కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న గత పదేళ్లలో ఒక దేశం.. ఒకే.. అనే నినాదం బాగా వినిపిస్తూ ఉంది! కొన్నింటిని కమలం పార్టీ అమలు చేయగా, మిగతా వాటిని అమలు చేసే ప్రయత్నంలో ఉంది! ఇందులో ఒక దేశం ఒకే ఎన్నిక అనే నినాదం కూడా ఒకటి ఉంది. దేశంలో లోక్ సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ ఒకే సారి ఎన్నిక జరగాలని మోడీ చాలా సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుపుతున్నారు. దీనిపై కమిటీలపై కమిటీలు వేస్తూ వస్తున్నారు. ఈ మధ్యనే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీ ప్రస్తుత రాష్ట్రపతికి ఒక నివేదిక కూడా ఇచ్చారట!
రెండు పర్యాయాల్లో మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తి చేసేలా ఒక మధ్యే మార్గంగా ఈ కమిటీ సూచన చేసిందట! మరి దీనిపై అంతిమంగా ఏం తేలుస్తారో చూడాల్సి ఉంది!
అయితే.. ఇదంతా బాగానే ఉంది కానీ, ఈ దేశంలో ఎన్నికల ప్రక్రియ మార్చితో మొదలుపెడితే, ఫలితాలు వచ్చే సరికి జూన్ అయ్యేలా ఉంది! అనేక దశల్లో ఈ ఎన్నికల తతంగం సాగుతోంది. అక్కడకూ దేశంలో ప్రధానంగా లోక్ సభ ఎన్నికలే జరుగుతున్నాయిప్పుడు. ఐదు రాష్ట్రాల్లోనే లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలూ జరుగుతున్నాయి.
మరి లోక్ సభ వరకే ఎన్నికలు జరుగుతున్నాయనుకుంటే.. ఆ ఎన్నికలను కూడా ఒకే దశలో నిర్వహించలేకపోతున్నారు! ఏకంగా 44 రోజుల పాటు వివిధ దశల్లో పోలింగ్ జరగనుంది! దీనికి కారణం ఏమిటంటే.. నిర్వహణ కష్టం కావడం! ప్రత్యేకించి భద్రతా సమస్యలు!
ఎన్నికల నిర్వహణకు తగినంత భద్రతా సిబ్బంది ఉండదు, దీంతో దేశమంతా ఒకే రోజున పోలింగ్ అసంభవం. దశల వారీగా నిర్వహిస్తే భద్రతా సిబ్బంది సరిపోతుంది. అది మొదటి సమస్య! అక్కడితో మొదలుపెడితే.. రకరకాల సమస్యలను ఎదుర్కొనడానికి ఏకంగా ఇన్ని దశల్లో ఎన్నికల నిర్వహణ జరుగుతూ ఉంది.
ఏతావాతా.. ఒక దేశం ఒకే సారి ఎన్నిక జరగాలని ప్రధాని మోడీకి ఎంత ఉత్సాహం ఉన్నా, కనీసం లోక్ సభ నియోజకవర్గాలను ఒకే దశలో నిర్వహించుకోలేని పరిస్థితి ఉందని ఒప్పుకోక తప్పదు! దేశమంతా ఒకే రోజు ఓటేసేంత స్థాయిలో ఏర్పాటు చేయలేని స్థితిలో భారత ప్రభుత్వం ఉంది. అందుకే ఏకంగా 44 రోజుల పాటు పోలింగ్ దశల వారీగా సాగబోతోంది!