టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబునాయుడి ప్రలోభాలకు గురై పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పార్టీ మారారనే విమర్శలున్నాయి. జగన్ను వీడి, చంద్రబాబు వెంట నడిచిన పాపానికి నేడు ఆమెను రాజకీయంగా రోడ్డున పడేశారనే చర్చకు తెరలేచింది. పాడేరు సీటును గిడ్డి ఈశ్వరికి కాదని, కిల్లు వెంకటరమేష్నాయుడికి ఇచ్చారు. దీంతో గిడ్డి ఈశ్వరి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై ఫైర్ అవుతున్నారు.
2014లో పాడేరు నుంచి వైసీపీ తరపున ఈశ్వరి గెలుపొందారు. ఆ తర్వాత కొంత కాలానికి టీడీపీలో చేరారు. 2019లో ఆమె ఓడిపోయారు. 2024 ఎన్నికలకు వచ్చే సరికి గిడ్డి ఈశ్వరికి చంద్రబాబునాయుడు మొండిచేయి చూపారు. ఆమెకు బదులుగా కొత్త అభ్యర్థి వెంకటరమేష్ నాయుడిని బరిలో నిలిపారు.
ఈ నేపథ్యంలో తాజాగా పాడేరులో ఈశ్వరి ఇంట్లో టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఈశ్వరి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని తీర్మానించారు. గిడ్డి ఈశ్వరి మీడియాతో మాట్లాడుతూ తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఈశ్వరి రాజకీయ భవిష్యత్ అటోఇటో తేలిపోనుంది. ఈ దఫా ఆమె చట్టసభకు ఎన్నిక కాకపోతే, ఇక రాజకీయ భవిష్యత్ సమాప్తం అవుతుందనే చర్చ జరుగుతోంది.
టీడీపీలో చేరకుండా, జగన్ వెంటే నడిచి వుంటే తప్పకుండా ఆమె మంత్రి అయ్యే వారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ను కాదని చంద్రబాబు వెంట వెళ్లి, రాజకీయంగా తన జీవితానికి తానే సమాధి కట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నారంటున్నారు. ఈశ్వరిని టీడీపీ వీధిన పడేసిందనే విమర్శ బలంగా వినిపిస్తోంది.