Advertisement

Advertisement


Home > Politics - Analysis

వైకాపా ప్లస్సూ మైనస్సూ..జనసేనే!

వైకాపా ప్లస్సూ మైనస్సూ..జనసేనే!

జనసేన అనేది ఆంధ్ర రాజకీయాల్లో ఓ సంచలనం. ఒక్క సీటు గెల్చకోలేకపోయినా, కమిటీ అనేది లేకపోయినా కేవలం పవన్.. మనోహర్, నాగబాబు లు ముగ్గురు మాత్రమే కీలక బాధ్యులుగా వుండి పార్టీని నడుపుకుంటూ వచ్చారు.

2024 ఎన్నికలు ఓ సవాలు. ఈ టైమ్ లో జనసేన పూర్తిగా యాంటీ జగన్, యాంటీ వైకాపాగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీని అధికార పీఠంపై కూర్చో పెట్టడానికి రెడీ అయిపోయింది. ఎవరు ఏమనుకున్నా చంద్రబాబుకు అధికారం సాధించి పెట్టడమే తన ఎజెండా అనే విధంగా పవన్ వ్యవహరిస్తున్నారు. నలభై చోట్ల పోటీ చేస్తారేమో అనుకుంటే అందులో సగం చోట్ల మాత్రమే పోటీ చేస్తున్నారు. ఆ సగంలో కూడా సగం మంది తెలుగుదేశం జనాలకే టికెట్ లు ఇచ్చారు. ఏ మేరకు వంగి పోయారు పవన్ అన్నది అక్కడే అర్థం అయిపోతోంది.

చంద్రబాబు కూడా అదే విధంగా వున్నారు. అనుభవం తనది, బలం పవన్ ది అని ఓపెన్ గా ప్రకటించారు. ఇప్పుడు ఆంధ్రలో కనిపిస్తున్న ఊపు, రకరకాల సర్వే ఫలితాలు, ఎక్సెట్రా.. ఎక్సెట్రా కు జనసేన వెళ్లి తేదేపా వెనుక వుండడమే కారణం. ఇప్పుడు ఈ పరిణామం వైకాపాకు ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? అన్నది క్వశ్చను. కచ్చితంగా మైనస్ అవుతుందని, జనసేన ఓట్లు ఏవైతే వుంటాయో అవి కూటమికి వెళ్తాయని అందరూ చెబుతున్నారు. కానీ కాస్త దీనికి భిన్నంగా ఆలోచిస్తే..

175 స్ధానాలకు పట్టుమని పాతిక చోట్ల కూడా పోటీ చేయడం లేదు జనసేన. 150 స్ధానాల్లో సరైన కమిటీలు లేవు. కంట్రోలు లేదు. ఇక్కడ అంతా ఓటు బదిలీ జరిగితేనే తెలుగుదేశం అధికారంలోకి వచ్చేది. అది జరగాలి అంటే తెలుగుదేశం జనాలు అక్కడ జనసేన జనాలను దగ్గరకు తీయాలి. కానీ పైన నాయకులు కలిసిపోయినంత మాత్రాన ఇక్కడ లోకల్ లీడర్లు కలవడం అంత సులువు కాదు. పైగా తెలుగుదేశం పార్టీ, దాని నాయకులు, కార్యకర్తలు ఎలా వున్నారు అంటే రేపే చంద్రబాబు ప్రమాణ స్వీకారం అన్న రేంజ్ లో వున్నారు. ఇప్పుడు అసలు జనసేన తమకు అవసరం లేదు అనే విధంగా ఆలోచిస్తున్నారు. కానీ చంద్రబాబు చాలా తెలివిగా జనసేన కార్కకర్తల బలాన్ని వాడుకుంటున్నారు అనే ఆలోచన వారికి లేదు.

ఇదిగో ఇక్కడే వైకాపా పావులు కదుపుతోంది. ఎక్కడ జనసేన లేదో అక్కడి జనసేన లోకల్ లీడర్లను తమ పార్టీలోకి లాగేస్తోంది. ప్రతి చోటా ఇప్పుడు అదే కార్యక్రమం జరుగుతోంది. జనసేన పోటీ చేయని చోట అంతా లోకల్ లీడర్లు వైకాపా కండువా కప్పుకుంటున్నారు. వారికి ఓటు బ్యాంక్ లేదని, వెళ్లినా నష్టం లేదని జనసేన హార్డ్ కోర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ సర్ది చెబుతున్నాయి. మరి లోకల్ లీడర్లకు బలం లేదు. ఓటు బ్యాంక్ లేదు అంటే జనసేనకు ఎక్కడి నుంచి వున్నట్లు? పోల్ మేనేజ్ మెంట్ ఎవరు చేస్తారు? కార్యకర్తలు అన్నాక ఎవరో ఒకరికి జవాబుదారీ వుంటుంది. నాయకత్వం వుంటుంది. కానీ వాళ్లంతా వైకాపాలోకి వెళ్తే వీళ్లను గైడ్ చేసేది ఎవరు?

భాజపా అంటే సంప్రదాయంగా అభిమానించే ఓటర్లు లేకపోలేదు. కానీ ఎందుకు ఓట్లు ఎన్నో కొన్ని పడడం లేదు. ఎందుకంటే లోకల్ కేడర్ అనేది లేకపోవడం వల్ల. జనసేన ఇప్పుడు దృష్టి పెట్టాల్సింది పోటీ చేస్తున్న స్ధానాల మీద కాదు, చేయని స్ధానాల మీద. అక్కడ పార్టీని పదిలంగా వుంచడం మీద.

కానీ ఈ దిశగా ఆలోచించే అవకాశం ఇప్పుడు జనసేనకు లేదు. ఇప్పటి వరకు జనసేన వ్యవహారాలు చూసిన నాదెండ్ల మనోహర్ తన స్వంత నియోజకవర్గంలో తాను గెలవడం మీదే దృష్టి పెట్టి వున్నారు. పవన్ కళ్యాణ్ తను పోటీ చేస్తున్న పిఠాపురం, అలాగే తమ పార్టీ పోటీ చేస్తున్న స్ధానాల మీద దృష్టి పెట్టారు. నిజానికి గత అయిదేళ్లుగా పార్టీని బలంగా బిల్డ్ చేసి వుంటే, ఇప్పుడు కొంత మంది జారిపోయినా, ఇబ్బంది వుండేది కాదు. కానీ అలా చేయలేదు.

ఇప్పుడు ఓట్ల బదిలీ జరిగేది కేవలం హార్డ్ కోర్ యాంటీ జగన్ అనే వాళ్లు జనసేనలో వుంటేనే. అలాంటి వారి శాతం ఎంత వుంటుంది? 2019లో జనసేన ఓట్లు చాలా వరకు వైకాపా పడ్డాయి అంటే కారణం ఇలాంటిదే. అంతే కాక ఆజన్మ వైనం అనే మాదిరిగా ఇచ్ఛాపురం నుంచి ప్రకాశం జిల్లా వరకు వివిధ కులాల మధ్య వైరుధ్యం బలంగా అలాగే వుంది. ఇవన్నీ అక్కడ జనసేన పోటీ చేస్తే ఒకలా వుంటుంది. లేదంటే మరోలా వుంటుంది.

అందువల్ల వైకాపా ఓటమికి కారణమైన జనసేనే… విజయానికి కారణమైన జనసేనే. మధ్యలో తేదేపా మాత్రం తన కుల మీడియా మీద, అదృష్టం మీద భారం వేసి కూర్చోవాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?