వైసీపీకి గాజువాక చాలా కీలకం. గత ఎన్నికల్లో సినీ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఓడించిన వైసీపీ ఈసారి కూడా గెలిచి ఆ సీటుని పూర్తిగా తమకు కంచుకోటగా చేసుకోవాలని చూస్తోంది. ఈసారి జనసేన అక్కడ పోటీలో లేదు. టీడీపీ వర్సెస్ వైసీపీగానే గాజువాక ఎన్నికల దృశ్యం ఉండబోతోంది.
టీడీపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్ ని పోటీలోకి దించారు. ఈ ఇద్దరు మధ్యన తీవ్ర స్థాయిలోనే పోటీ జరగనుంది. జనసేన నేతలకు తమకు టికెట్ రాలేదు అన్న అసంతృప్తి ఉంది.
సామాజిక వర్గం పరంగా కాపులు ఎక్కువగా ఉంటారు. దాంతో ఆ సామాజిక వర్గానికి చెందిన గుడివాడను వైసీపీ వ్యూహాత్మకంగానే బరిలోకి దించింది. యాదవులు కూడా కీలక పాత్రలో ఉన్నారు కాబట్టి అదే సామాజిక వర్గం నుంచి పల్లా శ్రీనివాసరావు టీడీపీ నుంచి ఉన్నారు.
ఇతర సామాజిక వర్గాలు రెండు పార్టీలకు ఉండే ప్లస్ పాయింట్లతో ఢీ అంటే ఢీ అంటున్నాయి. వైసీపీలో టికెట్ ఆశించి భంగపడిన సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలిపించుకుని భరోసా ఇచ్చారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని కీలక పదవులు ఇస్తామని హామీ ఇచ్చారని అంటున్నారు.
తిప్పల వర్గం పూర్తి స్థాయిలో పనిచేస్తే విజయం కచ్చితం అని వైసీపీ భావిస్తోంది. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీ వైపు ఉన్నారు. దాంతో పాటు అన్ని రకాలుగా తమకు కలసివచ్చేలా చేసుకుంటోంది. గాజువాకలో ఎవరు విజయం సాధిస్తారు అంటే ఇద్దరికీ టఫ్ గానే ఉంటుంది అన్నది తాజా సన్నివేశం చెబుతోంది.