స్వయంగా తాను నిర్మించిన పార్టీ అయితే.. నాయకుడికి ఉండే పట్టు వేరు. కానీ.. తెలుగుదేశం అనేది చంద్రబాబు నాయుడు వక్రమార్గాల్లో, కుట్రలతో కబ్జా చేసిన పార్టీ. పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి దక్కించుకున్న పార్టీ. అలాంటి పార్టీ మీద ఆయనకు తొలి నుంచి కూడా పూర్తిస్థాయిలో పట్టులేదు.
చంద్రబాబును ఏమాత్రం ఖాతరు చేయని నాయకులు ఆ పార్టీలో బోలెడు మంది మనకు కనిపిస్తారు. వారిద్వారా తన పరువు పోకుండా.. చంద్రబాబు కూడా వారితో మంచిగా ఉంటూ, వారికి కోపం రాకుండా నడుచుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎన్నికల సమయంలో.. పార్టీలో మరీ అంత సీనియర్లు కాకపోయినప్పటికీ.. చంద్రబాబు మీద అనేకమంది నాయకులు తిరుగుబాటు చేస్తున్నారు. వారికిక సర్దిచెప్పడం అనేది చంద్రబాబునాయుడుకు తలకుమించిన భారం అవుతోంది. ఆయన వల్ల కావడంలేదు. పార్టీ మీద చంద్రబాబుకు ఏమాత్రం పట్టులేదన్న సంగతి బయటపడిపోతోంది.
టికెట్లన్నీ ప్రకటించిన తర్వాత.. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సీటును మార్చడం అనేది చంద్రబాబు చేసిన పెద్ద తప్పుల్లో ఒకటి. రఘురామ ఒత్తిడికి తలొగ్గి దానిని ఆయనకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతుండగా.. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సిటింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు వర్గం తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోంది.
అలాగే పెడనలో బూరగడ్డ వేదవ్యాస్ ఇండిపెండెంటుగా అయినా పోటీలో ఉండి తీరుతానని అంటున్నారు. 2019లోనే 24లో టికెట్ ఇవ్వడం గురించి చంద్రబాబుకు తనకు హామీ ఇచ్చారని, ఇప్పుడు ఇవ్వకపోవడం దారుణం అని ఆయన అంటున్నారు. ఇండిపెండెంటుగా పోటీ చేసి తీరుతానని అంటున్న బూరగడ్డ వేదవ్యాస్, పార్టీ మారే అవకాశాన్ని కూడా కొట్టి పారేయడం లేదు.
అదే సమయంలో అరకు ఎమ్మెల్యే సీటు విషయంలో కూడా రచ్చరచ్చ అవుతోంది. అక్కడి మాజీ ఎమ్మెల్యే సివేరి దొన్నుదొర టికెట్ గురించి ఆశ పెట్టుకున్నారు. టికెట్ మరొకరికి దక్కడంతో.. ఇప్పుడు ఇండిపెండెంటుగా పోటీచేయబోతున్నట్టు ప్రకటించేశారు.
పాడేరులో కూడా అదేమాదిరి పరిస్థితి ఉంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా తెలుగుదేశం పార్టీ రెబల్ గా రంగంలోకి దిగుతున్నారు. అయితే ఆమెకు పార్టీ మారే ఉద్దేశం లేదు. ఇండిపెండెంటుగానే బరిలోకి దిగి ఎమ్మెల్యే సీటు గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తానంటున్నారు.
కొవ్వూరులో మాజీ మంత్రి జవహర్ కు టికెట్ దక్కలేదు. ఆయన ఇండిపెండెంటుగా బరిలోకి దిగుతానన్నారు. తర్వాత శాంతించారు గానీ.. నామినేషన్ల సమయానికి ఇలాగే ఉంటారని గ్యారంటీ లేదు.
ఇంకా అనేక నియోజకవర్గాల్లో అసంతృప్త అభ్యర్థులు పోటీచేసి తీరుతాం అని చెలరేగుతున్నారు. వారిలో కొందరిని చంద్రబాబు బుజ్జగించగలిగారు. కానీ.. ఇంకా చాలాచోట్ల పరిస్థితి చేయిదాటిపోతోంది. పైకి ఎన్ని మాటలు చెబుతున్నా.. పార్టీ మీద ఆయన పట్టు సడలిపోతున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.