అపుడే పదవుల పంపకాలు మొదలయిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పక్షం రోజులు కాలేదు. లోకల్ బాడీస్ విషయంలో గోడ దూకుళ్లకు తెర లేపాలని చూస్తున్నారు. విశాఖ కార్పొరేషన్ ఇపుడు వైసీపీ చేతిలో ఉంది.
నాలుగేళ్ల వరకూ మేయర్ మీద అవిశ్వాసం పెట్టకూడదని వైసీపీ ప్రభుత్వం హయాంలో చట్టం చేశారు. ఇపుడు ఆ చట్టాన్ని మార్చి మూడేళ్ళకే అని సవరిస్తారని అంటున్నారు. 2021 మార్చిలో విశాఖ మేయర్ పీఠం వైసీపీ పరం అయింది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం చూసుకుంటే 2025 మార్చి వరకూ మేయర్ సీటుకు ఢోకాలేదు.
కానీ టీడీపీ తమ్ముళ్ళ ఆరాటం అలాగే అధినాయకత్వం ఆలోచనలు చూస్తూంటే మూడేళ్ళకే అవిశ్వాసం అన్న సవరణలను తొందరలోనే తెస్తారని అంటున్నారు. 98 మంది కార్పోరేటర్లు ఉన్న విశాఖ కార్పొరేషన్ లో వైసీపీకి 57 మంది ఉన్నారు. టీడీపీకి 30 మంది ఉంటే జనసేన ప్లస్ బీజేపీకి కలిపి నలుగురు ఉన్నారు. వీరు కాకుండా ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఎమ్మెల్యేలు ఎంపీలు కలసి చూస్తే టీడీపీ మెజారిటీ యాభైకి చేరుకుంటుందని అంటున్నారు.
వైసీపీ నుంచి కొందరిని తమ వైపు తిప్పుకుంటే దర్జాగా విశాఖ మేయర్ పీఠం తమ చేతిలోకి వస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు. గతంలో విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన నాయకునికే మేయర్ పీఠం అప్పగించాలని చూస్తున్నారు. తమకు సహకరించిన జనసేన బీజేపీలకు చెరో ఉప మేయర్ ఇస్తారని అంటున్నారు.
విశాఖ కార్పొరేషన్ కి 2026 ఏప్రిల్ దాకా పదవీ కాలం ఉంది. దాంతో రానున్న రెండేళ్ళలోనూ తమ ఆధీనంలో విశాఖ కార్పోరేషన్ ని ఉంచుకుంటే మొత్తం మెగా సిటీ అంతా టీడీపీ కూటమి గుప్పిట్లో ఉంటుందని భావిస్తున్నారు. విశాఖ మేయర్ పీఠం టీడీపీకి దక్కి నాలుగు దశాబ్దాలు అవుతోంది. 1987లో తొలిసారి గెలిచిన టీడీపీకి మళ్లీ ఆ చాన్స్ రాలేదు. దాంతో చరిత్రను తిరగరాయాలని చూస్తోంది. అంతే కాకుండా విశాఖ సిటీలో వైసీపీని రాజకీయంగా మరింతగా దెబ్బ తీయాలన్న అసలైన వ్యూహం ఇందులో ఉంది అని అంటున్నారు.