ఏపీలో ఎన్నికల పోలింగ్ మొదటి దశల్లో లేదు! దీంతో పార్టీలకు కావాల్సినంత సమయం దక్కింది. మరి ఇలాంటి నేపథ్యంలో.. తాము ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థిత్వాల విషయంలో సవరణలకు దిగుతున్నారట తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు! జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
ఇప్పుడు నామినేషన్ల దాఖలుకే ఇంకా కావాల్సిన సమయం ఉండటంతో.. తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సవరణలు జరగబోతున్నాయనే టాక్ మొదలైంది.
కేవలం టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలోనే కాదు, జనసేన- బీజేపీల పోటీకి కేటాయించిన సీట్ల విషయంలో కూడా మార్పుచేర్పులు ఉంటాయనే వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం అభ్యర్థుల జాబితా విషయంలో పలు చోట్ల నిరసనలు సాగుతూ ఉన్నాయి. అసంతృప్తులు రోడ్డుకు ఎక్కుతున్నారు. జాబితాలో ప్రకటించిన వ్యక్తులకు సహకరించేది లేదంటూ పార్టీ శ్రేణులు బాహాటంగా ప్రకటిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఎలాగూ సమయం దొరికింది కాబట్టి.. మార్పుచేర్పులకు చంద్రబాబు నాయుడు మళ్లీ కసరత్తు చేస్తున్నారట!
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరఫున వందకు పైగా అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించేశారు. జనసేన పోటీకి 21 అసెంబ్లీ సీట్లను, బీజేపీ పోటీకి 10 అసెంబ్లీ సీట్లను ప్రకటించారు. ఇంకో 20 లోపు సీట్లకు మాత్రమే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే.. ఈ లెక్కల అలా ఉండదని, ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల విషయంలో మార్పులు చేయబోతున్నారట!
అలాగే జనసేన పోటీ అనుకున్న సీట్ల విషయంలో కూడా మార్పులు ఉంటాయట! బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుందో ఇంకా పూర్తి స్పష్టత లేదు. సమయం దొరికింది కాబట్టి.. ఈ అభ్యర్థుల ఎంపిక విషయాన్ని చంద్రబాబు మళ్లీ మారుస్తున్నారని, బీజేపీ, జనసేనల బలాన్ని దృష్టిలో ఉంచుకుని.. వారు ఎక్కడెక్కడ పోటీ చేయాలో చంద్రబాబు ఆల్రెడీ నిర్ణయించినా, తన నిర్ణయాలనే చంద్రబాబు నాయుడు మళ్లీ సమీక్షించబోతున్నారని.. ఈ మేరకు ఇప్పటికే చేసిన ప్రకటనల్లో మార్పు చేర్పులు తప్పవనే టాక్ ఇప్పుడు బయల్దేరింది. మరి ఈ సమీక్షలతో చంద్రబాబు నాయుడు జరుగుతున్న రచ్చలను చల్లారుస్తారో, కొత్త రచ్చలను రేపుతారో!