తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు.. వర్ల రామయ్య రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ముందు చిన్న టెంటు వేసుకుని అక్కడ నివసిస్తున్నారేమో అనిపిస్తుంది! ఎందుకంటే.. పొద్దస్తమానమూ ఆయన ఒక కాగితం పట్టుకుని ఎన్నికల అధికారి వద్దకు వెళుతూనే ఉంటారు. కాగితం అంటే.. ఆషామాషీ కాదు! ప్రతిరోజూ అధికార్ల మీద పితూరీలే!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి మీద కంప్లయింట్లే! రోజుకు మూడువేళలా భోజనాలు తిన్నట్టుగా.. రోజంతా చీటికీ మాటికీ ఎన్నికల అధికారి దగ్గరకు వెళ్లడం కంప్లయింటు ఇవ్వడం ఆయన పని. రాష్ట్రంలో ఎక్కడా ఏ అల్లరీ లేకపోతే.. పనిగట్టుకుని.. రాష్ట్రాన్నంతా భూతద్దంలో చూసి, ఏదో ఒకటి వడిసిపట్టుకుని దానితో పితూరీ బనాయించేలాగా కనిపిస్తున్నారు ఆయన! ఎందుకంటే, నెల్లూరు టౌను డీఎస్పీ మీద తయారుచేసిన కంప్లయింటు అలాగే ఉంది.
నెల్లూరు టౌన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ని తక్షణం విధుల నుంచి తప్పించాలట. ఆయన ఆ పదవిలో ఉంటే ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరుగుతుందనే నమ్మకం లేదుట. ఇంతకూ వర్ల రామయ్య చెబుతున్న కారణం ఏంటో తెలుసా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్న నీలకంఠరెడ్డికి ఈ నెల్లూరు టౌన్ డీఎస్పీ బంధువుట. అందువల్ల ఆయన వైకాపాకు అనుకూలంగా ఉంటూ, ప్రతిపక్షాల వారిని ఇబ్బంది పెడుతున్నారట.
ఆ మాటలు అంటున్నారే తప్ప.. నిర్దిష్టంగా ఆయన ప్రతిపక్షాల వారిని ఎలా ఇబ్బంది పెడుతున్నాడో.. ఏ రకంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నాడో చెప్పడం లేదు. కేవలం బంధుత్వాన్ని సాకుగా చూపిస్తున్నారు. అయినా.. అధికార్లకు బంధుత్వాలు ఉండడం కూడా పాపమేనా అని ప్రజలు అనుకుంటున్నారు.
తెలుగుదేశం పార్టీ నాయకులకు ఓటమి భయంతో అసహనం పెరిగిపోయినప్పుడు మాత్రమే ఇలాంటి అడ్డగోలు ఫిర్యాదులు వస్తుంటాయని ప్రజలు అనుకుంటున్నారు. ఆమాటకొస్తే రాష్ట్రంలో ఉన్నత పదవుల్లో ఉండే అనేకమంది అధికార్లకు రాజకీయ బంధుత్వాలు ఉంటాయని, వారందరినీ కూడా పదవుల్లోంచి మార్చేయాలా అని ప్రజలు అంటున్నారు. తెలుగుదేశం బుద్ధులు మరీ సంకుచితంగా ఉన్నాయని ఎద్దేవా చేస్తున్నారు.