బెంగళూరు నగర శివార్లకు కూతవేటు దూరంలో ఉంటుంది హిందూపురం. ఫలితంగా ఆది నుంచి హిందూపురం ప్రాంతం ఇండస్ట్రియల్ ఏరియాకు కేరాఫ్ గా నిలిచింది. ప్రత్యేకించి స్పిన్నింగ్ మిల్లులు, చిన్న చిన్న మోటర్ ఇండస్ట్రీలు, మహిళలకు ఉపాధిని చూపించే బట్టల స్టిచింగ్ కర్మాగారాలు.. ఇలాంటివి హిందూపురం చుట్టుపక్కల ఎక్కువ! దీంతో హిందూపురానికి అనంతపురం జిల్లా నలుమూలల నుంచి వలస వచ్చిన వారే ఎక్కువ ఉంటారు. వ్యవసాయంతో ఉపాధి లేని వాళ్లు, సొంత ఊళ్లో ఉపాధి లేని వాళ్లు.. హిందూపురానికి వచ్చి ఫ్యాక్టరీల్లో పని చూసుకోవడమో, చిన్నాచితక పనులు చేసుకుంటూ ఉంటారు. దీంతో టౌనంత లేబర్ క్లాస్ జనాభా గణనీయంగా ఉంటుంది.
ఎందుకో ఆది నుంచి హిందూపురం ఒక ప్లాన్డ్ టౌన్ లా లేదు. ఇరుకు రహదారులు, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, టౌనంతా చిందరవందరగా ఉంటుంది. ధనికులకు కొదవలేదు. పెద్దపెద్ద ఇళ్లు ఉంటాయి. అయితే రోడ్లు మాత్రం ఇరుకే! పెద్ద పెద్ద ఇళ్లు ఉన్న వీధుల్లోకి ఒక కార్ వెళ్లిందంటే ఎదురొచ్చే వాహనం రివర్స్ లో పయనించాల్సినంత దారుణంగా ఉంటాయి రోడ్లు!
దశాబ్దాలకు దశాబ్దాల నుంచి ఇదే పరిస్థితి. ఇండస్ట్రియల్ ఏరియా కావడమే హిందూపురానికి వరం, శాపం! అన్నట్టుగా పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇక్కడ నుంచి గతంలో ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా వ్యవహరించారు అని చెప్పుకోవడమే తప్ప ఎలాంటి డెవలప్ మెంట్ కనిపించదు! అదేమంటే ఇండస్ట్రీలంతా ఎన్టీఆర్ వల్లే అంటారు. అయితే హిందూపురానికి ఏదైనా అడ్వాంటేజ్ ఉందంటే అది బెంగళూరు దగ్గర కావడమే తప్ప ఇంకోటేదీ అక్కడ ఆ ఇండస్ట్రీల ఏర్పాటుకు కారణం కాదు. హిందూపురం.. కర్ణాటకలోని గౌరీబిదనూరు, దొడ్డ బళాపురం.. పక్కపక్క ఊర్లు ఇవి. బెంగళూరు వరకూ ఒకదాని తర్వాత మరోటి వస్తాయి. ఇవన్నీఒకే రకమైన ఇండస్ట్రీలతో ఉంటాయి.
ఆ సంగతలా ఉంటే.. పదేళ్ల నుంచి హిందూపురానికి బాలకృష్ణ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. వరసగా మూడోసారి పోటీకి దిగుతున్నారు. మరి బాలకృష్ణ ఉద్ధరించింది ఏమీ లేదు. మరి ఎలా గెలుస్తున్నారంటే.. ప్రజల గుడ్డి అభిమానం మీద బాలకృష్ణ బండి నడుస్తోంది. భారీగా బీసీల జనాభా ఉండటం, ముస్లింలు కూడా బీసీలతో మమేకం అయిపోయిన ప్రాంతం కావడంతో బాలకృష్ణకు కలిసొస్తోంది. దీనికి మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు బాగా ఉన్న నియోజకవర్గం ఇది. ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు సహించరు!
ఇప్పుడు కూడా మూడు వర్గాలు, ఆరు గ్రూపుల పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇక్బాల్ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక గుదిబండను వదిలించుకుంది. అయితే.. నవీన్ నిశ్చల్ ఈ సారి అంతర్గతంగా ఏం చేస్తాడనేది శేష ప్రశ్న! హిందూపురానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ చార్జిని నియమించినప్పుడు నవీన్ తన అసహనాన్ని ఫ్లెక్సీల రూపంలో ఇన్ డైరెక్ట్ గా వెల్లగక్కారు. అలా తన ఉద్ధేశ్యాన్ని చెప్పకనే చెప్పారు! కాబట్టి ఏ మేరకు అంతర్గత సహకారం ఉంటుందో అంచనా వేయొచ్చు.
పల్లెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రిప్ ఉంది. అదే ఆ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్! అయితే బాలకృష్ణను ఇంకోసారి, మరోసారి గెలిపించుకుంటే అది హిందూపురం ఖర్మ అని అనుకోవాలంతే! ఆరు నెలలకో ఏడాదికో ఒక సారి షో చేస్తే అదే ఎమ్మెల్యేగా తను పని చేయడం అనేదానికి బాలకృష్ణ ఫిక్సయ్యారు. వరసగా మూడోసారి గనుక గెలిస్తే.. ఒక ఐదేళ్లకు ఒకసారి బాలకృష్ణ నామినేషన్ వేసేందుకే అటు వెళ్లినా పెద్ద ఆశ్చర్యపోయే పరిస్థితి ఉండదు!