లోక్ సభ ఎన్నికల్లో ఫేస్ 2 పోలింగ్ కు సర్వం సిద్ధం అయ్యింది. శుక్రవారం రోజున దేశవ్యాప్తంగా మొత్తం 89 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 13 రాష్ట్రాల పరిధిలోని వివిధ లోక్ సభ సీట్లకు ఈ దశలో పోలింగ్ జరుగుతూ ఉంది. ఈ దశలో మొత్తం లోక్ సభ స్థానాలకు ఎన్నికలను పూర్తి చేసుకుంటున్న రాష్ట్రంలో కేరళ నిలబోతోంది.
కేరళలోని 20 లోక్ సభ సీట్లకూ ఈ విడతలో పోలింగ్ పూర్తి కానుంది. కర్ణాటకలో దాదాపు సగం స్థానాలకు పోలింగ్ పూర్తవుతోంది. దక్షిణ కర్ణాటక ప్రాంతంలోని లోక్ సభ స్థానాలకు ఈ దశలో పోలింగ్ జరుగుతోంది. నార్త్ కర్ణాటకలోని స్థానాలకు తదుపరి దశ ల్లో పోలింగ్ ఉండబోతోంది.
ఇక అస్సాం, బిహార్, ఛత్తీస్ ఘడ్, మణిపూర్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, త్రిపుర, యూపీ, వెస్ట్ బెంగాల్ లలో కూడా వివిధ లోక్ సభ సీట్లకు ఈ దశలో పోలింగ్ జరుగుతోంది. బెంగాల్ లో మూడు లోక్ సభ సీట్లకు ఈ దశలో పోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. తొలి విడత పోలింగ్ లో దాదాపు వంద లోక్ సభ సీట్లకు పోలింగ్ పూర్తి కాగా, రెండో దశలో 89 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
ఇక రెండో దశలో బరిలో ఉన్న ప్రముఖుల్లో కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ ఉన్నారు. వయనాడ్ నుంచి రెండో సారి పోటీ చేస్తూ ఉన్న రాహుల్ విషయంలో రేపు ప్రజలు తీర్పును ఇవ్వనున్నారు. అలాగే మరో కాంగ్రెస్ ప్రముఖుడు శశిథరూర్ కూడా కేరళ నుంచినే పోటీలో ఉన్నారు. కర్ణాటకలో బెంగళూరు రూరల్ నుంచి డీకే సురేష్, బెంగళూరు నార్త్ నుంచి శోభా కరంద్లాజే, బెంగళూరు సౌత్ నుంచి తేజశ్వి సూర్య, మండ్యా నుంచి కుమారస్వామి, మథుర నుంచి హేమమాలిని, మీరట్ నుంచి అరుణ్ గోవిల్.. వీళ్లంతా రెండో దశ లో పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాల నుంచి బరిలో ఉన్న ప్రముఖులు!
మే ఏడో తేదీన మూడో విడత పోలింగ్ జరగనుంది, నాలుగో విడత పోలింగ్ మే 13న జరగనుంది. ఏపీ- తెలంగాణ రాష్ట్రాల్లోని లోక్ సభ స్థానాలకు, ఏపీ అసెంబ్లీకి నాలుగో విడతలో పోలింగ్ జరగనుంది.