టీడీపీ కొంప ముంచడం ఖాయం!

ఆయన ఇంటిపేరు గొంప. టీడీపీ కొంప ముంచడం ఖాయమని అంటున్నారు. ఎక్కడా తగ్గేదే లేదు అన్నట్లుగా గొంప క్రిష్ణ ముందుకు సాగుతున్నారు. ఎస్ కోటలో ఆయన ఎన్నికల ప్రచారం మొదలెట్టేశారు. తాను చెప్పినట్లుగానే ఇండిపెండెంట్…

ఆయన ఇంటిపేరు గొంప. టీడీపీ కొంప ముంచడం ఖాయమని అంటున్నారు. ఎక్కడా తగ్గేదే లేదు అన్నట్లుగా గొంప క్రిష్ణ ముందుకు సాగుతున్నారు. ఎస్ కోటలో ఆయన ఎన్నికల ప్రచారం మొదలెట్టేశారు. తాను చెప్పినట్లుగానే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిపోయారు.

ఈ విషయంలో టీడీపీ అధినాయకత్వం మాటలను ఆయన ఖాతరు చేయలేదు. ఎమ్మెల్సీ ఇస్తామని టీడీపీ యువనేత చెప్పినా నో అని చెప్పి వచ్చేశారని అంటున్నారు. విశాఖ ఎంపీ అభ్యర్ధి గొంప వర్గీయులతో చేసిన రాయబారాలు కూడా ఫలించలేదు.

ఎస్ కోట యువనేతగా గుర్తింపు ఉన్న ఎన్నారై గొంప క్రిష్ణ తన ఎన్నికల ప్రచారాన్ని లాంచనంగా మొదలుపెట్టారు. ఆలయాలను ఆయన దర్శించుకున్నారు. దేవుళ్ళకు మొక్కుకున్నారు. తనను గెలిపించమని కోరుకున్నారు.

ఆయన వెంట ఎస్ కోట టీడీపీలోని అధిక సంఖ్యలో నేతలు మాజీ ఎంపీటీసీలు, కీలక నేతలు పార్టీ నేతలు ఉన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కూడా హజరయ్యారు. గొంప క్రిష్ణ ఇండిపెండెంట్ గా పోటీకి దిగడంతో ఎస్ కోట టీడీపీ రెండుగా చీలినట్లు అవుతోంది. 

మాజీ ఎమ్మెల్యే కోళ్ళ లలితకుమారికి అధినాయకత్వం టికెట్ ఇచ్చింది. ఆమెని ఓడించడం తాను గెలవడం అన్నది గొంప క్రిష్ణ అజెండాగా ఉంది. ఈ విషయంలో ఆయన పూర్తి విజయం సాధిస్తారా సగం విజయం సాధిస్తారా అన్నది చూడాలి. ఏది జరిగినా టీడీపీకి భారీ నష్టం తప్పదని అంటున్నారు. వైసీపీని ఇది నెత్తిన పాలు పోసినట్లే అంటున్నారు.