బోలెడన్ని కసరత్తులు, చంద్రబాబు మార్కు సర్వేలు, రాబిన్ శర్మ నివేదికలు, ఐవీఆర్ఎస్ సర్వేలు.. ఇన్ని చేసిన తర్వాత అపర చాణుక్యులు అయిన చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థుల విషయంలో ఇంకా తర్జనభర్జనలు కొనసాగుతూ ఉన్నాయి! అనేక చోట్ల చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా ఇన్నాళ్లూ పార్టీలో పని చేసిన వాళ్లు కాలు దువ్వుతున్నారు! చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థులకు సహకరించేది లేదంటూ వాళ్లు బాహాటంగా చెబుతున్నారు! అలాంటి వారిలో చాలామందిని చంద్రబాబు నాయుడు కూడా లెక్క చేయడం లేదు!
అయితే కొన్ని చోట్ల మాత్రం చంద్రబాబు పునరాలోచనలో పడిపోయినట్టుగా స్పష్టం అవుతోంది. అది మిత్రపక్షాలకు కేటాయించిన సీట్లలో అయినా చంద్రబాబు మార్పులు చేస్తున్నారు. అనపర్తిని బీజేపీకి కేటాయించినట్టుగా కేటాయించి, ఝలక్ ఇచ్చారు. ఇక ఉండిలో అభ్యర్థికి చుక్కలు చూపించారు. ఆల్రెడీ ప్రచారం మొదలుపెట్టిన సిట్టింగ్ కు షాక్ ఇచ్చారు. ఆయన ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది!
ఇక పలు ఎస్సీ రిజర్వ్డ్ సీట్ల విషయంలో ఇప్పుడు మార్పులు అనే టాక్ వస్తోంది! ఆల్రెడీ మహాసేన రాజేష్ ను అభ్యర్థిగా ప్రకటించి ఆ తర్వాత మార్చేశారు. ఇప్పుడు మడకశిర, శింగనమల, తిరువూరు వంటి నియోజకవర్గాల్లో మార్పుల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మూడూ ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గాలు. మడక శిరలో అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి రచ్చ జరుగుతూనే ఉంది. చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థికి వ్యతిరేకంగా టీడీపీ వాళ్లు నిరసనలు చేపట్టారు. చివరకు చంద్రబాబు మార్పు చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఇక అనూహ్యంగా శింగనమల విషయంలో కూడా మార్పు ఊహాగానం వినిపిస్తోంది. బండారు శ్రావణిని చంద్రబాబు ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఆమె ఖర్చులకు డబ్బులు చూపడం లేదట! దీంతో.. ఆమెను మార్చి మరో అభ్యర్థిని ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక పచ్చమీడియా కోటాలో తిరువూరు టీడీపీ టికెట్ ను పొందిన కొలికిపూడి విషయంలో కూడా మార్పు ఊహాగానాలు వినిపిస్తుండటం గమనార్హం. కొలికిపూడి కి సీన్ లేదని.. అక్కడి టీడీపీ కార్యకర్తలు విజయవాడ లోక్ సభ అభ్యర్థి కేశినేని చిన్నికి స్పష్టం చేశారట! దీంతో ఇప్పుడు మార్పుకు కసరత్తు జరుగుతోందని, తిరువూరు విషయంలో ఉండవల్లి శ్రీదేవి పేరును పరిశీలిస్తున్నారట!
తనకు టికెట్ ను నిరాకరించడంతో ఉండవల్లి శ్రీదేవి తనకు వెన్నుపోటు పొడిచారంటూ ఇప్పటికే బాహాటంగా అసహనం వెల్లగక్కారు! ఇప్పుడు మార్పుల ప్రహసనంలో భాగంగా ఆమెకు తిరువూరు టీడీపీ టికెట్ ను ఇస్తారనే ప్రచారం జరుగుతుండటం గమనార్హం!