజీగా ఉంటూ దాదాపు 900 సినిమాల్లో వేషాలు వేసిన చంద్రమోహన్ తమిళంలో ఎమ్జీయార్ పక్కన వేషం వేశారు. అది కూడా ఆయన ప్రయత్నించకుండానే వేషం వచ్చింది. దానికి కారణం మేకప్‌మన్ పీతాంబరం (నాయర్). పీతాంబరం అంటే ‘‘చంద్రముఖి’’ వంటి 60కు పై బడి సినిమాలు తీసిన డైరక్టరు పి.వాసు తండ్రి. ‘‘పాతాళభైరవి’’ రోజుల నుంచి పీతాంబరం ఎన్టీయార్‌కు పర్శనల్ మేకప్‌మన్. ఎమ్జీయార్‌కు కూడా తొలి రోజుల నుంచి చివరి సినిమా వరకు మేకప్‌మన్. పౌరాణిక పాత్రల్లో ఎన్టీయార్ రాణించడంలో పీతాంబరం పాత్ర కూడా ఉంది.
వీళ్లిద్దరే కాదు, జెమినీ గణేశన్, కెఆర్ విజయ వంటి వారికి కూడా ఆయనే మేకప్ చేశారు. మద్రాసు వాళ్లు తీసిన హిందీ సినిమాల్లో నటించడానికి దిలీప్ కుమార్, ప్రాణ్, అశోక్ కుమార్ వగైరాలు వస్తే వాళ్లకీ ఆయనే మేకప్. తెల్లవారేటప్పటికి యీ ఆర్టిస్టులందరూ ఆయన యింటి వరండాలో తమ వంతు మేకప్ కోసం ఎదురుచూస్తూ కూర్చునేవారుట. అంతటి డిమాండు ఉన్న మేకప్‌మన్ ఆయన. సోదరుడు, ఫోటోగ్రాఫర్ ఐన ఎమ్.సి.శేఖర్‌తో కలిసి తెలుగు, తమిళాలలో సినిమాలు తీసేవారు. పీతాంబరం తీసిన ఒక తెలుగు సినిమా ఫెయిలు కావడంతో చాలా నష్టం వచ్చింది. ఇల్లు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అది విని ఎమ్జీయార్, ఎన్టీయార్ వెంటనే ‘‘మీకు డేట్స్ యిస్తాం, ఏదైనా సినిమా చేసుకోండి.’’ అన్నారు. ‘‘యాదోం కీ బారాత్’’ (1973) అనే హిందీ సినిమా తెలుగు, తమిళ రీమేక్ హక్కులు కొని వీళ్లిద్దరితో 1974లో సినిమాలు ఎనౌన్సు చేశారు. చేయగానే వెంటనే డిస్ట్రిబ్యూటర్లు వచ్చి ఎడ్వాన్సులు యిచ్చేశారు. ఇల్లు నిలబడింది.
హిందీ సినిమాలో ముగ్గురు అన్నదమ్ములు చిన్నపుడే విడిపోయి, పెద్దయ్యాక కలుస్తారు. పెద్దవాడు ధర్మేంద్ర దొంగ అవుతాడు. మధ్యవాడు విజయ్ అరోడా లవర్ బాయ్ అవుతాడు. మూడోవాడు తారిఖ్ ఖాన్ సింగర్ అవుతాడు. చివర్లో అందరూ కలిసి విలన్‌పై పగ తీర్చుకుంటారు. దీని తెలుగు వెర్షన్ ‘‘అన్నదమ్ముల అనుబంధం’’ (1975) తీద్దామనుకున్నపుడు పెద్దవాళ్లిద్దరి పాత్రలు ఎన్టీయార్, మురళీమోహన్ వేయగా చిన్న తమ్ముడి పాత్రకు చంద్రమోహన్‌ను బుక్ చేసుకున్నారు పీతాంబరం. బట్టలూ అవీ కుట్టించారు. రిహార్సల్స్ చేయించారు. ఆయన పాత్ర షూటింగు ప్రారంభమయ్యే రోజున చంద్రమోహన్ వెళ్లి మేకప్ రూములో కూర్చున్నారు. ‘కాస్త ఆగండి’ అంటున్నారు అక్కడివాళ్లు. చూస్తే ఫ్లోర్ మీద యీయన లాటి డ్రస్‌లోనే మరొకతను యాక్టింగ్ చేసేస్తున్నాడు. ‘‘ఎవరితను?’’ అని అడిగితే ‘‘ఎన్టీయార్ గారి అబ్బాయి బాలకృష్ణ.’’ అని చెప్పారు అక్కడి స్టాఫ్.
