స్టీల్ ప్లాంట్ గురించి బాబు- బీజేపీ చెప్పదు కానీ…!

విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయనీయమని విశాఖలో జరిగిన టీడీపీ కూటమి తీర్మానం చేసింది. ఇది విశాఖ పార్లమెంట్ పరిధిలో మూడు పార్టీలు కలసి కూర్చుని చేసిన నిర్ణయం. విశాఖ స్టీల్…

విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయనీయమని విశాఖలో జరిగిన టీడీపీ కూటమి తీర్మానం చేసింది. ఇది విశాఖ పార్లమెంట్ పరిధిలో మూడు పార్టీలు కలసి కూర్చుని చేసిన నిర్ణయం. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం కాకుండా చూస్తామని స్థానిక నేతలు అంటున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం గత మూడేళ్లుగా నలుగుతోంది. ఈ అంశం ఇపుడు ఎన్నికల అజెండాగా మారుతోంది. విశాఖలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల మీద ప్రభావం చూపించే స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద బీజేపీ కేంద్ర పెద్దలు ఎవరూ మాట్లాడడం లేదు. బాధ్యత గలిగిన స్థానాలలో కూర్చున్న వారు ఎవరూ  విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని చెప్పడంలేదు

తెలుగుదేశం పార్టీ వ్యవహారం అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు అంటోంది. స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీతో చిలకలూరిపేట సభలో హామీ ఇప్పించలేకపోయింది అని స్టీల్ ప్లాంట్ కార్మికులు గుర్రుమంటున్నారు. ఇంతకాలం అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద వైసీపీ మీద నిందలేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద టీడీపీ మాట్లాడేది.

ఇపుడు బీజేపీతో డైరెక్ట్ పొత్తు ఉంది. దాంతో ఎలా ఈ అంశం మీద ముందుకు వెళ్లాలి అన్నది ఆ పార్టీలో చర్చ సాగుతోంది. దాంతో స్థానిక నాయకత్వం దీని మీద హామీ ఇస్తే సరిపోతుందేమో అనుకున్నారేమో విశాఖలో కూటమిని గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద పోరాడుతామని అంటున్నారు.

ఈ అంశం లోకల్ గా పోరాడితే తేలదని అందరికీ తెలుసు. కేంద్ర బీజేపీని ఒప్పించాలి. అది పొత్తు పార్టీగా టీడీపీ రాష్ట్ర నాయకత్వం ముందుండి చేయాల్సి ఉంది. అది స్టీల్ ప్లాంట్ కార్మికులకూ తెలుసు. కానీ స్థానికంగా నేతలు ఇచ్చే ఈ హామీలను నమ్మి ఉక్కు కార్మికులు ఓట్లు కురిపిస్తారా అన్నదే ఇపుడు అంతా తర్కించుకుంటున్నారు.