ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చాలా తెలివైన రాజకీయ నాయకురాలు. అధికారం ఎక్కడుంటే, అక్కడ ఆమె వాలిపోతుంటారని ప్రత్యర్థులు బహిరంగంగా, కూటమి నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతుంటారు. రాజకీయ విమర్శల్ని ఆమె ఏ మాత్రం పట్టించుకోరు. తాను అనుకున్నది సాధించుకునేందుకు ఆమె ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం స్వపక్షం వారిని రాజకీయంగా బలిపెట్టడానికి వెనుకాడరనే విమర్శ ఆమెపై బలంగా వుంది.
ప్రస్తుతం ఆమె రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి కూటమి తరపున పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శల దాడి జరుగుతోంది. గతంలో ప్రకాశం జిల్లా కారంచేడులో పురందేశ్వరి అత్తింటి కుటుంబ సభ్యులు దళితులపై ఊచ కోతను తెరపైకి తీసుకురావడం గమనార్హం. అలాగే పురందేశ్వరి కాపు ద్వేషిగా ఆధారాలతో సహా ప్రచారం చేయడాన్ని ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి వుంటుంది. ఎందుకంటే రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో కాపుల ఓట్లు గెలుపోటములపై ప్రభావం చూపే స్థాయిలో ఉన్నాయి.
“మంచినీళ్లు తాగినందుకే దళితులపై మారణకాండ చేసిన పురందేశ్వరి కుటుంబం ధన, అధికార మదం ఉన్న పురందేశ్వరికా మనం ఓటు వేసేది!.. దీనికి సాక్ష్యం కారంచేడు రుధిర ఘటన దళితులారా, ఓ బీసీలారా ఆలోచించండి”
“ఆంధ్రాలో 16 సీట్లలో ఒక్కటి కూడా కాపులకి ఎందుకు ఇవ్వలేదు? ఈ కాపు ద్వేషికా మనం ఓటు వేసేది?”
ఇలాంటి పోస్టులు పురందేశ్వరిపై వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ నిజాలే కావడంతో కౌంటర్ ఎలా ఇవ్వాలో బీజేపీకి దిక్కుతోచని పరిస్థితి. పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాలు దక్కించుకున్న బీజేపీ, వీటిలో కనీసం ఒక్క సీటును కాపులకు ఇవ్వకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. పురందేశ్వరి తీరును తప్పు పడుతూ శ్రీకాళహస్తి బీజేపీ ఇన్‌చార్జ్ కోలా ఆనంద్ నేరుగా జాతీయ, రాష్ట్ర పార్టీకి ఘాటు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఇలాగైతే బీజేపీకి కాపు, బలిజ కులస్తులు ఎందుకు ఓటు వేస్తారని ఆయన ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో పురందేశ్వరిపై కాపులంతా ఆగ్రహంగా ఉన్నారు. ఇక కారంచేడు ఘటన ఇప్పటికీ ఏపీలో ఓ చేదు జ్ఞాపకమే. ఆ ఘోరం వెనుక పురందేశ్వరి అత్తింటి కుటుంబం, ఆమె సామాజిక వర్గం వుందన్నది బహిరంగ రహస్యమే. కారంచేడు దుర్ఘటనకు బాధ్యుడిగా భావించి దగ్గుబాటి వెంకేటశ్వరరావు తండ్రి చెంచురామయ్యను 1989 ఏప్రిల్ 7న అదే గ్రామంలో మావోయిస్టులు చంపారు. దగ్గుబాటి కుటుంబం అంటేనే… దళిత వ్యతిరేకిగా చూస్తారు. ఈ నేపథ్యంలో పురందేశ్వరిపై వ్యతిరేక ప్రచారం ఓ రేంజ్‌లో సాగుతోంది. దళిత, బీసీ, కాపు ఓటర్లలో ఈ ప్రచారం ఆమెకు భారీ నష్టం కలిగిస్తుందనే ఆందోళన బీజేపీలో కనిపిస్తోంది.