అతనప్పటికి ‘‘తాతమ్మ కల’’, ‘‘రామ్ రహీమ్’’ (రెండు 1974లోవే) వేసి ఉన్నాడు. మొదటిది ఎన్టీయార్ సొంత సినిమా, డైరక్షన్. రెండో దాంట్లో హరికృష్ణ, బాలకృష్ణ కలిసి వేశారు. 1960లో పుట్టిన బాలకృష్ణ అప్పటికి బాలనటుడి దశ దాటి, హీరో వేషానికి తన 14 ఏళ్ల వయసు చాలక ఉన్నాడు. ‘‘అతనికి యిక్కడేం పని?’’ అని చంద్రమోహన్ ఆశ్చర్యపడుతూండగా పీతాంబరం హడావుడి పడుతూ వచ్చి ‘‘నన్ను మన్నించాలి. మీ వేషం తన కుమారుడికి యిప్పించాలని ఎన్టీయార్ పట్టుబట్టారు. నేను కాదనలేక పోయాను.’’ అని చేతులు పట్టుకున్నారు. చంద్రమోహన్‌కు ఏమీ అర్థం కాలేదు. తన వయసు 32 ఏళ్లు. 51 ఏళ్ల ఎన్టీయార్, 34 ఏళ్ల మురళీమోహన్లకు తమ్ముడంటే నమ్ముతారు. కానీ తన స్థానంలో 14 ఏళ్ల నటుడిని వేస్తే నప్పుతుందా? అలా ఎలా వేయిస్తారు? ఇలా ఆలోచిస్తూండగానే పీతాంబరం ‘‘ఈ పాత్ర లేకుండా చేసినందుకు మీకేమీ నష్టం రాకుండా ఎన్టీయార్ తన సొంత సినిమాల్లో మీకు వేషాలిప్పిస్తామని చెప్పమన్నారు.’’ అన్నారు.
చంద్రమోహన్‌కు చికాకేసింది. ‘‘నేను వేషాల్లేకుండా అలమటించటం లేదండి. అయినా ఆ వేషాలేవో వాళ్లబ్బాయికే యిప్పించుకోమనండి. మధ్యలో నన్ను బుక్ చేసి, అంతా రెడీ చేసి, షూటింగు రోజున యిలా చెప్పడమేమీ బాగా లేదు. సరే, సెలవిప్పించండి. వెళ్లి వస్తాను.’’ అన్నారు. పీతాంబరానికి తల కొట్టేసినట్లయింది. ‘‘చివరి నిమిషం దాకా యిది తేలలేదు. నాకు అస్సలు యిష్టం లేదు. కానీ ఆయన నా కష్టకాలంలో తన డేట్స్ యిచ్చి నన్ను ఆదుకున్నాడు. నాకు ఆబ్లిగేషన్ ఉంది. నువ్వు నన్ను క్షమించాలి.’’ అన్నాడు. అంతటి పెద్దాయన అలా అడగడంతో చంద్రమోహన్ నొచ్చుకుని ‘‘మీరేమీ బాధపడకండి. నాకు వేషాలకు కొదవ లేదు.’’ అనేసి వచ్చేశారు.
కానీ పెద్దమనిషి ఐన పీతాంబరం ఊరికే ఉండలేకపోయారు. తీవ్రంగా మథన పడసాగారు. తమిళ వెర్షన్ ‘‘నాళై నమదే’’ (1975) సెట్స్‌లో దిగాలుగా ఉండడం చూసి ఎమ్జీయార్ సంగతేమిటని అడిగారు. ఇదీ విషయం, చంద్రమోహన్‌కు అన్యాయం జరిగింది, అదీ నా చేతుల మీదుగా.. అని వాపోయారు పీతాంబరం. తమిళ వెర్షన్లో ఎన్టీయార్, మురళీమోహన్ పాత్రలు రెండిటినీ ఎమ్జీయారే వేస్తున్నారు. మూడో తమ్ముడి వేషం ఖాళీగా ఉంది. ఇంకా ఎవరినీ ఫిక్స్ చేయలేదు. ‘‘నువ్వు బాధపడకు. అతన్ని నా దగ్గరకు తీసుకుని రా. దానికి సూటవుతాడేమో చూద్దాం.’’ అన్నాడు ఎమ్జీయార్.
పీతాంబరం వచ్చి చెప్పగానే చంద్రమోహన్ ‘‘చెప్పాను కదండీ, నా గురించి మీరు చింత పడవద్దని. తెలుగులోనే ఖాళీ లేకుండా నటిస్తున్నాను. తమిళంలో వేషాలెందుకు నాకు?’ అని యిదైపోయారు. ‘‘నిన్ను తీసుకుని వస్తానని ఎమ్జీయార్‌కు మాటిచ్చాను. వచ్చి ఓసారి కనబడు, చాలు.’’ అన్నారు పీతాంబరం. పెద్దాయన మాట కొట్టేయలేక చంద్రమోహన్ ఆయనతో ఎమ్జీయార్ యింటికి వెళ్లారు. ఈయన్ని చూడగానే ఎమ్జీయార్ మురిసిపోయారు. ‘‘పొట్టిగా, గిరజాల జుట్టుతో అచ్చు నాలాగే ఉన్నాడే తంబి’’ అంటూ సంతోషపడిపోతూ తక్షణం బుక్ చేసేయండి అన్నారు పీతాంబరంతో. చంద్రమోహన్ తల వూపారు. ఆ విధంగా చంద్రమోహన్ ఎమ్జీయార్ తమ్ముడిగా ఆ సినిమాలో వేశారు. కొసమెరుపేమిటంటే రెండూ సినిమాలూ హిట్ అయ్యాయి. పీతాంబరం నిర్మాతగా నిలదొక్కుకుని ఎన్టీయార్‌తో తర్వాత ‘‘డాన్’’ రీమేక్ ‘‘యుగంధర్’’ (1979) కూడా తీశారు. కొడుకు విజయాలు కళ్లారా చూసి, 89వ ఏట ప్రశాంతంగా మరణించారు.
‘‘అన్నదమ్ముల…’’లో బాలకృష్ణ చాలా పసివాడిగా కనిపించినా, సినిమాలోని యితర ఆకర్షణల వలన అదేమీ యిబ్బంది కలిగించలేదు. ఎమ్జీయార్‌కు అప్పటికే 57 ఏళ్లు. కానీ తమిళ ప్రేక్షకులు ఆయన వయసు గురించి ఎన్నడూ పట్టించుకోలేదు. నిత్యయవ్వనుడిగానే చూశారు. ఎన్టీయార్ చేసిన పనికి నొచ్చుకున్న చంద్రమోహన్ ఆ తర్వాత ఆయనతో కలిసి నటించినట్లు లేదు. (ఫోటో, ‘‘నాళై నమదే’’లో ఎమ్జీయార్, చంద్రమోహన్, ఇన్సెట్లో తెలుగులో చిన్నతమ్ముడి వేషం వేసిన బాలకృష్ణ)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2022)